వాహనం ఆగకుండానే టోల్‌ వసూలు | NHAI issues guidelines for barrier-less Multi-Lane Free Flow tolling | Sakshi
Sakshi News home page

వాహనం ఆగకుండానే టోల్‌ వసూలు

Nov 7 2026 5:46 AM | Updated on Nov 7 2026 5:46 AM

NHAI issues guidelines for barrier-less Multi-Lane Free Flow tolling

మల్టీ లేన్‌ ఫ్రీ ఫ్లో విధానానికి ఎన్‌హెచ్‌ఏఐ శ్రీకారం 

కొత్తగా నిర్మించే జాతీయ రహదారులకు వర్తింపు

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు ఇకపై టోల్‌ ప్లాజాల వద్ద నిరీక్షించే అవసరం ఉండదు. టోల్‌ వసూళ్ల కోసం వాహనాలను నిలపాల్సిన అవసరం లేని బారియర్‌ రహిత టోల్‌ విధానంపై భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. 

నాలుగు లేన్లు, అంతకంటే ఎక్కువ లేన్లు కలిగిన జాతీయ రహదారులపై మల్టీ లేన్‌ ఫ్రీ ఫ్లో (ఎంఎల్‌ఎఫ్‌ఎఫ్‌) టోల్‌ విధానానికి అనుగుణంగా టోల్‌ ప్లాజాల రూపకల్పన, మౌలిక సదుపాయాలను ప్రామాణీకరించనున్నారు. తాజా మార్గదర్శకాల ప్రకారం టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు బారియర్ల దగ్గర ఆగకుండా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా టోల్‌ రుసుము వసూలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు. దీనివల్ల వాహనదారుల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఇంధన వినియోగం, కాలుష్యం కూడా తగ్గనుంది.  

టోల్‌ ప్లాజాల రూపకల్పనలో ఏకరూపత 
కొత్త మార్గదర్శకాల్లో భాగంగా టోల్‌ ప్లాజాల లేఅవుట్, టోల్‌ లేన్ల సంఖ్య, గ్యాంట్రీల ఏర్పాటు, రహదారి నిర్మాణం, లైటింగ్, సూచిక బోర్డులు, ఇతర సదుపాయాలకు సంబంధించి నిర్దిష్ట ప్రమాణాలను సూచించారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై నిర్మించే టోల్‌ ప్లాజాల్లో ఒకే విధమైన ప్రమాణాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటారు. 

సంప్రదాయ టోల్‌ ప్లాజాల్లో వాహనాలు ఆగి రుసుము చెల్లించాల్సి ఉండటంతో ఎక్కువ సంఖ్యలో టోల్‌ లేన్లు అవసరమవుతున్నాయి. అయితే బారియర్‌ రహిత విధానంలో వాహనాలు ఆగకుండానే టోల్‌ వసూలు చేయవచ్చు. దీంతో అవసరమైన లేన్ల సంఖ్యను హేతుబదీ్ధకరించి, అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థంగా వినియోగించుకునేలా మార్గదర్శకాలు రూపొందించారు. టోల్‌ పరిధిలో వాహనాల రాకపోకలు సులభతరం కావడంతోపాటు ట్రాఫిక్‌ నిర్వహణ మెరుగుపడనుంది.

కొత్త ప్రాజెక్టులకు తప్పనిసరి 
ఈ మార్గదర్శకాలను భవిష్యత్తులో చేపట్టే అన్ని జాతీయ రహదారి ప్రాజెక్టులతోపాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకూ వర్తింపజేస్తారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) దశలో ఉన్న ప్రాజెక్టుల్లోనే కొత్త నమూనాలను చేర్చాలని ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేసింది. ఇప్పటికే కాంట్రాక్టులు ఖరారైన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో సంబంధిత ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేపట్టనున్నారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ క్షేత్రస్థాయి కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement