సోరెన్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
రాంచీ: జార్ఖండ్ పబ్లిక్ సర్విసు కమిషన్(జేపీఎస్సీ) పరీక్షల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జార్ఖండ్ హైకోర్టులో హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. 11వ, 13వ జేపీఎస్సీ పరీక్షల ద్వారా జరిగిన ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ల అమలుపై న్యాయస్థానం స్టే విధించింది. ఫుడ్ సేఫ్టీ అధికారుల నియామకాలను రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వు అమలుపై కూడా స్టే విధించింది.
నియమకాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. నోటిఫికేషన్లపై స్టే విధించింది. సెప్టెంబర్ 15లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంతోపాటు స్పందనను తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయితే, ఏ అభ్యర్థి నియామకంలోనైనా అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలితే, ఆ వ్యక్తి తదుపరి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఉద్యోగాన్ని కోల్పోతారని న్యాయస్థానం స్పష్టం చేసింది. జేపీఎస్సీ ద్వారా జరిగిన నియామకాలను ప్రభుత్వం రద్దు చేయడం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమేనని కోర్టు గుర్తించినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. కోర్టు స్టే వల్ల 450 మంది అభ్యర్థులకు ఉపశమనం లభించిందని అన్నారు. పబ్లిక్ సర్విసు కమిషన్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు 25 రోజులపాటు చేపట్టిన ఆందోళన నేపథ్యంలో, 2014 నుంచి జేపీఎస్సీ, ఒక అవుట్‌సోర్స్ ఏజెన్సీ నిర్వహించిన 45 పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది.


