శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో లష్కరే తోయిబా (LeT) టాప్ కమాండర్ లతీఫ్ భట్ కోసం భద్రతా దళాలు చేపట్టిన వేట ఉత్కంఠ రేపుతోంది. కుల్గాం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్ సందర్భంగా అతడిని ఓ మసీదులో చుట్టుముట్టాయి. ఈ క్రమంలో లతీఫ్‌తో వీడియోకాల్ ద్వారా మాట్లాడిన భద్రతా దళాలు లొంగిపోవాలని కోరాయి. అయితే అతడు చెప్పిన సమాధానం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఆపరేషన్‌లో భాగంగా లతీఫ్‌తో వీడియోకాల్‌లో మాట్లాడిన ఓ అధికారి.. హమ్ తుమ్హారే సాథ్ హై (మేము నీకు అండగా ఉంటాం) అంటూ లొంగిపోవాలని నచ్చజెప్పారు. హాని తలపెట్టమని నచ్చజెప్పేందుకు యత్నించారు. అయితే అందుకు లతీఫ్ నిరాకరించాడు. తను దేవుడి వద్ద సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. దీంతో భద్రతా దళాలు ఆపరేషన్‌ను మరింత తీవ్రం చేశాయి. కుల్గాం జిల్లాలోని పలు గ్రామాల్లో తెల్లవారుజామున కాల్పులు వినిపించాయి.
సీసీటీవీలో ఉగ్రవాదుల రెక్కీ
నవంబర్ 11న అఖ్రాన్‌లోని సీఆర్పీఎఫ్ చెక్‌పోస్టుపై జరిగిన దాడిలో లతీఫ్, అతడి అనుచరుడు ఉమర్ నిసార్ దార్ పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. దాడికి ముందు నవంబర్ 10న వీరిద్దరూ మీర్ బజార్, అఖ్రాన్, హబ్లిష్, కిలామ్ ప్రాంతాల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ దృశ్యాలు వెల్లడించాయి. దాడి తర్వాత అక్కడి నుంచి తప్పించుకున్న దృశ్యాలు కూడా పోలీసులకు లభించాయి.
Security forces are trying to persuade Lashkar-e-Taiba (LeT) local commander Lateef Bhat to surrender through a video call. Bhat is hiding inside a mosque in Zangalpora, Kulgam, where security forces launched a cordon-and-search operation after receiving intelligence about his presence.
— The Frustrated Indian (@FrustIndian) November 18, 2026
500 మందికి పైగా అదుపులోకి
ఈ కేసు దర్యాప్తులో ఉమర్ నిసార్ దార్ గత ఆరు నెలలుగా లతీఫ్‌కు ఆశ్రయం కల్పించడంతో పాటు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం కుల్గాంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దార్ హతమయ్యాడు. మరోవైపు లతీఫ్ కోసం గాలింపులో భాగంగా పోలీసులు 500 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లతీఫ్‌కు గతంలోనూ పలు ఉగ్రదాడులతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జులై 22న అనంత్‌నాగ్‌లో పోలీసులపై జరిగిన దాడిలో ఓ కానిస్టేబుల్ హత్యకు, ఆగస్టు 1న కుల్గాంలో ఇద్దరు వలస కార్మికుల హత్యకు అతడే కారణమని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మసీదులో అతడిని చుట్టుముట్టిన భద్రతా దళాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
ఇదీ చదవండి: సీఆర్‌పీఎఫ్.. విధుల్లో ఉండగా సెల్‌ఫోన్లు వాడొద్దు


