హైదరాబాద్: కార్తీకమాసం సందర్భంగా ఇంటి ముందు వెలిగించిన దీపం అంటుకుని ఓ యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డగుట్ట సొసైటీ, వెస్ట్రన్ హిల్స్‌లో నివాసం ఉండే సత్యసాయి శ్రీరాం కుమార్‌కు ఇద్దరు కుమార్తెలు.
పెద్ద కుమార్తె సాయి వెంకట సింధు (18) ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో శిక్షణ పొందుతోంది. మరో స్నేహితురాలి భాగస్వామ్యంతో ఇటీవలే ఒక బొటిక్‌ను ప్రారంభించింది. ఈ నెల 12న రాత్రి ఇంటికి వచ్చిన సింధు కాలింగ్ బెల్ కొట్టి నిలుచుని ఉంది. ఇంటి గుమ్మం ముందు వెలిగించిన కార్తీక దీపం చీరకు అంటుకుని మంటలు వ్యాపించాయి. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా శుక్రవారం మృతి చెందింది.


