రైతులకు ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ: విష పూరిత రసాయనాలతో నేల తల్లిని మనమే చంపుకుంటున్నామని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. పంటల సాగు కోసం రసాయనాలను వాడి భూమిని విషతుల్యంగా మార్చవద్దని, అందుకు బదులుగా విష రసాయనాల ప్రమేయం లేని ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు. ఆర్గానిక్, ప్రకృతి వ్యవసాయం.. ఈ రెండింటిలో తాను ప్రకృతి సాగు విధానానికే మొగ్గ చూపుతానన్నారు.
ప్రధాని మోదీ గురువారం ఇండియా టుడే గ్రూపు నిర్వహించిన కిసాన్ తక్ భారత్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. ‘మనం రసాయనాలను విచక్షణారహితంగా వాడుతూ భూమాతను నాశనం చేస్తున్నాం. మనం ఆమె బిడ్డలమై ఉండి, మన కళ్ల ముందే మన కన్నతల్లిని మనమే చంపుకుంటున్నా’అని ఆయన పేర్కొన్నారు. రసాయనాల వల్ల జరిగే నష్టం నుంచి వ్యవసాయ భూమిని రక్షించడంలో విఫలమైతే భవిష్యత్ తరాలు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
‘వ్యవసాయం మన సంస్కృతి, మన సంప్రదాయం, మన సామాజిక జీవితానికి మూలాధారం’అని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయాన్ని మరింత మెరుగ్గా మార్చకుండా అభివృద్ధి చెందిన భారత్ ఏమాత్రం సాధ్యం కాని విషయమని ప్రధాని మోదీ తెలిపారు. భారత మండపంలో జరిగిన సదస్సుకు కనీసం 2వేల మంది రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల సరఫరా గొలుసులు దెబ్బతినడంతో, రైతులకు రసాయన ఎరువులను అందుబాటు ధరల్లో ఉంచడానికి కేంద్రం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని మోదీ వివరించారు.
ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయ విధానమై సరైన విరుగుడని వివరించారు. ఈ విధానంలో బయటి నుంచి ఎరువుల వంటి వాటిని కొనుగోలు చేసే అవసరముండదని చెప్పారు. స్థానికంగా లభించే వస్తువులు, సామగ్రితో సంప్రదాయ వ్యవసాయ విధానాల సాయంతో ఆవుపేడ, గోమూత్రం, మొక్కల ఆధారితంగా పదార్థాలతోనే ఎరువులను, పురుగు, కీటక నాశనులను తయారు చేసుకోవచ్చని వివరించారు. ఇందుకుగాను ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా రైతులకు సాయపడుతోందని చెప్పారు.
రాహుల్‌పై పరోక్ష వ్యాఖ్యలు
కొందరు నాయకులు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తమ సొంత ఆస్తిగా భావిస్తున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అధికారంలో లేకపోయినప్పటికీ ప్రత్యేక హక్కులు ఉన్నాయన్నట్లుగా అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘నేడు కొందరు రాజ్యాంగ ప్రతిని జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. అప్పుడప్పుడూ రాజ్యాంగ ప్రతిని బయటకు తీసి చూపుతుంటారు. దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కూడా తమ జేబులోనే ఉన్నాయన్నట్లుగా భావిస్తుంటారు’అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నుద్దేశించి ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘ప్రభుత్వంలో లేనప్పటికీ, తాము చెప్పినట్లే జరగాలనే విచిత్రమైన అధికార దర్పం ప్రదర్శిస్తూంటారు. ఇదో రకం విచిత్రమైన అధికార మత్తు’అని వ్యంగ్యంగా అన్నారు.


