నగర ప్రజలపై వాయు కాలుష్యం ఎఫెక్ట్
సగటు ఆయుష్షు 5 నుంచి 9 ఏళ్లు తగ్గుదల
చికాగో వర్సిటీ ‘ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్’ నివేదిక వెల్లడి.. కరీంనగర్, నిజామాబాద్, తదితర జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరం
ప్రధాన పట్టణాలు, బొగ్గు గనులు, పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ తీవ్రత.. సైలెంట్ కిల్లర్‌గా మారుతోందంటున్న అధ్యయనాలు
భారత్‌లోని మరణాల్లో 18% వాయు కాలుష్యం వల్లే: ‘లాన్సెట్’
పీల్చే గాలిపైనా కొంచెం శ్రద్ధ చూపాలి: డా.హరికిషన్ గోనుగుంట్ల
సాక్షి, హైదరాబాద్: వాయు కాలుష్యం ‘సైలెంట్ కిల్లర్’గా మారుతోంది. మనం పీల్చే గాలి కేవలం ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతోందని అనుకుంటే పొరపాటే.. విషపూరితమైన గాలి నిశ్శబ్దంగా గుండె, మెదడు, శరీరంలోని ప్రతి అవయవాన్నీ దెబ్బతీస్తోందని వైద్య నిపుణులతో పాటు పలు అంతర్జాతీయ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లోని ప్రజల సగటు ఆయుష్షు 5–9 ఏళ్లు తగ్గినట్లు చికాగో వర్సిటీ ‘ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్’ నివేదిక వెల్లడించింది. భారత్‌లోని మరణాల్లో 18% వాయు కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అధ్యయనం పేర్కొంది.
ఇంకా డబ్ల్యూహెచ్‌ఓ, సీడీసీ, అమెరికా హార్ట్, గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ నివేదికల్లో కూడా ఈ ముప్పునకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా సూక్ష్మ రూపాల్లోని ధూళి కణాలు (పార్టీక్యూలేట్ మ్యాటర్–పీఎం 2.5) శ్వాస ద్వారా రక్త ప్రవాహంలోకి చేరి, శరీరం మొత్తం విస్తరించి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. వాయు కాలుష్యంలో అత్యంత ఆందోళన కలిగించే అంశం ఇదే. కలుషిత గాలిని పీలి్చన వెంటనే అందరికీ దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కొందరిలో ఎలాంటి స్పష్టమైన ఇబ్బందీ లేకుండానే దీర్ఘకాలిక ప్రభావాలు పేరుకుపోవచ్చు. రాష్ట్రంలో కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా ఉత్తర, దక్షిణ తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, బొగ్గు గనులు, పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంది.

పలు రకాలుగా ప్రభావం
పార్టీక్యూలేటెడ్ మ్యాటర్ (పీఎం 2.5, పీఎం 10–ధూళి కణాల సైజును బట్టి దీనిని వర్గీకరిస్తారు) వంటి అతి సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల్లోకి లోతుగా చొచ్చుకెళ్లగలవు. వాటిలోని కొన్ని కణాలు ఊపిరితిత్తుల రక్షణ వ్యవస్థను దాటి రక్తప్రసరణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫలితంగా శరీరంలో వాపు (ఇన్‌ఫ్లమేషన్) ప్రక్రియలు, ఆక్సిడేటివ్ ఒత్తిడి, రక్తనాళాల పనితీరులో మార్పులు ఏర్పడవచ్చు. పీఎం 2.5 అంటే 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసం కలిగిన సూక్ష్మ ధూళి కణాలు. ఇవి వెంట్రుక మందంతో పోలిస్తే చాలా చిన్నవి. వాహనాల పొగ, పరిశ్రమల ఉద్గారాలు, ఇంధన దహనం, నిర్మాణ పనులు, ఇతర కాలుష్య వనరుల నుంచి ఇవి వెలువడతాయి.

కఠినంగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలు
భారత ప్రమాణాల్లో పీఎం 2.5 రోజువారీ పరిమితి 60 (మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్) కాగా, డబ్ల్యూహెచ్‌వో సూచించిన పరిమితి 15 మాత్రమే. అంటే భారత ప్రమాణం కంటే ఈ ఆరోగ్య మార్గదర్శకం నాలుగింతలు కఠినంగా ఉంది. పీఎం 10 విషయంలో భారత పరిమితి 100 కాగా డబ్ల్యూహేచ్‌వో సూచన 45 మాత్రమే. అంటే కాలుష్యం భారత చట్టబద్ధ పరిమితుల్లో ఉన్నంత మాత్రాన అది హానికరం కాదని భావించకూడదు. డబ్ల్యూహెచ్‌వో సూచనలు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా రూపొందించారు.
నష్టం ఒక్కరోజులో కన్పించదు
ప్రస్తుతం మనం తినే ఆహారం, తాగే నీటి నాణ్యతపై చూపించే శ్రద్ధలో కొంతైనా ప్రతి క్షణం పీల్చే గాలిపై చూపాలి. ఆహారం, నీరు లేకుండా కొంతకాలం జీవించగలిగినా.. గాలి లేకుండా కొన్ని నిమిషాలు కూడా ఉండలేం. అలాంటి గాలే కలుషితమైతే? అది కేవలం దగ్గు, తుమ్ములు, ఆయాసానికే పరిమితం కాదు. శరీరంలోని కీలక అవయవాలపై నిశ్శబ్దంగా దాడి చేస్తుంది. కాలుష్యం వల్ల కలిగే నష్టం ఒక్కరోజులో కనిపించదు.. ఏళ్ల తరబడి నిశ్శబ్దంగా నష్టం జరుగుతూ ఉంటుంది. దీర్ఘకాలంలో గుండె జబ్బులు, పక్షవాతం, ఊపిరితిత్తుల క్యాన్సర్, జ్ఞాపకశక్తి క్షీణత, మధుమేహం, మూత్రపిండాల సమస్యల ముప్పును ఇది పెంచవచ్చు. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
– డా.హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద ఆసుపత్రి


