ముంబై: నటులు రణ్‌బీర్ కపూర్, యశ్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన రామాయణం సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన అందుకుంటున్నప్పటికీ.. వివాదాల్లోనూ చిక్కుకుంది. మహర్షి వాల్మీకి రచించిన అసలు రామాయణానికి విరుద్ధంగా సినిమాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారంటూ హిందూ జనజాగృతి సమితి (హెచ్‌జేఎస్) అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా పేరుతో ఇతిహాసాన్ని వక్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ హిందువులు ఈ చిత్రాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చింది.
మంగళవారం ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో హిందూ సంఘాల ప్రతినిధులు నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సృజనాత్మకత పేరుతో అసలు కథలోని కీలక ఘట్టాలను మార్చేశారని ఆరోపించారు. రావణుడిని గొప్పగా చూపించారని, లక్ష్మణుడి పాత్రను తక్కువ చేసి చూపించారని విమర్శించారు. రాముడు, లక్ష్మణుల వీరత్వానికి భిన్నంగా వారి పాత్రలను చిత్రీకరించారని పేర్కొన్నారు.
రామాయణం కోట్లాది హిందువులకు ఎంతో పవిత్రమైన ఇతిహాసమని హెచ్‌జేఎస్ తెలిపింది. అయితే ఈ సినిమా ద్వారా కమ్యూనిస్టు అజెండాను ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో హిందువులు సినిమాను చూడకుండా బహిష్కరించాలని కోరింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) తీరుపైనా సంస్థ ప్రశ్నలు లేవనెత్తింది. హెచ్‌జెఎస్ రాష్ట్ర సమన్వయకర్త సునీల్ ఘన్వత్ మాట్లాడుతూ.. ఇతర మతాల మనోభావాలకు ప్రాధాన్యమిచ్చే సెన్సార్ బోర్డు హిందువుల భావాలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’, ‘ది డావిన్సీ కోడ్’, ‘కమల్ ధమాల్ మలామాల్’ చిత్రాలను ఉదాహరణలుగా ప్రస్తావిస్తూ.. సినిమాల విషయంలో ఒకే విధమైన నిబంధనలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
రావణుడు పేదలకు బంగారు ఇళ్లు బహుమతిగా ఇచ్చినట్లు చూపించడం, రాముడు, లక్ష్మణుడు రావణుడి సైన్యాన్ని చూసి పారిపోతున్నట్లు చిత్రీకరించడం, సీత రాక్షసులతో పోరాడే సన్నివేశాలు అభ్యంతరకరమని హెచ్‌జేఎస్ తెలిపింది. అలాగే పనిమనిషిని వేధించాడనే ఆరోపణతో రావణుడు శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వను హతమార్చినట్లు చూపించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తాజా ఆరోపణలపై సినిమా నిర్మాతలు ఇంకా స్పందించలేదు. గతంలో సీత రాక్షసులతో పోరాడే సన్నివేశంపై దర్శకుడు నితీశ్ తివారీ వివరణ ఇచ్చారు. వాల్మీకి రామాయణానికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర ప్రాంతీయ, ప్రత్యామ్నాయ సాహిత్య సంప్రదాయాల ఆధారంగా ఆ సన్నివేశాన్ని రూపొందించినట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ‘ఈ20’పై రగడ: వారు సైన్స్ తెలియని మూర్ఖులు.. సురేశ్ గోపి ఫైర్!


