పునర్వీభజనతో రాష్ట్రంలో పెరగనున్న స్థానాలు
మారనున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రం
మొత్తం అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు పెరిగే చాన్స్
17 నుంచి 26కు పెరగనున్న ఎంపీ సీట్లు
రంగారెడ్డికి అత్యధికంగా 14 అసెంబ్లీ సీట్లు అదనం
హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోనే 48 స్థానాలు
మల్కాజిగిరి రెండు లేదా మూడుగా విడిపోయే అవకాశం
మహిళలకు మొత్తం 61 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలు
2011 జనాభా లెక్కల ఆధారంగా ఉమ్మడి జిల్లాల వారీగా ‘సాక్షి’ అంచనా
సాక్షి, హైదరాబాద్: పునర్విభజనతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారబోతోంది. ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను సమానంగా 50 శాతం పెంచే రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ నెల 30 నుంచి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో వీటిని ప్రవేశపెట్టనున్నారు. ఇవి చట్టరూపం దాలిస్తే తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 17 నుంచి 25 లేదా 26కు పెరగనున్నాయి. అయితే జాతీయ స్థాయి అంచనాలను బట్టి ఆ సంఖ్య 26గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇప్పటి మాదిరిగానే ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండేలా పునర్విభజన చేస్తే, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు చేరుతాయి. రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన 153 స్థానాల కంటే ఇది 29 ఎక్కువ. కాగా రాష్ట్రానికి కొత్తగా 9 ఎంపీ, 63 ఎమ్మెల్యే స్థానాలు రానున్నాయి. 2011 జనాభా లెక్కలే ఈసారి పునర్వీభజనకు ప్రాతిపదిక కావడంతో ఈ లెక్కల ఆధారంగా ‘సాక్షి’ 10 ఉమ్మడి జిల్లాల వారీగా అంచనా వేసింది. పెరిగే 9 ఎంపీ, 63 అసెంబ్లీ స్థానాల్లో సింహభాగం హైదరాబాద్ శివార్లకే దక్కనుంది. ఒక్క ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకే 14 అసెంబ్లీ సీట్లు, 2 లోకసభ సీట్లు అదనంగా రావచ్చు.
సగటున 13.46 లక్షల జనాభా
జనాభా ప్రాతిపదికన 26 లోక్‌సభ స్థానాలు 26కు పెరిగే పక్షంలో ఒక్కో ఎంపీ స్థానంలో సగటున 13.46 లక్షల జనాభా ఉంటుంది. ఇప్పుడు ఆ సంఖ్య 20.59 లక్షలుగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఒక్కోదాని పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, 26 ఎంపీ స్థానాల లెక్కన 182 అసెంబ్లీ స్థానాలు ఏర్పడతాయి. ఇది 50 శాతం కంటే కొంచెం ఎక్కువ (53 శాతం). అసెంబ్లీలకు కూడా 50 శాతం పెంపుతో పాటు 10 శాతం అటు ఇటుగా మారేఅవకాశాలు కూడా ఉండటంతో 25 లోక్‌సభ స్థానాలను లెక్కలోకి తీసుకుంటే 175 అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.
రంగారెడ్డిలో అసెంబ్లీ స్థానాలు డబుల్
దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ స్థానాల్లో ఒకటైన మల్కాజిగిరి రెండు లేదా మూడుగా చీలే అవకాశం ఉంది. హైదరాబాద్–రంగారెడ్డి పరిధిలో ఇప్పుడున్న 4 ఎంపీ స్థానాలు 7కు పెరగొచ్చు. ఈ ఏడు ఎంపీ స్థానాల పరిధిలోనే 48 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. 2011 జనగణన ప్రకారం తెలంగాణ జనాభా 3,50,03,674. పోలవరం ముంపు కింద ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఏపీలో కలిసిన తర్వాత ఉన్న సంఖ్య ఇది. దీన్ని 182 స్థానాలతో భాగిస్తే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 1,92,328 మంది జనాభా వస్తారు.
కాగా 52.97 లక్షల జనాభాతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. రాష్ట్ర జనాభాలో 15.13 శాతం ఇక్కడే ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నది 14 స్థానాలు ఉండగా, ఒక్కో ఎమ్మెల్యే సగటున 3.78 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐటీ కారిడార్, పారిశ్రామికవాడలు, శివారు కాలనీలతో రంగారెడ్డి జనాభా వేగంగా పెరిగిన నేపథ్యంలో ఇక్కడ అసెంబ్లీ స్థానాలు 14 నుంచి 28కి పెరగనున్నాయి. మల్కాజిగిరితో పాటు కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం వంటి భారీ నియోజకవర్గాలు రెండు లేదా మూడుగా చీలే అవకాశం ఉంది.

