రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపీ
కేసు నమోదు చేసిన టీజీ సీఎస్‌బీ
సాక్షి, హైదరాబాద్: అధిక లాభాలు వస్తాయంటూ ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి భారీ మొత్తంలో టోకరా వేశారు. ప్రముఖ స్విస్ ఆర్థిక సంస్థ జూలియస్ బేర్ ఇన్వెస్టర్ ఎలైట్ గ్రూప్ పేరును ఉపయోగించుకుని, పెట్టుబడి సలహాదారులమంటూ నమ్మించి ఏకంగా రూ.4.27 కోట్లకు పైగా కాజేశారు. మొదట వాట్సాప్ గ్రూపులో చేర్చి ట్రేడింగ్ విధానాలు, అధిక లాభాల గురించి వివరించి బాధితుడితో పెట్టుబడులు పెట్టించారు. కొంత కాలం తర్వాత తన పెట్టుబడితోపాటు వచ్చిన లాభాలను వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించగా మరిన్ని డబ్బులు చెల్లించాలని షరతులు విధించారు.
బ్యాంకింగ్ సమస్యలు, సర్వర్ సమస్యలంటూ కాలయాపన చేయడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై శనివారం కేసు నమోదు చేసిన టీజీ సీఎస్‌బీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ప్రకారం వివరాలు.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రగతినగర్‌కు చెందిన 65 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి ఈ ఏడాది ఆగస్టులో ఓ మహిళ వాట్సాప్ ద్వారా పరిచయమైంది. తాను ముంబైలోని జూలియస్ బేర్ గ్రూప్ లిమిటెడ్‌కు చెందిన పెట్టుబడి సలహాదారుగా పనిచేస్తున్నానంటూ సోనల్ జగన్నాథ్ నాయక్ పేరుతో పరిచయం చేసుకుంది.
బాధితుడి అనుమతి లేకుండానే ఆయన ఫోన్ నంబర్‌ను ‘సీ75జులియస్ బేర్ ఇన్వెస్టర్ ఎలైట్ ’పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో చేర్చింది. కంపెనీ హెడ్‌గా కునాల్ సుమయా అనే మరో వ్యక్తిని పరిచయం చేసింది. వీరితోపాటు కస్టమర్ సర్వీస్ టీమ్ పేరుతో మరో నంబర్ నుంచి కూడా సంప్రదింపులు జరిపారు. వివిధ ట్రేడింగ్ పద్ధతులను వివరిస్తూ పెట్టుబడులకు ప్రోత్సహించారు. బాధితుడికి అధిక లాభాల ఆశ చూపుతూ పలుమార్లు వివిధ బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేయించారు. ఆగస్టు 5 నుంచి నవంబర్ 3 వరకు బాధితుడు పలు సేవింగ్స్ ఖాతాల నుంచి మొత్తం రూ.4,27,86,401 బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


