వందేళ్ల ప్రస్థానంలో వేలాది మంది అఖిలభారత సర్వీసుల ఉద్యోగుల ఎంపిక
1926లో మొదలై ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకున్న సంస్థ
8 నుంచి 86కు పెరిగిన పరీక్షా కేంద్రాలు
గతంతో పోలిస్తే యూపీఎస్సీ పరీక్షార్థుల్లో పెరిగిన మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల భాగస్వామ్యం
ఫెడరల్ పీఎస్సీ నుంచి 1950లో యూపీఎస్సీగా రూపాంతరం
1950–51లో తొలిసారిగా 29 ఐఏఎస్, 31 ఐపీఎస్ పోస్ట్‌లకు ఎంపిక
ఏఐ, డిజిటల్ టెక్నాలజీతో మరింత పారదర్శకంగా నియామక ప్రక్రియ
సాక్షి, న్యూఢిల్లీ: అఖిలభారత సర్వీసుల్లో అత్యుత్తమంగా సేవలందించగల సమర్థుల ఎంపికలో అపార అనుభవం గడించిన యూపీఎస్సీ నేటితో వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుంటోంది. దేశ అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగ నియామక సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఈ వందేళ్ల ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను దాటుకొని వచ్చి ఎప్పటికప్పుడు అత్యంత పకడ్బందీగా ఎంపిక పరీక్షలు నిర్వహిస్తూ పబ్లిక్‌సర్వీస్ ఎగ్జామ్ వ్యవస్థలో తనదైన ముద్రవేసుకుంది. 2026 అక్టోబర్ ఒకటో తేదీతో యూపీఎస్సీ సంస్థ ఏర్పడి వందేళ్లు పూర్తయింది. 1926 అక్టోబర్ 1న భారత తొలి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా ప్రారంభమైన ఈ సంస్థ కాలక్రమంలో ఎన్నో మార్పులు పొంది నేడు స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థగా ఎదిగింది.
లండన్ పరీక్ష నుంచి భారతీయుల పోరాటం దాకా..
ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు ప్రతిభ ఆధారంగా జరగాలనే విధానం 1855లో ఐసీఎస్ పరీక్షతో ప్రారంభమైంది. ఆ పరీక్ష లండన్‌లో అందులోనూ ఇంగ్లిష్ మాధ్యమంలోనే బ్రిటన్ పాలకులు చేపట్టేవారు. 1862లో సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఇంగ్లండ్ వెళ్లి పరీక్ష రాసి 1863లో ఉత్తీర్ణులై తొలి భారతీయ ఐసీఎస్ అధికారిగా నిలిచారు. 1919 నాటికి 1,255 మంది ఐసీఎస్ అధికారుల్లో భారతీయులు కేవలం 78 మందే ఉన్నారు. జాతీయవాద ఉద్యమాల ఒత్తిడితో 1922లో ఐసీఎస్ పరీక్షను తొలిసారిగా భారత్‌లో చేపట్టారు. ఈ పరీక్షకు అలహాబాద్ వేదికైంది. 1924లో లీ కమిషన్ సిఫార్సుల అనంతరం 1926లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడింది. సర్ రాస్ బార్కర్ తొలి చైర్మన్‌గా వ్యవహరించారు.
రాజ్యాంగంలో ప్రత్యేక స్థానం
1949 ఆగస్టు 22న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగ సభలో యూనియన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు సంబంధించిన నిబంధనలను ప్రవేశపెట్టారు. ఇవి రాజ్యాంగంలోని 315తోపాటు 323వ అధికరణంలో భాగమయ్యాయి. నియామకాల్లో నిష్పాక్షికత, బంధుప్రీతి, పక్షపాతానికి తావులేకుండా ఉండేందుకు కమిషన్ స్వతంత్రత కీలకమని భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌తోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్, ఇంజినీరింగ్ సర్వీస్ ఎగ్జామ్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ,నేవల్ అకాడమీ, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్, ఇండియన్ ఎకనమిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్, కంబైన్డ్ జియోసైంటిస్ట్ ఎగ్జామ్, కేంద్రసాయుధబలగాల నియామక పరీక్ష, సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, స్టెనోగ్రాఫర్ ఇలా డజనుకుపైగా అత్యంత కీలకమైన పరీక్షలను యూపీఎస్సీ నిర్వహిస్తోంది.
