ఇస్లామాబాద్: ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్‌తో సంబంధాలున్న రాజకీయ పార్టీకి పార్లమెంటరీ ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. గుజ్రన్‌వాలా జిల్లాలోని పార్లమెంటరీ స్థానాన్ని అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్ ఎన్) నిలబెట్టుకుంది. హఫీజ్ సయీద్‌కు అనుబంధంగా ఉన్న పాకిస్థాన్ మార్కజీ ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) అభ్యర్థి ఓటమి పాలయ్యారు.
పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రన్‌వాలా జిల్లాలో ఉన్న ఎన్‌ఏ-77 నియోజకవర్గానికి ఆదివారం ఉప ఎన్నిక జరిగింది. లాహోర్‌కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఈ నియోజకవర్గం ఉంది. సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు మెహమూద్ బషీర్ విర్క్ మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
సోమవారం పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటించిన ఫలితాల ప్రకారం.. పాకిస్థాన్ మార్కజీ ముస్లిం లీగ్ అభ్యర్థి మహమ్మద్ ఇబ్రహీం గుజ్జర్ 30,000కు పైగా ఓట్లు సాధించారు. అయితే, పీఎంఎల్-ఎన్ అభ్యర్థి రషీద్ బషీర్ విర్క్ 43,000కు పైగా ఓట్లు సాధించి గెలుపొందారు.
తగ్గిన పోలింగ్ శాతం
జైలులో ఉన్న మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, జమాతే ఇస్లామీ ఈ ఉప ఎన్నికలో పోటీ చేయలేదు. పోలింగ్‌లో ఓటర్ల భాగస్వామ్యం తక్కువగా నమోదైంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. ఒక గ్రామంలోని ఓటర్లు పూర్తిగా ఎన్నికలను బహిష్కరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై పీఎంఎల్-ఎన్‌కు చెందిన ఐదుగురు మహిళా శాసనసభ్యులకు వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.
మరోవైపు, ఎన్నికల ఫలితాలను పీఎంఎంఎల్ అంగీకరించలేదు. అధికార పీఎంఎల్-ఎన్ విస్తృతంగా అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఫలితాలను తిరస్కరించింది. 2024లో జరిగిన పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ పార్టీ పోటీ చేసినప్పటికీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు.
ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ గతంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవాలను స్థాపించాడు. గతంలో మిల్లీ ముస్లిం లీగ్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడు. ఆ తర్వాత అతనికి అనుబంధంగా మరో రాజకీయ వేదికగా పీఎంఎంఎల్ ఏర్పడింది. పాకిస్థాన్ అధికార వ్యవస్థలోని కీలక వర్గాల మద్దతు కూడా ఈ పార్టీకి ఉన్నట్లు సమాచారం. ఈ ఉప ఎన్నిక ఫలితం హఫీజ్ సయీద్ అనుబంధ రాజకీయ శక్తులకు మరో ఎదురుదెబ్బగా నిలిచింది.


