ఇక రోడ్లపై తిరిగే పశువులు వేలానికే..! | - | Sakshi
Sakshi News home page

ఇక రోడ్లపై తిరిగే పశువులు వేలానికే..!

Nov 19 2026 2:49 AM | Updated on Nov 19 2026 2:49 AM

● మద్రాస్‌ హైకోర్టు కీలక ఆదేశాలు

సాక్షి, చైన్నె: రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్న పశువులను తక్షణమే స్వాధీనం చేసుకుని, గడువులోగా యజమానులు రాకపోతే వాటిని వేలం వేయాలని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను నాలుగు వారాల్లోగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డీజీపీ, అన్ని జిల్లాల కలెక్టర్లను ధర్మాసనం ఆదేశించింది. తిరువెర్కాడు ప్రాంతంలో రోడ్లపై పశువులు తిరగడం వల్ల తీవ్ర ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడుతోందని, తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంటూ న్యాయవాది కమేష్‌ మద్రాస్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ. ధర్మాధికారి, జస్టిస్‌ జి. అరుల్‌ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అనుమతి లేకుండా రోడ్లపై తిరిగే పశువులను స్వాధీనం చేసుకోవాలంటూ తమిళనాడు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ సెప్టెంబర్‌ 20న ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

జరిమానాలు, జైలు శిక్ష

ప్రజా రవాణాకు ఆటంకం కలిగించేలా పశువులను రోడ్లపైకి వదిలే యజమానులకు మొదటిసారి రూ. 2వేలు, ఆ తర్వాత ఉల్లంఘనలకు రూ. 5 వేలు జరిమానా విధించేలా తిరువెర్కాడు మున్సిపల్‌ యంత్రాంగం తీర్మానం చేసింది. అంతేకాకుండా, చట్టప్రకారం యజమానులకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5వేలు జరిమానా విధించే అవకాశం ఉంది.రోడ్లపై పట్టుబడిన పశువులను 48 గంటల్లోగా యజమానులు వచ్చి తీసుకెళ్లకపోతే, వాటిని జప్తు చేసి వేలం వేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఆ పశువుల సంరక్షణ, నిర్వహణ ఖర్చులను కూడా యజమానుల నుంచే వసూలు చేయాలని తిరువెర్కాడు నగర పాలక యంత్రాంగానికి సూచించింది. బాధ్యతారహితంగా వ్యవహరించే పశువుల యజమానులపై పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేయవచ్చని ధర్మాసనం పేర్కొంది. ఈ ఆదేశాలన్నింటినీ నాలుగు వారాల్లోగా కచ్చితంగా అమలు చేయాలని డీజీపీ, అన్ని జిల్లాల కలెక్టర్లకు మద్రాస్‌ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement