పాకిస్తాన్‌ను వణికించిన ‘ధురంధర్‌’కు బిగ్‌ షాక్‌! | BLA ousts Bashir Zeb who rattled Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ను వణికించిన ‘ధురంధర్‌’కు బిగ్‌ షాక్‌!

Nov 6 2026 10:58 AM | Updated on Nov 6 2026 11:10 AM

BLA ousts Bashir Zeb who rattled Pakistan

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ సైన్యానికి సవాళ్లు విసురుతూ, వరుస దాడులతో ఆ దేశ భద్రతా వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేసిన బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (BLA)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ సంస్థకు ఎనిమిదేళ్లపాటు నాయకత్వం వహించిన బషీర్‌ జెబ్‌ను కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ పదవి నుంచి తొలగించారు. పాకిస్థాన్‌ సైన్యం, భద్రతా బలగాలు, చైనా ప్రయోజనాలే లక్ష్యంగా పలు దాడులకు బాధ్యత వహించిన ఈ తిరుగుబాటు సంస్థలో ఇప్పుడు నాయకత్వ మార్పు సంచలనం రేపుతోంది.

అసలు బషీర్‌ జెబ్‌ను ఎందుకు తొలగించారు? సంస్థలో అంతర్గత విభేదాలే కారణమా? భారీ సైనిక ఆపరేషన్‌ వైఫల్యం ఆయన పదవికి ఎసరు పెట్టిందా? మహిళలను ఆత్మాహుతి దాడులకు ఉపయోగించిన వ్యూహంపై వచ్చిన విమర్శలు ప్రభావం చూపాయా? లేక ఆయన విషప్రయోగానికి గురయ్యారా? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు.. బషీర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. 

బీఎల్‌ఏ అధికార ప్రతినిధి జీయంద్‌ బలూచ్‌ నవంబర్‌ 3న విడుదల చేసిన ప్రకటనలో బషీర్‌ జెబ్‌ ఇకపై కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా కొనసాగరని వెల్లడించారు. ఆయన చేతిలో ఉన్న పరిపాలనా, సైనిక, విధానపరమైన అధికారాలన్నీ తదుపరి నాయకుడి నియామకం జరిగే వరకు సంస్థ సీనియర్‌ కమాండ్‌ కౌన్సిల్‌కు బదిలీ చేసినట్లు ప్రకటించారు. అక్టోబర్‌ 16న జరిగిన సంస్థ అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బలూచిస్థాన్‌ పోస్టు కథనం వెల్లడించింది. 2018లో సంస్థ పునర్వ్యవస్థీకరణ సమయంలో రూపొందించిన నిబంధనల ప్రకారమే నాయకత్వ మార్పు జరిగిందని BLA ప్రకటించింది. ఎంతటి కీలక నాయకుడైనా జీవితాంతం కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా కొనసాగడానికి వీల్లేదని సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. ఈ మార్పు ఎలాంటి అంతర్గత విభేదాలు, విచ్ఛిన్నం, ఘర్షణలు లేకుండానే జరిగిందని కూడా స్పష్టం చేసింది. అయితే బషీర్‌ జెబ్‌ను తొలగించడానికి అసలు కారణం ఏమిటన్నది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు? స్వేచ్ఛగా ఉన్నారా? నిర్బంధంలో ఉన్నారా? అనారోగ్యానికి గురయ్యారా? అన్న విషయాలపైనా స్పష్టత లేదు.

హెరోఫ్‌-2 ఆపరేషనే కొంపముంచిందా?
బషీర్‌ జెబ్‌ తొలగింపునకు ప్రధాన కారణాల్లో సంస్థ సైనిక వ్యూహాలపై నెలకొన్న విభేదాలు ఒకటై ఉండవచ్చని పాకిస్థాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాన్ఫ్లిక్ట్‌ అండ్‌ సెక్యూరిటీ స్టడీస్‌ (PICSS) విశ్లేషించినట్లు కథనం పేర్కొంది. 2026 జనవరి 31న ప్రారంభమైన 'ఆపరేషన్‌ హెరోఫ్‌-2'లో భాగంగా బలూచిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో BLA సమన్వయ దాడులు నిర్వహించింది. పాకిస్థాన్‌ భద్రతా బలగాలు, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకున్న ఈ ఆపరేషన్‌ అనంతరం సంస్థలో వ్యూహాత్మక విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ముఖ్యంగా BLAకు చెందిన మజీద్‌ బ్రిగేడ్‌ అధిపతి కెప్టెన్‌ రెహమాన్‌ గుల్‌, బషీర్‌ జెబ్‌ అనుసరించిన వ్యూహాలను వ్యతిరేకించినట్లు PICSS నివేదించింది. ఒకేసారి అనేక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో సాయుధ సభ్యులను మోహరించడం వల్ల పాకిస్థాన్‌ భద్రతా బలగాలకు వారిని గుర్తించి దాడులు చేయడం సులభమైందని ఆయన అభిప్రాయపడినట్లు తెలిపింది. దీనికి బదులుగా చిన్న చిన్న బృందాలతో పరిమిత దాడులు చేయాలన్న వ్యూహాన్ని రెహమాన్‌ గుల్‌ సమర్థించినట్లు సమాచారం.