వందేళ్లలో భారీగా విస్తరించిన ప్రస్థానం
1926లో భారత పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా ప్రారంభమైన ఈ సంస్థ 1937 ఏప్రిల్ 1న ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా రూపాంతరం చెందింది. 1938లో పలు ప్రభుత్వ సేవలకు కలిపి పోటీ పరీక్షల నిర్వహణ ప్రారంభమైంది. 1940లో తొలిసారిగా ఐసీఎస్‌లో భారతీయ అధికారుల సంఖ్య యూరోపియన్లను మించిపోయింది. 1947లో స్వాతంత్య్రం అనంతరం హెచ్.కె. కృపలానీ తొలి భారతీయ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది డిసెంబరులో స్వాతం్రత్యానంతర తొలి పరీక్ష నిర్వహించారు. ఐసీఎస్ స్థానంలో ఐఏఎస్ వ్యవస్థకు బీజం వేశారు. 1948లో తొలి బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారులను సంయుక్త పరీక్ష ద్వారా నియమించారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరును ప్రస్తుతమున్న యూపీఎస్సీగా మార్చారు.
అదే సమయంలో ఆర్.ఎన్. బెనర్జీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 1950–51లో అఖిలభారత సర్వీసుల కోసం తొలిసారిగా నియామక పరీక్షలు నిర్వహించారు. అప్పుడే 29 మంది ఐఏఎస్‌కు, 31 మంది ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. 1951లో ఆల్ ఇండియా సర్వీసెస్ చట్టం అమల్లోకి వచ్చింది. 1966లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మూడో ఆల్ ఇండియా సర్వీస్‌గా ఏర్పడి, 1967లో తొలి ఎంపికలు జరిగాయి. 2000లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ వ్యవస్థ ప్రారంభమైంది. 2013లో మెయిన్స్‌లో నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు, ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఆప్టిట్యూడ్ వంటి మార్పులు వచ్చాయి. 2021లో తొలిసారి మహిళలకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ,నేవల్ అకాడమీ పరీక్ష రాసేందుకు
అవకాశం కల్పించారు.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు..
1950లో ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్‌లు జరిగేవి. కాలక్రమేణా లక్షలాది మంది అభ్యర్థులు పోటీపడుతుండటంతో ప్రస్తుతం ఈ పరీక్షా కేంద్రాల సంఖ్య 86కు పెరిగింది. 1952లో సివిల్ సర్వీసెస్‌లో 83 మంది ఎంపికయితే వారిలో మహిళలు ముగ్గురే. అదే గత ఏడాది 958 మంది ఎంపికైతే అందులో 299 మంది మహిళలు ఉండటం విశేషం. 1955 నుంచిచూస్తే పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసిన ఎస్సీ అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అప్పట్లో ఇద్దరే ఎస్టీ అభ్యర్థులు పోస్ట్‌లు సాధించగా తాజాగా ఆ సంఖ్య 73కు పెరిగింది. 2025 సివిల్ సర్వీసెస్‌లో మహిళలు 31.2 శాతంగా ఉన్నారు. టాప్ 25 ర్యాంకుల్లో 11 స్థానాలను సాధించడం విశేషం. దివ్యాంగ అభ్యర్థులకు స్క్రైబ్ సదుపాయంతోపాటు అదనపు సమయం కేటాయింపు, నచ్చిన పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసే వెసులుబాటు కల్పిస్తున్నారు.
కొత్త సంస్కరణల బాటలో..
2026 సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌లో యూపీఎస్సీ కృత్రిమమేధను సైతం ఉపయోగించింది. సుమారు 5.50 లక్షల మంది అభ్యర్థులకు ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు చేపట్టారు. 15 ఏళ్ల అభ్యర్థుల డేటాను పరిశీలించి తప్పుడు సమాచారంతో అదనపు ప్రయత్నాలు పొందాలని చూసిన 569 దరఖాస్తులను తిరస్కరించారు. 2025లో యూనివర్సల్ రిజి్రస్టేషన్ నంబర్, ర్యాండమైజ్డ్ ఇంటర్వ్యూ బోర్డులు ప్రవేశపెట్టారు. 2026లో కొత్త పరీక్షా కేంద్రాలు, ప్రొవిజనల్ ఆన్సర్ కీ, ఆన్‌లైన్ డీపీసీ వ్యవస్థ, సైబర్ భద్రత చర్యలు చేపట్టారు. ప్రస్తుతం డాక్టర్ అజయ్‌కుమార్ చైర్మన్‌గా ఉన్నారు. యూపీఎస్సీలో ముగ్గురు మహిళలు సహా ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. శతాబ్ద కాలంలో పరీక్షల నిర్వహణ విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎగ్జామ్‌లను నిర్వహిస్తూ ప్రతిభ, నిష్పాక్షికత, సమాన అవకాశాలే తమ ప్రాథమిక సూత్రాలుగా సంస్థ ముందుకు సాగుతోందని యూపీఎస్సీ ఒక ప్రకటనలో పేర్కొంది.


