అమెరికాలో రాజకీయ దుమారం చెలరేగిన వేళ.. ఎప్‌స్టీన్ సె* కుంభకోణానికి సంబంధించిన ఫైల్స్‌లో మాయమైన ట్రంప్ ఫొటో తిరిగి ప్రత్యక్షం అయ్యింది. ఫోటోను తొలగించడంలో ట్రంప్ బ్యాచ్ హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే.. అందులో నిజం లేదని, తాత్కాలికంగా రివ్యూ కోసమే వాటిని తొలగించినట్లు అమెరికా న్యాయశాఖ తాజాగా ఒక స్పష్టత ఇచ్చింది.
జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన ఫొటోను, కీలక పత్రాలను డెమొక్రట్లతో కూడిన హౌజ్‌ఓవర్ కమిటీ సమక్షంలో అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ బయటపెట్టింది. ఇందులో ఎప్‌స్టీన్‌కు సంబంధించిన వేల ఫొటోలు, కీలక సమాచారంతో కూడిన లక్షల ప్రతాలు ఉన్నాయి. అయితే.. అందులో నుంచి కొన్ని ఫొటోలు, డాక్యుమెంట్లు కనిపించకుండా పోవడంతో డెమొక్రటిక్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రత్యేకించి ట్రంప్ తన భార్య మెలానియా.. ఎప్‌స్టీన్, అతని సహయకురాలు గిస్లేన్ మాక్స్‌వెల్‌తో దిగిన ఫొటో, అలాగే ట్రంప్ కొందరు అమ్మాయిలతో దిగిన ఫొటోలు మాయమయ్యాయి.
ఈ చర్యను ట్రంప్‌ను రక్షించేందుకు చేసిన ప్రయత్నమని డెమొక్రాట్లు ఆరోపించారు. మరోవైపు.. హౌస్ మైనారిటీ లీడర్ హకీమ్ జెఫ్రీస్ ఈ వ్యవహారంపై పూర్తి విచారణ డిమాండ్ చేశారు. ఈ తరుణంలో.. ట్రంప్ ఫోటోను అమెరికా న్యాయ శాఖ మళ్లీ పునఃప్రచురించింది.
అయితే.. ఆ ఫొటో తొలగింపు వెనుక ఎవరి ప్రమేయం లేదని న్యాయశాఖ స్పష్టత ఇచ్చింది. ఎవరి వ్యక్తిగత ప్రయోజనం కోసమే వాటిని తొలగించలేదు. ఆ ఫొటోల్లో ఎప్‌స్టీన్ బాధితులు ఎవరైనా ఉన్నారా? అని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు రివ్యూకు పంపారు. సమీక్ష అనంతరం అందులో ఎవరూ లేరని నిర్ధారించుకుని ఎలాంటి మార్పులు లేకుండానే తిరిగి ప్రచురించాం. ఇది బాధితుల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అంశమే అని ఎక్స్ ఖాతాలో జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఒక పోస్ట్ చేసింది.
ప్రముఖ ఇన్వెస్టర్‌గా గుర్తింపు పొందిన జెఫ్ ఎప్‌స్టీన్‌కు ట్రంప్, బిల్‌గేట్స్, బిల్ క్లింటన్, మైకేల్ జాక్సన్.. పలువురు సినీ ప్రముఖలతోనూ మంచి సంబంధాలు ఉండేవి. అయితే.. అందులో కొందరి లైంగిక ఆనందం కోసం జెఫ్రీ ఎప్‌స్టీన్ అమ్మాయిలను సరఫరా చేసేవాడని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మీటూ ఉద్యమ సమయంలో ఆయన అరెస్ట్ అయ్యాక.. సంచలనాలు వెలుగు చూడొచ్చని అంతా భావించారు. ఈ క్రమంలో.. 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అప్పటి నుంచి ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది.
ట్రంప్ హయాంలో ఎప్‌స్టీన్ ఫైల్స్ విషయాలు బయటకు వస్తాయని అంతా భావించారు. అయితే అలా జరగకపోవడంతో ట్రంప్ తీరుపైనే డెమొక్రట్లు, ట్రంప్ వ్యతిరేకులు అనుమానాలు వ్యక్తం చేయసాగారు. అయితే ఎప్‌స్టీన్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టత ఇస్తూ వస్తున్నారు. అటు డెమొక్రట్లతో పాటు ఇటు రిపబ్లికన్ల నుంచి ఎదురైన ఒత్తిళ్ల నడుమ చివరకు ఫైల్స్ బయటకు వచ్చాయి.
ఇందులో ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫోటోలు, ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్టులు, కాల్ లాగ్స్, కోర్టు పత్రాలు ఉన్నాయి. అయితే, బాధితులను ఎఫ్‌బీఐ చేసిన ఇంటర్వ్యూలు, అభియోగాలపై అంతర్గత న్యాయశాఖ నివేదికలు లేవంటూ డెమొక్రటిక్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే.. లక్షల పేజీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని.. బాధితుల గోప్యతను కాపాడేందుకు సమీక్ష ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని.. ఇందులో 200 మందికి పైగా న్యాయవాదులు పాల్గొంటున్నారని న్యాయశాఖ అంటోంది. సమీక్ష ముగిశాక.. అందులో వివరాలను యధాతథంగానే ప్రచురిస్తామని స్పష్టత ఇస్తోంది.


