కేదార్‌నాథ్‌: 73 టన్నుల చెత్త వదిలిన 19.33 లక్షల భక్తులు! | 1933 Lakh Pilgrims Reached Kedarnath Leaving behind 73 Tonnes of Garbage | Sakshi
Sakshi News home page

కేదార్‌నాథ్‌: 73 టన్నుల చెత్త వదిలిన 19.33 లక్షల భక్తులు!

Nov 18 2026 7:53 AM | Updated on Nov 18 2026 7:53 AM

1933 Lakh Pilgrims Reached Kedarnath Leaving behind 73 Tonnes of Garbage

కేదార్‌నాథ్‌: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌లో ఈ ఏడాది భక్తుల రాక సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తం 19.33 లక్షల మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకోగా.. వారి రాకతో ఏకంగా 73 టన్నుల చెత్త పేరుకుపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 3.4 రెట్లు అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. బదరీనాథ్ ఆలయ ద్వారాలు సోమవారం శీతాకాలం దృష్ట్యా మూసివేయడంతో ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర ముగిసింది.

కేదార్‌నాథ్ నగర పంచాయతీ గణాంకాల ప్రకారం.. మొత్తం 73 టన్నుల వ్యర్థాల్లో 51.5 టన్నులు పొడి చెత్త కాగా, మరో 22 టన్నులు సేంద్రియ వ్యర్థాలు ఉన్నాయి. 2025లో 21.40 టన్నులు, 2024లో 26.10 టన్నులు, 2023లో 32.58 టన్నుల చెత్త మాత్రమే నమోదైంది. ఈసారి వ్యర్థాల పరిమాణం గణనీయంగా పెరిగింది.

పొడి చెత్తలో ప్లాస్టిక్ బాటిళ్లు, చిప్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్ ప్యాకెట్లు, కార్డ్‌బోర్డులు, టెట్రా ప్యాకులు ఉన్నాయి. సేంద్రియ వ్యర్థాలను ల్యాండ్‌ఫిల్ ప్రాంతంలో పారవేస్తుండగా.. పొడి చెత్తను బేలింగ్ పద్ధతిలో ప్రాసెస్ చేస్తున్నారు. అనంతరం సోన్‌ప్రయాగ్‌కు తరలించి అక్కడి నుంచి రీసైక్లింగ్ ప్రక్రియకు పంపించనున్నారు.

కేదార్‌నాథ్‌లో ఇప్పటికే ఒక వేస్ట్ బేలర్ యంత్రం అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది యాత్ర ప్రారంభమయ్యేలోగా మరో యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అక్కడి ల్యాండ్‌ఫిల్ సామర్థ్యం 30 వేల చదరపు అడుగులు కాగా, అందులో 28 వేల చదరపు అడుగులు ఖాళీగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. గత ఐదేళ్లలో నాలుగు ల్యాండ్‌ఫిల్ ప్రాంతాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే.. యాత్రికుల్లో పర్యావరణ స్పృహ పెంచేందుకు స్థానిక అధికారులు చేపట్టిన  అవగాహన కార్యక్రమం కొంత ఫలితాన్నిచ్చింది. ఈ ఏడాది సేకరించిన చెత్తలో 14 టన్నులను యాత్రికులే స్వయంగా సేకరణ కేంద్రాలకు తీసుకొచ్చారు. మొత్తం 6 వేల మంది ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. జూన్ 1న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా ఒకటి నుంచి ఐదు కిలోల బరువున్న చెత్త ప్యాకెట్లను భక్తులు ఆలయానికి 1.5 కిలోమీటర్ల దిగువన ఉన్న సేకరణ కేంద్రానికి తీసుకొచ్చారు.

ఇదీ చదవండి: అకస్మాత్తుగా ఆగిన ఆపిల్ సేవలు.. యూజర్లకు షాక్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement