మన ప్రజల విజయాలను ప్రపంచ వేదికలపై చాటి చెప్పాలి
మీడియాకు మోదీ విజ్ఞప్తి
బీజేపీ ప్రధాన కార్యాలయంలో ‘దీపావళి మిలన్’
న్యూఢిల్లీ: ప్రపంచంతో పంచుకోవడానికి మన దేశం సాధించిన అద్భుతమైన విజయాలు ఎన్నో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ విజయాలను ‘ఇండియా స్టోరీ’గా అభివర్ణించారు. ప్రపంచ వేదికలపై వాటిని చాటిచెప్పాలని పాత్రికేయులను కోరారు. గురువారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ‘దీపావళి మిలన్’నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మీడియా ప్రతినిధులను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. వార్తా ప్రపంచంలో గడువు(డెడ్‌లైన్) చాలా ముఖ్యమని పేర్కొన్నారు. పాత్రికేయుడి జీవితమంతా ఈ డెడ్‌లైన్ల చుట్టూనే తిరుగుతూ ఉంటుందని గుర్తుచేశారు. వార్తాపత్రిక ముద్రణకు వెళ్లే సమయం కావచ్చు లేదా ఒక కథనం ప్రసారమయ్యే సమయం కావచ్చు.. ప్రతిదానికీ ఒక నిర్ణిత గడువు ఉంటుందన్నారు.
నేడు మన దేశం కూడా ఒక గడువును లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని వివరించారు. ఆ గడువు 2047వ సంవత్సరమని వ్యాఖ్యానించారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న కల స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మనతోనే ఉందన్నారు. ఆ కలను సాకారం చేసుకోవడానికి 2047 అనే గడువు నిర్దేశించుకున్నామని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యేలోపు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకొనేందుకు మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
50 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి
భారతదేశంలో అత్యధిక యువ జనాభా, ప్రతిభ, సాంకేతికత, తక్కువ ధరకే లభించే డేటా ఉన్నాయని మోదీ గుర్తుచేశారు. అన్నింటికంటే ముఖ్యంగా మన దగ్గర ‘భారత గాథ’ఉందన్నారు. మన వార్తలు నిజంగా భారతదేశాన్ని ప్రతిబింబిస్తున్నాయా? మన విజయాలు, ప్రతిభ, సానుకూల మార్పులకు ప్రాధాన్యత లభిస్తోందా? అని ఆలోచించుకోవాలని కోరా రు. దేశంలో గొప్ప విజయ గాథలకు లోటు లేదన్నారు. ఆయా గాథలను ప్రపంచానికి చేరవేయాలని మీడియాను అభ్యర్థించారు. దేశం నుంచి పేదరికాన్ని తొలగించడంలో ఎన్డీఏ విజయం సాధించిందని ఉద్ఘాటించారు. 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు.
లక్ష్యాలను సాధిస్తూ ముందుకు సాగాలి
ఇటీవలి కాలంలో మనం సాధించిన విజయాల గురించి ఒక్కసారి ఆలోచించాలని ప్రధాని మోదీ చెప్పారు. చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో అడుగుపెట్టామని, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ దేశంగా అవతరించామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే ఆర్చ్ వంతెనను చీనాబ్ నదిపై నిర్మించామని, కేవలం 12 ఏళ్లలో మన సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 50 రెట్లకు పైగా పెరిగిందని వివరించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ మన దేశంలో ఉందన్నారు.
వికసిత్ భారత్‌కు 2047 గడువు అంటే.. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోలాగా అప్పటి వరకు వేచి ఉండాలని కాదని అన్నారు. అప్పట్లో సంపూర్ణ స్వాతంత్య్రం కోసం ప్రజలు సుదీర్ఘకాలం నిరీక్షించాల్సి వచ్చిందన్నారు. మొదట చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించారని, తద్వారా స్వాతంత్య్రం కచ్చితంగా వస్తుందనే నమ్మకం ప్రజల్లో కలిగిందని చెప్పారు. మనం కూడా అనేక చిన్న, పెద్ద లక్ష్యాలను సాధిస్తూ ముందుకు సాగాలని, అప్పుడే ‘వికసిత్ భారత్’అనే గమ్యాన్ని చేరుకోగలమని తేల్చిచెప్పారు.


