సాక్షి,చెన్నై: ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీలే అక్రమాలకు పాల్పడితే శిక్ష ఏ స్థాయిలో ఉంటుందో తమిళనాడు ప్రభుత్వ తాజా చర్యలు మరోసారి నిరూపించాయి. లంచం డిమాండ్ చేయడం, డిజిటల్ రూపంలోనూ వసూలు చేయడం వంటి ఆరోపణలపై తమిళనాడు వ్యాప్తంగా ఐదుగురు పోలీసులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం రాష్ట్రంలో చర్చాంశనీయంగా మారింది. సీఎం సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో అవినీతిని ఏమాత్రం సహించేది లేదనే స్పష్టమైన సంకేతాలను ఈ ఘటన ద్వారా పంపింది.
తిరునెల్వేలి, చెన్నై పరిసర ప్రాంతాలలో జరిగిన వేర్వేరు ఘటనల్లో పోలీసులు రూ.1,000 నుంచి రూ.10,000 వరకు లంచాలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సాంకేతికతను సామాన్యులకు మేలు చేసేందుకు కాకుండా, అవినీతికి అడ్డుపెట్టుకోవాలని చూసిన కిందిస్థాయి సిబ్బందికి సీఎం విజయ్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
వాహన తనిఖీల సమయంలో ద్విచక్ర వాహనదారుడిని రూ.1,000 డిమాండ్ చేసిన హెడ్ కానిస్టేబుల్ సోర్ణరాజ్, నగదు లేకపోవడంతో నేరుగా తన జీపే నంబర్‌కు డబ్బులు వేయించుకున్నట్లు విచారణలో తేలింది. ఈ దారుణానికి పాల్పడిన ఆయన్ను తక్షణమే సస్పెండ్ చేశారు.
దొంగిలించబడిన ద్విచక్ర వాహనాన్ని బాధితునికి అప్పగించేందుకు ఎస్‌ఐ శివరాజ్, కానిస్టేబుల్ వివేక్ కలిసి జీ-పే ద్వారా రూ.10,000 వసూలు చేశారు. ఈ ఆరోపణలు రుజువు కావడంతో ఇద్దరినీ సస్పెండింగ్ వేటు పడింది. లంచం డిమాండ్ చేసిన ఎస్‌ఐపై విజిలెన్స్ విచారణ జరిపించి వెంటనే సస్పెండ్ చేయించారు. గతంలో అన్నానగర్ స్టేషన్‌లో పనిచేస్తున్న సమయంలో లంచం తీసుకున్నట్లు తేలిన ఎస్‌ఐ మరీశ్వరన్‌ను ఏకంగా సర్వీసు నుంచే తొలగిస్తూ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు.
సీఎం విజయ్ పాలనా దక్షతకు ఇదే నిదర్శనం
తమిళనాడులో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ శాఖలో ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవినీతి రహిత పాలనే ధ్యేయంగా అడుగులు వేస్తున్న సీఎం విజయ్, చిన్నస్థాయి అవినీతిని కూడా ఉపేక్షించేది లేదని ఈ చర్యల ద్వారా నిరూపించారు.
పోలీసు వ్యవస్థలో బాధ్యతాయుతమైన పారదర్శకతను తీసుకురావడంలోనూ, ప్రజలకు సత్వర న్యాయం అందించడంలోనూ సీఎం విజయ్ అమలు చేస్తున్న కఠినమైన నిబంధనలు అభినందనీయం. అక్రమాలకు పాల్పడే ఎంతటి వారైనా చట్టం ముందు సమానులేనని, ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతికి తావులేదని ఈ ఘటన నిరూపిస్తోంది.
ఇదీ చదవండి : శభాష్ వేల్ మురగన్


