వంటగదిలోకి వెళ్లిన మహిళకు ఒక్కసారిగా షాకింగ్ దృశ్యం కనిపించింది. వంట చేసేందుకు వెళ్లిన ఆమెకు స్లాబ్పై ఏకంగా 12 అడుగుల భారీ కొండచిలువ కనిపించడంతో భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది.
ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో ఓ ఇంట్లో భారీ కొండచిలువ కలకలం రేపింది. తన పిల్లల కోసం వంట చేసేందుకు వంటగదిలోకి వెళ్లిన మహిళకు స్లాబ్పై భారీ కొండచిలువ కనిపించింది. ఒక్కసారిగా దానిని చూసి తీవ్ర భయాందోళనకు గురైన ఆమె గట్టిగా కేకలు వేసి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అనంతరం కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశారు. స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
దీంతో అటవీ శాఖ రెస్క్యూ బృందం అక్కడికి చేరుకుని కొండచిలువను పట్టుకున్నారు. ఇంత పెద్ద కొండచిలువను తమ ప్రాంతంలో ఇంతకుముందెప్పుడూ చూడలేదని, దానిని చూసిన సమయంలో తాను తీవ్రంగా భయపడ్డానని మహిళ తెలిపింది. ఈ కుటుంబంలో ఆ మహిళతో పాటు ఆమె భర్త, ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి: రెప్పపాటులో.. సీసీటీవీలో భయానక దృశ్యాలు


