న్యూఢిల్లీ: లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంత ప్రజలకు సత్వరం న్యాయవితరణ అందించే ఉద్దేశ్యంతో త్వరలో అక్కడ హైకోర్టు ధర్మాసనాన్ని నెలకొల్పాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. సంబంధిత ప్రతిపాదనకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కేంద్రపాలిత ప్రాంతానికి రాజ్యాంగబద్ధ రక్షణలు ఉండేలా, ప్రాంతీయ అభివృద్ధి నిరాటంకంగా కొనసాగేలా చూసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
లద్దాఖ్‌కు జమ్మూకశ్మీర్ హైకోర్టు బెంచ్ మంజూరుకావడం చరిత్రాత్మక నిర్ణయమని, దీంతో లద్దాఖ్ మారుమూల ప్రాంత పౌరులకు సైతం హైకోర్టు సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా ఆనందం వ్యక్తంచేశారు. జమ్మూకశ్మీర్‌వాసులతో పోలిస్తే తమ కు భూమి, ఉపాధి, సంస్కృతి, రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలంటూ చాన్నాళ్లుగా పోరాడుతున్న లద్దాఖ్ ప్రాంత వాసులకు హైకోర్టు రూపంలో న్యాయసేవలు అందుబాటులోకి వస్తుండటం గమనార్హం.


