50 శాతం పెంచే ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు వెల్లడి
రాజ్యసభలో తమ ముగ్గురు సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని స్పష్టికరణ
పార్టీ వైఖరి వెల్లడించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: డీలిమిటేషన్ అంశంపై బీఆర్‌ఎస్ తన అధికారిక వైఖరిని స్పష్టం చేసింది. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాల పునరి్వభజన చేపడితే దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని, ప్రస్తుతమున్న 24% ప్రాతినిధ్యాన్ని యథాతథంగా కొనసాగించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొంది. అయితే కేంద్రం ప్రతిపాదిస్తున్న దేశవ్యాప్తంగా చట్టసభ స్థానాలను 50 శాతం పెంచే విధానం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి కోత పడకుండా తెలంగాణకు అదనపు స్థానాలు లభించే అవకాశం ఉందని తెలిపింది.
ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని, రాజ్యసభలో తమ ముగ్గురు సభ్యులు అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు, అసెంబ్లీ స్థానాలు సుమారు 181–182కు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అయితే మరో 25 ఏళ్లపాటు ప్రాతినిధ్యాన్ని మార్చకుండా రాజ్యాంగపరమైన రక్షణ కల్పించే ప్రతిపాదన కూడా కీలకమని అభిప్రాయపడింది. శనివారం పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశాలపై పార్టీ వైఖరిని వివరించారు.
పార్టీ అధికారిక నిర్ణయానికి భిన్నంగా ఎవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని నేతలు, ప్రజాప్రతినిధులు, అధికార ప్రతినిధులకు స్పష్టం చేశారు. కొత్త స్థానాల పెంపుతో మరో 93 మందికి చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం వస్తుందని, సమర్థులైన నాయకులను గుర్తించి పార్టీ అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు.
పట్టభద్రుల ఓటరు నమోదు, దీక్షా దివస్ నిర్వహణ
ఆరు జిల్లాల పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితా సవరణను సీరియస్‌గా తీసుకోవాలని, అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. ఆదివారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కనీసం వెయ్యి మందితో దీక్షా దివస్ నిర్వహించాలని, సేవా కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ జిల్లా అలుగునూరు సభకు తాను హాజరుకానున్నట్లు వెల్లడించారు.


