కాంక్రీట్‌ జంగిల్‌తో కలకలం! | Hyderabad Faces Growing Threats from Water Scarcity and Air Pollution | Sakshi
Sakshi News home page

కాంక్రీట్‌ జంగిల్‌తో కలకలం!

Nov 29 2026 12:37 AM | Updated on Nov 29 2026 12:37 AM

Hyderabad Faces Growing Threats from Water Scarcity and Air Pollution

హైదరాబాద్‌ నగరంపై పెను ప్రభావం

అనూహ్యంగా వాతావరణ మార్పులు 

చెరువులు, చెట్లు కనుమరుగైతే నగరాలకు అనారోగ్యం  

హీట్‌ ఐలాండ్లుగా మారుతున్న పట్టణాలు

నీటి కొరత, వాయు కాలుష్యంతో ముప్పు 

‘అర్బన్‌ క్లైమేట్‌ ఛాలెంజెస్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌’ చర్చా వేదికలో నిపుణుల ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ పరిసరాల పట్టణ విస్తరణ ప్రాంతమైన క్యూర్‌ పరిధిలో నీరు ఇంకని ఉపరితలాలు 24 శాతం పెరిగాయి... దట్టమైన నిర్మిత ప్రాంతం గత రెండు దశాబ్దాల్లో రెట్టింపైంది... ఈ నిర్మాణాల విస్తరణలో సుమారు 30 శాతం బహిరంగ, బంజరు భూములు, 27 శాతం వృక్ష సంపదకు సంబంధించిన భూభాగం మార్పునకు గురయ్యాయి...దీని ప్రభావం రాత్రివేళల్లోనూ కనిపిస్తోంది. హైదరాబాద్‌లోని అర్బన్‌ హీట్‌ ఐలాండ్‌ ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే రాత్రి ఉష్ణోగ్రతలు సుమారు రెండు డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా నమోదవుతున్నట్లు స్పష్టమైంది.

శుక్రవారం జరిగిన తెలంగాణ క్లైమేట్‌ కాన్‌క్లేవ్‌–2026 కర్టన్‌రైజన్‌ కార్యక్రమంలో భాగంగా ‘అర్బన్‌ క్లైమేట్‌ ఛాలెంజెస్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌’చర్చా వేదిక ఈ సమస్యల తీవ్రతను స్పష్టం చేసింది. ప్రభుత్వ శాఖలు, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, యునిసెఫ్, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ కార్యకర్తలు, పట్టణ ప్రజాప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చి పట్టణ వాతావరణ సవాళ్లపై చర్చించారు. హైదరాబాద్‌తో పాటు నల్గొండ, మంచిర్యాల, సూర్యాపేట, వికారాబాద్, మిర్యాలగూడ, రామగుండం వంటి పట్టణాల సమస్యలూ ప్రస్తావనకు వచ్చాయి. ఈ చర్చల సారాంశం ఒక్కటే.. వాతావరణ మార్పులను ఎదుర్కోవడం అంటే కేవలం విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం కాదు. పట్టణాభివృద్ధి, నీటి నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యాన్ని ఒకే ప్రణాళికలో భాగం చేయాలి.  

ముఖ్యాంశాలు... 
⇒ పట్టణాల్లో ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణాల్లో భూమి వినియోగంలో వచ్చిన మార్పులు ఒకటి. భవనాలు, రహదారులు, కాంక్రీట్‌ ఉపరితలాలు పెరగడంతో భూమి సహజంగా నీటిని ఇంకించుకునే సామర్థ్యం తగ్గుతోంది. పచ్చదనం తగ్గడంతో సహజ శీతలీకరణ కూడా దెబ్బతింటోంది. 

⇒ పట్టణాల్లో ఉష్ణోగ్రతల నియంత్రణలో నీటి వనరులు, పచ్చదనం కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే నీలి వనరులు (బ్లూసింక్స్‌), పచ్చని వనరులు (గ్రీన్‌కవర్‌) పట్టణ వాతావరణ స్థిరత్వానికి రెండు ప్రధాన ఆధారాలుగా నిలుస్తాయని నిపుణుల అభిప్రాయం. 
⇒ చెరువులు కేవలం నీటిని నిల్వ చేసుకునే ప్రాంతాలు మాత్రమే కావు. అవి స్థానిక ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో, భూగర్భజలాల పెంపులో, జీవవైవిధ్య పరిరక్షణలో, వర్షపు నీటి నిర్వహణలో కీలకమైనవి. 

⇒ చెరువుల్లోకి మురుగునీరు చేరడం, ఫీడర్‌ ఛానళ్లు ఆక్రమణలకు గురికావడం, నాలాలు దెబ్బతినడం, కలుíÙత నీరు చేరడం వల్ల వాటి సహజ వ్యవస్థలు బలహీనపడుతున్నాయి. 
⇒ పట్టణాల్లో వర్షం పడితే నీరు రోడ్లపై ప్రవహించి వరదలకు కారణమవుతోంది. అదే సమయంలో వేసవిలో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి సరైన వ్యవస్థలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి. ప్రతి వార్డును ఒక యూనిట్‌గా తీసుకుని రెయిన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ ప్రణాళిక రూపొందించాలని సదస్సు సూచించింది. 

⇒ పార్కులు, ఖాళీ స్థలాలను వర్షపు నీటిని ఇంకించుకునే స్పాంజ్‌ ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి. ట్యాంకర్లపై ఎక్కువగా ఆధారపడుతున్న ప్రాంతాలను మ్యాప్‌ చేసి, అక్కడ అదనపు ఇంకుడు గుంతలు, సామూహిక వర్షపు నీటి నిల్వ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. 
⇒ అధిక ఉష్ణోగ్రతలు శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. వడదెబ్బ, డీహైడ్రేషన్, అలసట, గుండె సంబంధిత సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యల ముప్పు పెరుగుతుంది.  

⇒ ప్రతి వార్డులో హీట్‌–హెల్త్‌ సరై్వలెన్స్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. వేడి కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య, మరణాలు, ప్రాంతాల వారీగా అనారోగ్య వివరాలను సేకరించాలి.  
⇒ ఉపగ్రహ చిత్రాలు, జీఐఎస్‌ ఆధారంగా వేడి ప్రభావిత ప్రాంతాలను మ్యాప్‌ చేయాలి. భారత వాతావరణ శాఖ , ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్లు, నిరంతర పరిసర గాలి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థలు, తక్కువ ఖర్చుతో పనిచేసే సెన్సర్ల నుంచి వచ్చే సమాచారాన్ని సమీకరించాలి. 
⇒ వేడి హెచ్చరికలు, ఇతర అంశాలకు సంబంధించి ‘అర్బన్‌ క్లైమేట్‌ అండ్‌ హెల్త్‌ డాష్‌బోర్డ్‌’ఏర్పాటు చేయాలని సదస్సు సూచించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement