సాక్షి, చైన్నె : తమిళనాడుతో పోలిస్తే పుదుచ్చేరిలో నిరంతర విద్యుత్ కోతల సమస్య లేదని పుదుచ్చేరి హోం మంత్రి ఎ. నమశ్శివాయం స్పష్టం చేశారు. పుదుచ్చేరిలో తరచుగా విద్యుత్ కోతలు ఏర్పడుతున్నాయంటూ తమిళనాడు మంత్రి సెంగోట్టయ్యన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుడు ఆరోపణలుగా కొట్టిపారేశారు. బుధవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో డీజీపీ శాలిని సింగ్, డీఐజీ సత్యసుందరం, శాఖా కార్యదర్శి రాజీవ్ శుక్లా తదితర సీనియర్ అధికారులతో శాంతిభద్రతలపై సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో కొన్ని సమస్యల వల్ల విద్యుత్ కోతలు ఉన్నప్పటికీ, వాటిని పరిష్కరించామని మంత్రి తెలిపారు. తమిళనాడులో నిరంతరాయంగా విద్యుత్ కోతలు ఉంటాయని, పుదుచ్చేరిలో అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. గవర్నర్, సీఎం మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, విభేదాలు వస్తాయని ప్రతిపక్షాలు ఆశిస్తున్నాయని విమర్శించారు. ఏ ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయో నిర్దిష్టంగా చెప్పకుండా సాధారణ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తుఫాను సహాయక చర్యల కోసం గవర్నర్, సీఎం త్వరలోనే సమావేశమై ప్రజలకు సత్వర సాయం అందేలా చర్యలు తీసుకుంటారని వెల్లడించారు.
నేర నియంత్రణ – సైబర్ క్రైమ్ రికవరీ
గత నెలలో కారైకల్‌లో 6 కేజీలకు పైగా మెథాంఫేటమిన్ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశామని, అదృశ్యమైన బాలికలను కేవలం 2 గంటల్లోనే గుర్తించామని తెలిపారు. ప్రభుత్వ దంత వైద్య కళాశాల ఉద్యోగుల ఖాతాల నుంచి మాయమైన నిధుల్లో రూ. 3 కోట్లను సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారని, నిందితులను అరెస్టు చేశామని చెప్పారు.
రోడ్డు ప్రమాదాలపై ఆందోళన
సైబర్ నేరాలను ఛేదించడంలో దేశంలోనే పుదుచ్చేరి రెండో స్థానంలో నిలవడం అభినందనీయమైనా, తక్కువ జనాభా ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదాల్లో మొదటి స్థానంలో ఉండటంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల నియంత్రణకు కోర్టు ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన ప్రజా సమాచార కేంద్రం ద్వారా నగరంలోని 22 సిగ్నళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలతో ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ రద్దీ నివారణకు ప్రజా పనులు, రవాణా శాఖలతో కలిసి కార్యాచరణ రూపొందించామన్నారు. అలాగే పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ, పదోన్నతులు, 2వ ఐఆర్‌బీఎన్ బెటాలియన్ ఏర్పాటుకు సంబంధించిన ఫైలును కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం సిద్ధం చేసినట్లు వివరించారు.


