లీప్‌ సెకనుకు సెలవు! | Additional seconds added to the clock will be abolished starting from 2027 | Sakshi
Sakshi News home page

లీప్‌ సెకనుకు సెలవు!

Nov 29 2026 2:05 AM | Updated on Nov 29 2026 2:05 AM

Additional seconds added to the clock will be abolished starting from 2027

సమయం ఇక నిరంతరం.. అదనపు సెకను జోడించే పద్ధతికి స్వస్తి 

అణు గడియారాల సమయం, భూభ్రమణ సమయం మధ్య గరిష్టంగా గంట దాకా తేడాకు ఓకే

జనరల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ వెయిట్స్‌ అండ్‌ మెజర్స్‌ సమావేశంలో నిర్ణయం  

వచ్చే ఏడాది మే 20 నుంచి కొత్త విధానం అమల్లోకి

సాక్షి స్పెషల్‌ డెస్క్‌: క్యాలెండర్‌లో నాలుగేళ్లకోసారి వచ్చే లీప్‌ ఇయర్‌ గురించి అందరికీ తెలుసు. కానీ కాలాన్ని సరిచేసే లీప్‌ సెకను గురించి తెలుసా? ఆ లీప్‌ సెకను విధానానికి ఇకపై శాస్త్రవేత్తలు శాశ్వతంగా వీడ్కోలు పలకనున్నారు. దాని స్థానంలో ప్రపంచవ్యాప్తంగా సమయాన్ని మరింత సులభంగా, నిరంతరంగా నిర్వహించే సరికొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. 

లీప్‌ సెకను అంటే? 
ప్రపంచంలోని గడియారాలన్నీ అత్యంత కచ్చితమైన అణు గడియారాల ఆధారంగా సమయాన్ని లెక్కిస్తాయి. అయితే భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి, సముద్రపు అలల ప్రభావం వల్ల భూమి భ్రమణ వేగంలో స్వల్ప మార్పులు వస్తుంటాయి. దీనివల్ల అణు గడియారాల సమయానికి, భూమి భ్రమణం ఆధారంగా లెక్కించే సమయానికి మధ్య చిన్న తేడా ఏర్పడుతుంది. ఈ తేడాను సరిచేయడానికి అవసరమైనప్పుడు గడియారానికి అదనంగా ఒక సెకనును కలుపుతారు. దీనినే లీప్‌ సెకను అంటారు. 

సెకను పుట్టుక.. పరిణామం 
కాలమాన చరిత్రను పరిశీలిస్తే.. క్రీస్తుపూర్వం రెండో సహస్రాబ్దిలో ఈజిప్టువాసులు పగలు, రాత్రిని 12 భాగాలుగా విభజించారు. ఆ తర్వాత క్రీ.పూ. రెండో శతాబ్దంలో గ్రీకు శాస్త్రవేత్త హిప్పార్కస్‌ ఒక రోజును 24 సమాన గంటలుగా ప్రామాణీకరించారు. అనంతరం క్రీ.శ. 150 సంవత్సరంలో ఈజిప్టు ఖగోళ శాస్త్రవేత్త టాలమీ.. డిగ్రీలను నిమిషాలు, సెకన్లుగా విభజించే పద్ధతిని వాడుకలోకి తెచ్చారు. 1657లో నెదర్లాండ్స్‌కు చెందిన క్రిస్టియన్‌ హ్యూజెస్‌ లోలకం గడియారాన్ని రూపొందించి సెకన్లను భౌతికంగా కొలిచే విధానాన్ని అభివృద్ధి చేయగా 1967లో ఫ్రాన్స్‌లో అణు ప్రమాణం ఆధారంగా ఒక సెకనుకు కచ్చితమైన నిర్వచనం ఇచ్చారు. 

గత నెలలో కీలక నిర్ణయం 
ఆధునిక కాలమాన విధానమైన యూటీసీ (కోఆర్డినేటెడ్‌ యూనివర్సల్‌ టైమ్‌) అణు గడియారాల ఆధారంగా పనిచేస్తే యూటీ1 (యూనివర్సల్‌ టైమ్‌–1) అనేది భూమి వాస్తవ భ్రమణం ఆధారంగా సమయాన్ని లెక్కిస్తుంది. 1972 నుంచి 2016 వరకు ఈ రెండింటి మధ్య తేడాను సరిచేయడానికి మొత్తం 27 లీప్‌ సెకన్లను కలిపారు. అయితే గత నెల 15న ఫ్రాన్స్‌లోని వెర్సాలిస్‌లో జరిగిన 28వ జనరల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ వెయిట్స్‌ అండ్‌ మెజర్స్‌ సమావేశంలో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దీనిప్రకారం 2027 మే 20 నుంచి యూటీసీని నిరంతర కాలమాన విధానంగా కొనసాగించాలని.. యూటీసీ, యూటీ–1 మధ్య గరిష్టంగా ఒక గంట (3,600 సెకన్లు) వరకు తేడా ఉన్నా అనుమతించాలని తీర్మానించారు. దీనివల్ల భవిష్యత్తులో లీప్‌ సెకన్లను కలపాల్సిన అవసరం ఉండదు. 

ఎందుకు రద్దు చేస్తున్నారు? 
సాధారణంగా కంప్యూటర్లు రోజుకు 86,400 సెకన్లను మాత్రమే లెక్కించేలా తయారవుతాయి. అకస్మాత్తుగా ఒక అదనపు సెకనును కలపడం వల్ల సాఫ్ట్‌వేర్‌లు, సర్వర్లు, టెలికం వ్యవస్థల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. 2012 జూన్‌ 30న లీప్‌ సెకను కారణంగా అనేక సర్వర్లు మొరాయించడంతో గూగుల్, మెటా వంటి దిగ్గజ సంస్థలు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ పద్ధతులను వాడాల్సి వచ్చింది. మరోవైపు 2015 నుంచి భూమి భ్రమణ వేగం అసాధారణంగా పెరగడం మొదలైంది. 2022 జూన్‌ 29న భూమి అత్యంత వేగంగా తిరిగిన రోజుగా నమోదైంది. భవిష్యత్తులో ఒక సెకనును తగ్గించాల్సిన (మైనస్‌ లీప్‌ సెకను) పరిస్థితి వస్తే కంప్యూటర్‌ వ్యవస్థలు తట్టుకోలేవన్న ఆందోళనతోనే శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని నిలిపివేస్తున్నారు. 

సామాన్యులపై ప్రభావం 
లీప్‌ సెకను రద్దు వల్ల సాధారణ ప్రజల దైనందిన జీవితంలో ఎలాంటి మార్పూ ఉండదు. మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లేదా కంప్యూటర్ల సమయాన్ని చూసేవారికి ఎలాంటి తేడా కనిపించదు. అలాగే నాలుగేళ్లకు ఒకసారి ఫిబ్రవరిలో ఒకరోజు అదనంగా వచ్చే లీప్‌ ఇయర్‌ విధానం యథాతథంగా కొనసాగుతుంది. కేవలం ఖగోళ శాస్త్రవేత్తలు, ఉపగ్రహాలు, నేవిగేషన్‌ వ్యవస్థలను నిర్వహించే వారు మాత్రమే ఈ సమయ వ్యత్యాసాన్ని సరిచేసుకోవడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ విధానాలను ఉపయోగించాల్సి ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement