ఇక టోల్‌ వలుచుడే.. | Toll collection on NH 563 begins today | Sakshi
Sakshi News home page

ఇక టోల్‌ వలుచుడే..

Oct 15 2026 1:27 AM | Updated on Oct 15 2026 1:27 AM

Toll collection on NH 563 begins today

ఎన్‌హెచ్‌ 563పై నేటి నుంచి టోల్‌ వసూలు

కరీంనగర్‌ రిజిస్ట్రేషన్‌ వాహనాలకు సాధారణ చార్జీలు 

ఇతర జిల్లా వాహనాలకు ఆటో, కార్లకు రూ.160, భారీ వాహనాలకు రూ.1,020

త్వరలో ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఉత్తర తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి దోహదం చేసే జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 563పై టోలు వసూలుకు రంగం సిద్ధమైంది. అక్టోబర్‌ 15 నుంచి రహదారిపై ప్రయాణించే అన్ని వాహనాల నుంచి టోలు వసూలుకు భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్‌హెచ్‌ 563ని రెండు సెక్షన్లుగా విభజించారు. 68 కి.మీ. మేర కరీంనగర్‌–వరంగల్‌ సెక్షన్‌ కాగా జగిత్యాల– కరీంనగర్‌ సెక్షన్‌ 59 కి.మీ.లతో నిర్మించ తలపెట్టారు.

ఇందులో 68 కి.మీ. మేర ఉన్న కరీంనగర్‌–వరంగల్‌ సెక్షన్‌ పనులు ఇటీవల పూర్తయ్యాయి. సెప్టెంబర్‌ 5వ తేదీ నుంచి ఈ రహదారి మీద నుంచి రాకపోకలు ట్రయల్స్‌ బేసిస్‌ మీద నడిపిస్తున్నారు. కేవలం 40 నిమిషాల్లోనే కరీంనగర్‌ నుంచి వరంగల్‌ చేరుకునేలా అత్యాధునిక సదుపాయాలతో గరిష్ట వేగం 100 కి.మీ. వెళ్లేలా నాలుగు వరసలతో విశాలంగా నిర్మించారు. అదే సమయంలో జగిత్యాల–కరీంనగర్‌ సెక్షన్‌ పనులను దాదాపు రూ.2,000 కోట్లకుపైగా బడ్జెట్‌తో ఇటీవల టెండర్లు పిలిచారు.

కొత్తగట్టు వద్ద టోల్‌ వసూలుకు బూత్‌ ఏర్పాటు
జాతీయ రహదారి 563పై ప్రయాణించే వాహనాలకు కొత్తగట్టు వద్ద ఏర్పాటు చేసిన టోల్‌ బూత్‌ నుంచి టోల్‌ వసూలు చేయనున్నారు. ఈ క్రమంలోనే భారత జాతీయ రహదారుల సంస్థ ఏ వాహనానికి ఎంత రుసుం వసూలు చేస్తారన్న దానిపై పట్టిక విడుదల చేసింది. ఇందులో కరీంనగర్‌ జిల్లాలో రిజిస్ట్రేషన్‌ అయిన వాహనాలకు సాధారణ చార్జీలనే వసూలు చేస్తుండగా.. అదే ఇతర జిల్లాల్లో రిజిస్టరైన వాహనాలకు మాత్రం రెండింతలు టోల్‌ ధరలు నిర్ణయించారు. ఇది తమపై భారం మోపుతుందని వాహనదారులు వాపోతున్నారు.

» కారు లేదా వ్యాన్‌ తదితర లైట్‌ వెయిట్‌ వాహనాలకు కరీంనగర్‌ జిల్లాలో రిజిస్ట్రేషన్‌ అయి ఉంటే సింగిల్‌ జర్నీకి రూ.80గా ధర నిర్ణయిస్తే.. ఇతర జిల్లా వాహనాలకు రూ.160 గా ఖరారు చేశారు. ఇది వాహనం రకాన్ని బట్టి మారుతుంటుంది. 
»  ఏడు లేదా అంత కంటే ఎక్కువ యాక్సైల్‌ కలిగిన వాహనాలకు సింగిల్‌ జర్నీకి రూ.1,020గా నిర్ణయించారు. 
»  టోల్‌గేట్‌కు 20 కి.మీ. లోపల నివసిస్తున్న వారికి మంత్లీ రూ.360తో పాస్‌ జారీ చేస్తారు. 
»   డిసెంబర్‌లో ఈ రహదారిని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement