హైదరాబాద్: బోరబండ డివిజన్ మాజీ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌ని హత్య చేసేందుకు పన్నిన భారీ కుట్రని బోరబండ పోలీసులు భగ్నం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ స్వరాజ్ నగర్‌కు చెందిన ఇమ్రాన్, తన సోదరుడు ఫయాజ్‌తో కలిసి దాదాపు నెల రోజుల క్రితం తమ ప్రాంతానికి చెందిన మిస్బాని సంప్రదించి, ఫసియుద్దీన్‌ని అంతమొందించేందుకు రూ.20-25 లక్షల సుపారీ ఆఫర్ చేశారు. రూ.5 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కొందరు వ్యక్తులు మారణాయుధాలతో ఫసియుద్ఘీన్ ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించారు. ఈ విషయమై ఫసియుద్ధీన్, పోలీసులకు ఫిర్యాదు చేయగా బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఇమ్రాన్, ఫయాజ్, డి. రాజు తదితరులపై కేసు నమోదు చేశారు.
ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న బోరబండ పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన గంటల్లోనే కుట్రని భగ్నం చేశారు. ఆరోపణల ధృవీకరించడానికి, కుట్ర వెనుకున్న సూత్రధారులు, ఆర్థిక సహాయం అందించిన వారు, ఇతర సహచరులను గుర్తించి అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారుడు, సాక్షుల వాంగ్మూలాలను వెంటనే నమోదు చేసి, సాంకేతిక ఆధారాలను సేకరించారు. ప్రాణహాని దృష్ట్యా బాధితుడికి అవసరమైన భద్రతా చర్యలను తక్షణమే కల్పించారు.
సాక్షుల వాంగ్మూలం, విశ్వసనీయ సమాచారం ఆధారంగా కేసు నమోదైన గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. రెక్కీ సమయంలో నిందితులు ఉపయోగించిన 2 కత్తులు, 5 మొబైల్ ఫోన్లను బోరబండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