 ఈ ఆపరేషన్‌ అనంతరం పాకిస్థాన్‌ భద్రతా బలగాలు చేపట్టిన ప్రతిదాడుల్లో BLAకు భారీ నష్టం వాటిల్లిందని PICSS అంచనా వేసింది. వారం రోజుల్లో కనీసం 215 మంది BLA సభ్యులు మరణించినట్లు ఆ సంస్థ అంచనా వేయగా, BLA మాత్రం 96 మంది మరణించినట్లు అంగీకరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరి నుంచే బషీర్‌ జెబ్‌ను కీలక నిర్ణయాల నుంచి పక్కన పెట్టినట్లు నివేదిక పేర్కొంది.

మహిళా ఆత్మాహుతి దాడులపై విమర్శలు!
బషీర్‌ జెబ్‌ నాయకత్వంపై మరో కీలక విమర్శ మహిళలను ఆత్మాహుతి దాడులకు ఉపయోగించడం. BLA తన దాడుల్లో మహిళా ఆత్మాహుతి దాడుల వ్యూహాన్ని అనుసరించడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యూహం బలూచ్‌ ఉద్యమానికి బలూచిస్థాన్‌ వెలుపల ఉన్న మద్దతును దెబ్బతీసిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు.. బషీర్‌ జెబ్‌ ఎక్కడ ఉన్నాడు అనేది తెలియాల్సి ఉంది. కాగా, బషీర్‌ జెబ్‌కు విషప్రయోగం జరిగిందనే వార్త చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా, బీఎల్‌ఏలో అంతర్గత విభేదాలు, నాయకత్వ మార్పులు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2000లో బలూచ్‌ స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు హైర్‌బయార్‌ మర్రీ ఆధ్వర్యంలో ఈ సంస్థ ఏర్పడింది. ఆయన నేతృత్వంలో BLA పాకిస్థాన్‌లో పలు కీలక దాడులకు బాధ్యత వహించింది. 2018లో కరాచీలోని చైనా కాన్సులేట్‌పై దాడి, 2019లో గ్వాదర్‌లోని పెర్ల్‌ కాంటినెంటల్‌ హోటల్‌పై దాడి, 2020లో కరాచీలోని పాకిస్థాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌పై దాడి వంటి ఘటనలు ఈ సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాయి. 2025 మార్చిలో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు హైజాకింగ్‌ ఘటనలోనూ BLA పాత్ర ఉందని పాకిస్థాన్‌ ఆరోపించింది.

తదుపరి నాయకుడు ఎవరు? చీలిక తప్పదా?
బషీర్‌ జెబ్‌ తొలగింపుతో BLAలో నాయకత్వ మార్పు ప్రక్రియ ప్రారంభమైంది. తదుపరి కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ ఎవరు అవుతారు? సీనియర్‌ కమాండ్‌ కౌన్సిల్‌ ఎంతకాలం సంస్థను నడిపిస్తుంది? అంతర్గత విభేదాలు మళ్లీ బయటపడతాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలోనూ నాయకత్వ వివాదాలతో విడిపోయిన చరిత్ర ఉన్న నేపథ్యంలో ఈసారి మార్పు సంస్థలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, పాకిస్థాన్‌ సైన్యానికి సవాళ్లు విసిరిన బషీర్‌ జెబ్‌.. ఇప్పుడు సొంత సంస్థలోనే పదవి కోల్పోయారు. ఆయన తొలగింపునకు అసలు కారణం వ్యూహాత్మక వైఫల్యమా? అంతర్గత విభేదాలా? లేక మరేదైనా రహస్య పరిణామమా? అన్నది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది.

ఇదీ చదవండి: భారతీయుల దెబ్బ.. ట్రంప్‌కు భారీ షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement