ఉద్యమానికి విరామం | Jharkhand student protests end as government cancels 45 recruitment exams | Sakshi
Sakshi News home page

ఉద్యమానికి విరామం

Aug 20 2026 6:08 AM | Updated on Aug 20 2026 6:08 AM

Jharkhand student protests end as government cancels 45 recruitment exams

45 పరీక్షలను రద్దుచేస్తూ నోటిఫికేషన్‌

రెండు నెలల్లోపు డిమాండ్లను నెరవేర్చకపోతే మళ్లీ ఉద్యమిస్తామని స్పష్టీకరణ 

హేమంత్‌ సోరెన్‌ సర్కార్‌కు పరీక్షార్థుల అల్టిమేటమ్‌

రాంచీ: జార్ఖండ్‌లో ఉద్యోగ నియామక ప్రక్రియలో సంస్కరణల కోసం గత 25 రోజులుగా ఉద్యమిస్తున్న వేలాది మంది పరీక్షార్థులు, విద్యార్థులు రాంచీలోని జైపాల్‌సింగ్‌ ముండా స్టేడియంలో తమ నిరసనకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. పాత పరీక్షల రద్దు, జేపీఎస్సీ,జేఎస్‌ఎస్సీల్లో అస్తవ్యçస్త విధానాలు, పరీక్ష విధానంలో లోపాలను రూపుమాపాలంటూ తాము చేసిన డిమాండ్ల, పలు అంశాలను రెండు నెలల్లోపు పరిష్కరించాలని హేమంత్‌ సోరెన్‌ సర్కార్‌కు ఉద్యమనేతలు బుధవారం అల్టిమేటమ్‌ ఇచ్చారు.

 22 నియామక పరీక్షలను, పబ్లిక్‌ సర్వీస్‌కమిషన్, ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు నిర్వహించిన మరో 23 పరీక్షలను రద్దుచేస్తున్నట్లు సోరెన్‌ ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే ఉద్యమనేతలు ఇలా కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘‘మా ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపేస్తున్నాం. నియామక పరీక్షల్లో అక్రమాలపై సమగ్రస్థాయిలో దర్యాప్తుతోపాటు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి రెండు నెలల గడువిస్తున్నాం. ఆలోపు ప్రభుత్వం తన బాధ్యతను పూర్తిచేయకపోతే మళ్లీ ఉద్యమాన్ని మొదలెడతాం’’అని జేపీఎస్సీ–జేఎస్‌ఎస్సీ సంస్కరణల మంచ్‌ అధికార ప్రతినిధి పియూశ్‌ కుమార్‌ సింగ్‌ స్పష్టంచేశారు.

 ఉద్యమానికి విరామం ప్రకటించిన నేపథ్యంలో గత 15 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న రూపేశ్‌ కుమార్‌ పాల్, సవితా కుమారీ, రాహుల్‌ క్రాంతిలు దీక్షను విరమించారు. 26 రోజుల ఉద్యమధాటికి ప్రభుత్వం 22 రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామ్‌లను, 23 ఇతర పరీక్షలను రద్దుచేసిందని మంచ్‌ నేత రవీంద్ర పాశ్వాన్‌ చెప్పారు. ‘‘ఉద్యోగ పరీక్షల్లో అవకతవకలను బయటపెట్టిన ప్రజావేగు(విజిల్‌బ్లోయర్‌), ఆర్థిక శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ సంతోష్‌ కుమార్‌ మస్తానాను సస్పెన్షన్‌ ఎత్తేసి మళ్లీ విధుల్లోకి తీసుకోవాలి. గత పరీక్షల రద్దు నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయే వారి మీద మాకు సానుభూతి ఉంది. ఈ విషయంలో తప్పు అంతా ప్రభుత్వానిదే’’అని పాశ్వాన్‌ వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement