హసీనాకు బంగ్లాదేశ్‌ షాక్.. దేశంలో అడుగుపెడితే.. | No possibility of her return Bangladesh rejects Hasinas homecoming | Sakshi
Sakshi News home page

హసీనాకు బంగ్లాదేశ్‌ షాక్.. దేశంలో అడుగుపెడితే..

Nov 29 2026 8:26 AM | Updated on Nov 29 2026 8:26 AM

No possibility of her return Bangladesh rejects Hasinas homecoming

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లాలన్న ప్రయత్నాలకు అక్కడి ప్రభుత్వం నుంచి ఎదురుదెబ్బ తగిలింది. డిసెంబర్ 16న విజయ్ దివస్ సందర్భంగా భారత్ నుంచి ఢాకాకు తిరిగి రావాలని ఆమె భావిస్తున్నప్పటికీ.. అందుకు ఏమాత్రం అవకాశం లేదని ప్రధాని తారిఖ్ రెహమాన్ ప్రభుత్వ సలహాదారు జాహెద్ ఉర్ రెహమాన్ స్పష్టం చేశారు. హసీనా తిరిగి రావడం అసాధ్యమని నవంబర్ 28న ఢాకాలో వ్యాఖ్యానించారు. ఆమె బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే అరెస్టు తప్పదని ప్రభుత్వ ప్రతినిధులు కూడా హెచ్చరించారు.

ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
నవంబర్ 24న హసీనా ప్రతినిధి సయ్యద్ మొజమ్మెల్ అలీ ఆమె స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 16న న్యూఢిల్లీ నుంచి ఢాకాకు బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ విమానంలోనే ఆమె భారత్‌కు వెళ్లారని, ఇప్పుడు తిరిగి రావడానికి కూడా ప్రభుత్వం విమాన ప్రయాణ సదుపాయం కల్పించాలని కోరారు. రాజ్యాంగ విరుద్ధ పరిస్థితుల్లో ఆమె దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందని, తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వాదించారు.

వస్తే అరెస్టు.. జైలుకు పంపిస్తాం
అయితే హసీనా ప్రతిపాదనను బంగ్లాదేశ్ ప్రభుత్వం తిరస్కరించింది. ఆమె దేశంలోకి ప్రవేశిస్తే వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని విదేశాంగ శాఖ సహాయ మంత్రి షమా ఒబైద్ ఇస్లాం హెచ్చరించారు. భారత్‌తో చర్చలు, అధికారిక దౌత్యపరమైన ప్రక్రియల ద్వారానే అప్పగింత వ్యవహారం పరిష్కారం కావాలని ప్రభుత్వం భావిస్తోంది. హసీనాను అప్పగించాలని ఢాకా ఇప్పటికే భారత్‌ను కోరింది. ఈ విజ్ఞప్తిని సంబంధిత చట్టపరమైన ప్రక్రియల ప్రకారం పరిశీలిస్తున్నట్లు గతంలో భారత్ తెలిపింది.

15 ఏళ్ల పాలనకు తెర.. భారత్‌లో ఆశ్రయం
2024 జులైలో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ఆగస్టు 5న హసీనా దేశం విడిచి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. 2025 నవంబర్‌లో బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్.. ఆందోళనలపై జరిగిన అణచివేతకు సంబంధించిన మానవత్వానికి వ్యతిరేకమైన నేరాల్లో ఆమెకు గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. అయితే ఈ ఆరోపణలను హసీనా ఖండించారు. విచారణ చట్టబద్ధతను కూడా ప్రశ్నించారు. ఆ హింసాకాండలో 1,400 మంది వరకు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 

ఇదీ చదవండి: అమెరికాలో భూకంపం.. ఎయిర్‌పోర్టులో కలకలం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement