విధుల్లో ఉండగా సెల్‌ఫోన్లు వాడొద్దు | CRPF issues guidelines for mobile devices, prohibits use of smartphones | Sakshi
Sakshi News home page

విధుల్లో ఉండగా సెల్‌ఫోన్లు వాడొద్దు

Nov 18 2026 6:27 AM | Updated on Nov 18 2026 6:27 AM

CRPF issues guidelines for mobile devices, prohibits use of smartphones

బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, హెల్మెట్లు తప్పనిసరి 

కశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి మార్గదర్శకాలు

చెక్‌పోస్టుల వద్ద పటిష్ట భద్రత.. మొబైల్‌ బంకర్ల ఏర్పాటు 

కుల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో డీజీ కీలక సమీక్ష

సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్ర దాడుల నేపథ్యంలో కేంద్ర రిజర్వు పోలీసు విభాగం సీఆర్‌పీఎఫ్‌ నాయకత్వం అప్రమత్తమైంది. విధుల్లో ఉన్న సమయాల్లో సిబ్బంది భద్రతకు మరింత ప్రాధాన్యమిస్తూ కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. విధి నిర్వహణ సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు, రక్షణ హెల్మెట్లు ధరించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా, వ్యక్తిగత మొబైల్‌ ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. అత్యవసర అధికారిక సమాచార మార్పిడి కోసం పార్టీ కమాండర్‌ మాత్రమే మొబైల్‌ ఫోన్‌ను వాడాలని ఆదేశించింది. 

చెక్‌పోస్టుల వద్ద భద్రతను పెంచడంతో పాటు అవసరమైన రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఇటీవల కుల్గాం జిల్లాలో జరిగిన దాడిలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది గాయపడిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ జీపీ సింగ్‌ ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో పర్యటించి, భద్రతా పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని బలగాల ప్రధాన కార్యాలయం నుంచి మరో సీనియర్‌ అధికారి కూడా ఆయన వెంట వెళ్లారు. ఉగ్రవాద నిరోధక చర్యలు, భద్రతా సిబ్బందిపై జరుగుతున్న దాడుల తీరును ఈ సందర్భంగా ప్రత్యేకంగా సమీక్షించారు. 

దాడుల తీరుపై కీలక సమీక్ష 
ముఖ్యంగా లష్కరే తోయిబా, అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌)కు చెందిన స్థానిక కమాండర్‌ మహమ్మద్‌ లతీఫ్‌ భట్‌ అలియాస్‌ లతీఫ్‌ అహ్మద్‌ భట్‌ జరిపే దాడుల తీరుపై చర్చించారు. భద్రతా చెక్‌పోస్టుల వద్దకు చేరుకుని సిబ్బందిపై కాల్పులు జరిపే విధానాన్ని సమీక్షించారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా ఖ్రేవాన్‌ చాదర్‌ గ్రామానికి చెందిన లతీఫ్‌ భట్‌కు జూలై 22న అనంత్‌నాగ్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ ఆశిక్‌ హుస్సేన్‌ ఖురేషీ హత్యతో సంబంధమున్నట్లు ఆరోపణలున్నాయి. అమర్‌నాథ్‌ యాత్ర విధుల్లో భాగంగా ఇతడు ఇండియన్‌ రిజర్వు పోలీస్‌లో పనిచేసే సమయంలో స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌వోజీ)కు అనుబంధంగా విధులు నిర్వహించాడు. 

చెక్‌పోస్టుల వద్ద మెరుగైన సదుపాయాలు 
తాజా మార్గదర్శకాల ప్రకారం అన్ని కంపెనీల కమాండర్లు చెక్‌పోస్టుల వద్ద భద్రతను పటిష్టం చేయాలి. ప్రామాణిక నిర్వహణ విధానా (ఎస్‌వోపీ)లను అనుసరిస్తూ తగిన సంఖ్యలో సిబ్బందిని మోహరించాలి. విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు, రక్షణ పరికరాలు ధరించేలా యూనిట్‌ కమాండింగ్‌ అధికారులు నిర్ధారించాలి. నిర్దేశిత రక్షణ పరికరాలు లేకుండా ఎవరినీ విధుల్లోకి అనుమతించరాదు. చెక్‌పోస్టులు, స్థిర భద్రతా కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి రక్షణ కల్పించేందుకు మొబైల్‌ బుల్లెట్‌ప్రూఫ్‌ సెంట్రీ పోస్టులనుఏర్పాటు చేయాలని సూచించింది. ఇవి కాల్పుల నుంచి రక్షణ కల్పించేలా రూపొందించిన తరలించగలిగే బంకర్లు, గార్డు పోస్టులు. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో చెక్‌పోస్టుల వద్ద తగిన వెలుతురు ఉండేలా చూడాలని, అవసరమైన రక్షణ మౌలిక సదుపాయాలను కల్పించాలని స్పష్టం చేసింది. 

ఒకేచోట ఎక్కువసేపు ఉండొద్దు 
విధుల్లో ఉన్న సమయంలో సిబ్బంది ఒకే ప్రాంతంలో ఎక్కువసేపు స్థిరంగా ఉండకూడదని సీఆర్‌పీఎఫ్‌ సూచించింది. పరిసరాల్లోని పరిస్థితులను నిరంతరం గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. రక్షణ నిర్మాణాల వెలుపల బహిరంగ ప్రదేశాల్లో విధులు నిర్వహించే వారు మరింత జాగ్రత్తగా ఉండటంతో పాటు, కాల్పుల నుంచి రక్షణ కల్పించే తగిన భద్రతా స్థానాల్లో ఉండాలని పేర్కొంది. అత్యవసర సమయాల్లో సమాచార మార్పిడి, సమన్వయం దెబ్బతినకుండా విశ్వసనీయమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థను అందుబాటులో ఉంచాలని కూడా మార్గదర్శకాల్లో పేర్కొంది. కుల్గాం దాడి నేపథ్యంలో భద్రతా సిబ్బందిపై మళ్లీ దాడులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ఈ కొత్త ఆదేశాల ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement