‘గ్లోబల్‌’ వేదికగా 11 కొత్త పాలసీలు! | Telangana to unveil 11 new policies at Global Summit | Sakshi
Sakshi News home page

‘గ్లోబల్‌’ వేదికగా 11 కొత్త పాలసీలు!

Nov 29 2026 12:43 AM | Updated on Nov 29 2026 12:43 AM

Telangana to unveil 11 new policies at Global Summit

ఆవిష్కరణకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు 

పరిశ్రమలు, ఐటీ, విద్యా రంగాలకు ప్రాధాన్యం

సాక్షి, హైదరాబాద్‌: పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ వేదికగా 11 కొత్త పాలసీలను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. పరిశ్రమలు, ఐటీ, విద్యాశాఖల పరిధిలో ఈ కొత్త పాలసీలను రూపొందించింది. ఇప్పటికే రాష్ట్రంలో బలంగా ఉన్న పారిశ్రామిక రంగాలను మరింత విస్తరించడంతో పాటు కొత్త రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా ఈ పాలసీలను తయారు చేసింది. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గతేడాది గ్లోబల్‌ సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. అందులో నిర్దేశించుకున్న లక్ష్యాలకు, భవిష్యత్‌ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త పాలసీలను తీసుకురానుంది. 

తయారీ రంగానికి తొలి ప్రాధాన్యం 
రాష్ట్రంలో తయారీ రంగాన్ని మరింత విస్తరించేందుకు నూతన పారిశ్రామిక విధానం (ఇండస్ట్రియల్‌ పాలసీ 2.0) తీసుకురానున్నారు. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశమున్న వస్త్ర తయారీ, రెడీమేడ్‌ దుస్తులు, పాదరక్షలు, తోలు ఉత్పత్తుల పరిశ్రమలకు ప్రత్యేక పాలసీలను రూపొందిస్తున్నారు. రక్షణ, విమానయాన, అంతరిక్ష పరిశ్రమల్లో తెలంగాణకు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు సమగ్ర పాలసీని సిద్ధం చేస్తున్నారు.పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా, గిడ్డంగులు, సరఫరా వ్యవస్థల అభివృద్ధికి లాజిస్టిక్స్‌ పాలసీని తీసుకురానున్నారు. 

సమగ్ర ఐసీటీ పాలసీతో పాటు.. 
సాఫ్ట్‌వేర్‌ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్ల ఏర్పాటు వేగంగా విస్తరిస్తోంది. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ రంగాల్లోనూ పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయి. ఆయా రంగాల అవసరాలకు అనుగుణంగా ఐటీ శాఖ కొత్త పాలసీలను సిద్ధం చేస్తోంది. సమగ్ర ఐసీటీ పాలసీతో పాటు గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్ల పరిశ్రమలకు ప్రత్యేక పాలసీలను తీసుకురానున్నారు. యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్‌ రంగాల అభివృద్ధికి ఏవీజీసీ పాలసీని రూపొందిస్తున్నారు. 

విదేశీ విద్యాసంస్థల కోసం... 
విదేశాల్లో పేరొందిన ఉన్నత విద్యాసంస్థలు రాష్ట్రంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రత్యేక పాలసీని తీసుకురానున్నారు. అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధన అవకాశాలు తెలంగాణ విద్యార్థులకు ఇక్కడే అందుబాటులోకి రావాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగానే విదేశీ ఉన్నత విద్యాసంస్థల క్యాంపస్‌ల ఏర్పాటుకు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు.

ఇవే 11 పాలసీలు...
1.    ఇండ్రస్టియల్‌ పాలసీ 2.0 
2.    ఫుట్‌వేర్‌ అండ్‌ లెదర్‌ పాలసీ 
3.    టెక్స్‌టైల్స్‌ అండ్‌ అపెరెల్‌ పాలసీ 2.0 
4.    ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్‌ పాలసీ 
5.    లాజిస్టిక్స్‌ పాలసీ 
6.    ఐసీటీ పాలసీ 2.0 
7.    గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ (జీసీసీ) పాలసీ 
8.    డేటా సెంటర్స్‌ పాలసీ 2.0 
9.    ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్‌ పాలసీ 
10.    యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్, గేమింగ్,కామిక్స్‌ (ఏవీజీసీ) పాలసీ 
11.    ఫారిన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌ పాలసీ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement