కాల్పులు ఆగిపోతాయనుకుంటే పొరబాటు
రాజకీయ సమస్యలకు చర్చలతోనే పరిష్కారం
నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా
జమ్మూ: జమ్మూ కశ్మీర్ వంటి రాజకీయ సమస్యకు పరిష్కారం చర్చల ద్వారా మాత్రమే సాధ్యమని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా గురువారం స్పష్టం చేశారు. సైనికచర్యలు కాల్పులు, పాకిస్థాన్‌తో ఘర్షణపడటంతో ఈ సమస్య తీరదని తెలిపారు. ఈ శత్రుత్వం తగ్గేదాక ఎదురు చూడకుండా... అర్థవంతమైన రీతిలో పాక్‌తో సంప్రదింపులు, చర్చలు జరపాలని ఆయన సూచించారు.
కశ్మీర్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటుందని పునరుద్ఘాటించారు. ‘‘అందరి తూటాలూ ఖర్చయిపోయేందుకు ఎదురు చూస్తూంటే. అప్పటికి సమయం మించిపోతుంది’’అని వ్యాఖ్యానించారు ఆయన. ఇటీవల గుండెపోటుతో మరణించిన విశ్రాంత ఇన్ఫర్మేషన్ అధికారి మదన్ మంటూ కుటుంబాన్ని పరామార్శించేందుకు వచ్చిన ఫరూక్ అబ్దులా ఉగ్రవాద చర్యలు నిలిపివేయాలని పాకిస్థాన్‌ను కోరారు. తద్వారా ఇరు దేశాల మధ్య చర్చలకు అనుకూల వాతావరణం సృష్టించాలని సూచించారు.
కాల్పులు జరుగుతూంటే చర్చలు ఎలా చేస్తామంటూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వైఖరిపై విలేకరులు ప్రశ్నించగా ఫరూక్ మాట్లాడుతూ ‘‘ఉగ్రవాదం ఆపాలని నేను ఎప్పుడూ పాకిస్థాన్‌కు చెబుతూనే ఉన్నా. దీని ద్వారా సాధించేది ఏమీ లేదు. చర్చల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చర్చల ద్వారా మాత్రమే భవిష్యత్తుకు దారి కనిపిస్తుంది’’అని ఆయన వివరించారు. మిలటరీ చర్యలతో విధ్వంసం తప్ప మరే ప్రయోజనమూ లేదని, ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలను ప్రస్తావించారు.
చర్చలు పరస్పర అంగీకారంతో మాత్రమే శాశ్వత శాంతి సాధ్యమన్నారు. కేంద్రం సార్క్ సమావేశాలను పునరుద్ధరించాలని, దక్షిణాసియా దేశాలన్నీ కలిసికట్టుగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుల్‌గామ్, కిశ్త్‌వార్ జిల్లాల్లో ఇటీవలి ఉగ్రవాద దాడులను ప్రస్తావిస్తూ.. కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవాలన్న కలలను వారు వదులు కోవాలని స్పష్టం చేశారు. అయితే జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం అంతమైందంటూ కేంద్రం చేస్తున్న ప్రకటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. ముప్పు ఇప్పటికీ కొనసాగుతోందని ఇటీవలి ఉగ్ర ఘటనలు చెబుతున్నాయని అన్నారు.


