నేడు పురాతన కట్టడాలను ఉచితంగా సందర్శించవచ్చు | - | Sakshi
Sakshi News home page

నేడు పురాతన కట్టడాలను ఉచితంగా సందర్శించవచ్చు

Nov 19 2026 2:55 AM | Updated on Nov 19 2026 2:55 AM

–ఆర్కియాలజీ విభాగం ప్రకటన

కొరుక్కుపేట:కేంద్ర పురావస్తు శాఖ ప్రతి సంవత్సరం నవంబర్‌ 19 నుండి 25 వరకు ప్రపంచ వారసత్వ వారోత్సవాలను జరుపుకుంటోంది. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న వారసత్వ నగరాల్లో ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు, చిత్రలేఖన పోటీలు, లేజర్‌ లైట్‌ షోలు మొదలైన వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో, మహాబలిపురంలో అర్జున తపస్సు ముందు జరిగే చిత్రలేఖన పోటీతో గురువారం ఉదయం ‘ప్రపంచ వారసత్వ వారోత్సవాలు‘ ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా, గురువారం ఒక్క రోజు మాత్రమే, మహాబలిపురంలోని ప్రాచీన కట్టడాలైన బీచ్‌ టెంపుల్‌, పంచరథాలు, వైన్నె ఒరుండైక్కల్‌ రాక్‌, టైగర్‌ కేవ్‌, కుడవర ఆలయం అనే 5 ఆలయ ప్రాంతాలను దేశీయ, విదేశీ పర్యాటకులందరూ ఉచితంగా సందర్శించవచ్చని పురావస్తు శాఖ ప్రకటించింది.

నాసిరకం భవనాలు నిర్మించే వారిని జైలుకు పంపాలి

– మదురై ధర్మాసనం ఆగ్రహం

సాక్షి, చైన్నె : ప్రభుత్వ నిధులతో నాసిరకం భవనాలు నిర్మించే ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను జైలుకు పంపాలని మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం 20 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రభుత్వ గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరడంపై న్యాయమూర్తులు ఘాటు గా స్పందించారు. మదురై జిల్లా నామ్‌ తమిళర్‌ కట్చి) మత్స్యకార విభాగం నిర్వాహకుడు దీరన్‌ తిరుమురుగన్‌ హైకోర్టు మదురై బెంచ్‌లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రామనాథపురం జిల్లా పనైకుళంలోని ప్రభుత్వ శాఖా గ్రంథాలయంలో 36 వేల పుస్తకాలు, 3,410 మంది సభ్యులు ఉన్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. 2006లో సుమారు రూ. 7.5 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ గ్రంథాలయ భవనం ప్రస్తుతం పూర్తిగా దెబ్బతిందని, పైకప్పు నుంచి కాంక్రీట్‌ పెచ్చులు ఊడిపడుతున్నాయని, గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వర్షపు నీరు లోపలికి చేరడంతో విలువైన పుస్తకాలు తడిసి పాడవుతున్నాయని, విద్యు త్‌ సరఫరాకు సైతం అంతరాయం కలుగుతోందని తెలిపారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని, అందువల్ల పాత భవనాన్ని తనిఖీ చేసి కొత్త భవనం నిర్మించాలని, అప్పటివరకు గ్రంథాలయాన్ని తాత్కాలిక భవనంలోకి మార్చాలని కోరారు.

న్యాయమూర్తుల ఘాటు వ్యాఖ్యలు: ఈ పిటిషన్‌పై జస్టిస్‌ పి. వేల్మురుగన్‌, జస్టిస్‌ కె.కె. రామకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కేవలం 20 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం ఇంత త్వరగా ఎలా శిథిలమైందని న్యాయమూర్తులు ప్రశ్నించారు. నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగితే సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్లనే బాధ్యులను చేయాలని స్పష్టం చేశారు. నాసిరకం భవనాలు నిర్మించే వారిని జైలుకు పంపాల్సిందేనని ధర్మాసనం తేల్చిచెప్పింది. పనైకుళం గ్రంథాలయ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్‌, కాంట్రాక్టర్‌లు డిసెంబర్‌లో కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

హెచ్‌ఐటీఎస్‌లో

ఫ్యూచర్‌ స్కిల్స్‌ సెంటర్‌

సాక్షి, చైన్నె: విద్యార్థులను భవిష్యత్‌ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చైన్నెలోని హిందుస్తాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాల జీ అండ్‌ సైన్స్‌ (హెచ్‌ఐటీఎస్‌) ముందడుగు వేసింది. తమిళనాడులోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయ ఆధారిత హిందుస్తాన్‌ సెంటర్‌ ఫర్‌ ఫ్యూచర్‌ స్కిల్స్‌ను ఏర్పాటు చేశారు. నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, బెంగళూరుకు చెందిన ఎథ్నోటెక్‌ అకాడమీ సహకారంతో ఒకే క్యాంపస్‌లో 15 సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ , క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఏఆర్‌, వీఆర్‌ వంటి ఆధునిక సాంకేతికతల్లో ఆచరణా త్మక శిక్షణ కోసం 15 సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లను నెలకొల్పారు. వీటి కోసం క్యాంపస్‌లో నాలుగు సాఫ్ట్‌వేర్‌ ల్యాబ్‌లు, ఒక ఆపిల్‌ ల్యాబ్‌, ఒక ఏఆర్‌,వీఆర్‌ ల్యాబ్‌,రెండు ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ ల్యాబ్‌లతో సహా మొత్తం 8 ప్రత్యేక ప్రయోగశాలలను అందుబాటులోకి తెచ్చారు. ఇందు కోసం వివిధ రంగా ల్లో ప్రత్యేక శిక్షణ అందించడానికి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. హిందుస్తాన్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఆనంద్‌ జాకబ్‌ వర్గీస్‌ మాట్లాడుతూ, సాంకేతిక పురోగతికి అనుగుణంగా కార్యాలయ అవసరాలు వేగంగా మారుతున్నాయన్నారు. కేవలం డిగ్రీ పట్టాలతోనే కాకుండా, పరిశ్రమల్లో నేరుగా ఉపయోగపడే ఆచరణాత్మక నైపుణ్యాలతో విద్యార్థులు బయటకు రావాలన్నదే తమ ఆశయంగా పేర్కొన్నారు. మూడు, నాలుగేళ్ల డిగ్రీ కోర్సులతో పాటు వివిధ సంయుక్త సర్టిఫికేషన్‌లు పొందేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని వివరించారు.విభిన్న విద్యా నేపథ్యాలు ఉన్న విద్యార్థులు సైతం సులభంగా సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకునేలా అదనపు తరగతులు, ధృవీకరించబడిన నిపుణులతో ప్రత్యేక బోధనా పద్ధతులను ఈ కేంద్రంలో అమలు చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement