ఐరాసలో పాక్ ప్రతినిధి వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం
ఐక్యరాజ్యసమితి: జమ్మూకాశ్మీర్ గురించి పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను ఐక్యరాజ్యసమితిలో భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్‌లో పౌర ప్రభుత్వాలు ‘అని పిలుచుకొనే వ్యవస్థలు అక్కడి సైన్యం దయాదాక్షిణ్యాలపై ఆధారపడి పనిచేస్తాయని, పదవీ కాలాన్ని అరుదుగా పూర్తి చేస్తాయని పేర్కొంది. శుక్రవారం జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మూడో కమిటీ సమావేశంలో పాక్ ప్రతినిధి జమ్మూకాశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల భారత్ ప్రతిస్పందించింది.
భారత శాశ్వత మిషన్ ప్రథమ కార్యదర్శి భవిక మంగళానందన్ భారత్ తరపున సమాధానమిచ్చారు. జమ్మూకశ్మీర్, లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అవిభాజ్య, శాశ్వత భాగాలుగా కొనసాగుతున్నాయని, ఎప్పటికీ కొనసాగుతాయని తేల్చిచెప్పారు. సమాధానం ఇచ్చే హక్కు(రైట్ టు రిప్లై) కింద ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సైన్యం దయాదాక్షిణ్యాలపై ఆధారపడి మనుగడ సాగించే పాక్ ప్రభుత్వం ఇతరులను వెలేత్తి చూపడం హాస్యాస్పదమని పరోక్షంగా చురక అంటించారు. పాకిస్తాన్‌లో ప్రభుత్వాలు ఎన్నాళ్లు అధికారంలో ఉంటాయో ఎవరికీ తెలియదన్నారు.
ఇప్పుడు అదే ఏకైక అంశం
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గురించి భవిక మంగళానందన్ ప్రస్తావించారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ ఆయన ఇంకా జైలులోనే ఉన్నారని చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించడం లేదని ఆక్షేపించారు. ‘‘పాక్ సర్కార్ స్వదేశంలో చెలరేగుతున్న అసంతృప్తిని చల్లార్చడానికి బదులుగా భారత్‌పై నిందలు వేస్తూ కాలం గడుపుతోంది. మూడు దశాబ్దాలకు పైగా భారతదేశంలో అస్థిరతను రెచ్చగొట్టడం ప్రయత్నిస్తోంది. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ముష్కరుల కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తోంది. తద్వారా స్వదేశంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తోంది’’అని ఆరోపించారు. పాకిస్థాన్ అక్రమంగా, బలవంతంగా ఆక్రమించుకున్న భూభాగాన్ని ఖాళీ చేయడమే ఇప్పుడు మిగిలి ఉన్న ఏకైక అంశమని తేల్చిచెప్పారు.