మహానగరంలోనే 48 స్థానాలు
హైదరాబాద్ జిల్లాలో అసెంబ్లీ స్థానాలు 15 నుంచి 20కి పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో ఏకంగా 48 అసెంబ్లీ స్థానాలు (ఇప్పుడు 29) ఉండనున్నాయి. అయితే హైదరాబాద్ జిల్లాకు 33 శాతమే జనాభా పెరుగుదల ఉంటుంది. రాష్ట్రంలో ఇదే అతి తక్కువ పెరుగుదల రేటు. పాత నగరంలో జనాభా ఇప్పటికే సంతృప్త స్థాయికి చేరి, పెరుగుదల శివార్లకు మళ్లడమే దీనికి కారణం. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక్కో నియోజకవర్గ సగటు జనాభా 2.63 లక్షలుగా ఉంది. ఇది రాష్ట్ర సగటు కంటే తక్కువ.
హైదరాబాద్ పొరుగున ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో పటాన్‌చెరు, సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతాల ప్రభావంతో స్థానాలు 10 నుంచి 16కు, అంటే 60 శాతం పెరగొచ్చు. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా (40.53 లక్షలు) జనాభాలో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న 14 స్థానాలు 21కి పెరిగే చాన్స్ ఉంది. ఉమ్మడి నల్లగొండలో 12 నుంచి 18కి పెరగొచ్చు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నుంచి 20, ఆదిలాబాద్‌లో 10 నుంచి 14, నిజామాబాద్‌లో 9 నుంచి 13 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి వరంగల్‌లో ఇప్పుడున్న 12 స్థానాలు 18కి పెరగొచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మాత్రం మూడు నుంచి నాలుగు స్థానాలే అదనంగా దక్కే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం డివిజన్‌లోని ఏడు ముంపు మండలాలు ఏపీలో కలవడంతో జిల్లా జనాభా సుమారు 1.90 లక్షలు తగ్గింది.
ఎస్సీ, ఎస్టీలకు ఇలా..
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు 54.09 లక్షలు (15.45 శాతం), ఎస్టీలు 31.78 లక్షలు (9.08 శాతం) ఉన్నారు. ఈ నిష్పత్తి ప్రకారం 182 స్థానాల్లో సుమారు 28 ఎస్సీ, 17 ఎస్టీ స్థానాలు కావచ్చు. ఇప్పుడు ఇవి 19, 12గా ఉండగా, అదనంగా ఎస్సీలకు 9, ఎస్టీలకు 5 స్థానాలు దక్కే అవకాశం ఉంది. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ (ఆసిఫాబాద్, ఉట్నూర్), ఖమ్మం (భద్రాచలం, కొత్తగూడెం ఏజెన్సీ), వరంగల్ (ములుగు, మహబూబాబాద్) ప్రాంతాల్లో కొత్త ఎస్టీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. లోక్‌సభలో ఎస్సీ స్థానాలు 3 (పెద్దపల్లి, వరంగల్, నాగర్‌కర్నూల్) నుంచి 4కు పెరగొచ్చు. ఎస్టీ స్థానాలు 2 (ఆదిలాబాద్, మహబూబాబాద్) గానే ఉండే అవకాశం ఉందని పరిశీలకుల అంచనా.
మహిళలకు మూడో వంతు చొప్పున..
2023లో పార్లమెంటు ఆమోదించిన 106వ రాజ్యాంగ సవరణ (నారీశక్తి వందన్ అధినియం) ప్రకారం లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మూడో వంతు స్థానాలు మహిళలకు రిజర్వ్ అవుతాయి. పునర్వీభజన పూర్తయిన తర్వాతే ఇది అమల్లోకి వస్తుందని ఆ చట్టంలోనే ఉంది. అందుకే కేంద్రం ఈ రెండింటినీ కలిపి ముందుకు తెస్తోంది. ఇది అమలైతే రాష్ట్రంలో కనీసం 61 మంది మహిళలు సభలో అడుగుపెడతారు. అందులో ఎస్సీ మహిళలకు 9, ఎస్టీ మహిళలకు 6, జనరల్ మహిళలకు 46 స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇక లోక్‌సభలో మహిళలకు రిజర్వేషన్ 9కి చేరే అవకాశం ఉంది.
ఢిల్లీకి ముఖ్యమంత్రి
– రెండు, మూడురోజులు అక్కడే
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సోమవారం జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రెండు, మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల వేదికగా జరిగే రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన తన వంతుగా భాగస్వామి అయ్యేందుకు గాను ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది. కాగా ఆదివారం ఢిల్లీలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రెస్‌మీట్‌లో ఆయన పాల్గొంటారు.


