బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారా? అవసరమైతే భారత్-బంగ్లాదేశ్ సరిహద్దును కాలినడకన దాటి వెళ్లేందుకు కూడా ఆమె వెనుకాడటం లేదా? విమాన ప్రయాణానికి అనుమతి లభించకపోతే నడుచుకుంటూ అయినా బంగ్లాదేశ్‌లోకి అడుగుపెడతారని ఆమె సన్నిహిత సహాయకుడు చేసిన న తాజా వ్యాఖ్యలు ఆ దేశ రాజకీయాల్లో మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి.
మరో వైపు, ఆమెకు స్వాగతం పలికేందుకు ఏకంగా 50 లక్షల మంది మద్దతుదారులను సమీకరించడంతో పాటు, సరిహద్దు నుంచి రాజధాని ఢాకా వరకు 230 కిలోమీటర్ల మేర మానవహారం ఏర్పాటు చేయాలని అవామీ లీగ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షేక్ హసీనా సన్నిహిత సహాయకుడు అబు ఒబైదా అరీన్ ఈ విషయాలను వెల్లడించారు.
డిసెంబర్ 16న బంగ్లాదేశ్ విజయ దినోత్సవం నాటికి హసీనా స్వదేశానికి తిరిగి రావాలని పట్టుదలతో ఉన్నారని తెలిపారు. ఢిల్లీలోని విమానాశ్రయం నుంచి ఢాకాకు వాణిజ్య విమానంలో వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోతే, కాలినడకనైనా దేశంలోకి ప్రవేశించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
అవసరమైతే ఆమె బంగ్లాదేశ్‌లోకి నడుచుకుంటూ వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నారంటూ అరీన్ బీబీసీకి తెలిపారు. 2024 ఆగస్టులో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన తిరుగుబాటుతో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ఆమె దేశం విడిచి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి భారత్‌లోనే ఉంటున్నారు. ఇప్పుడు ఆమె తిరిగి వచ్చే ప్రయత్నాలు బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న 4,096 కిలోమీటర్ల సరిహద్దులో హసీనా ప్రవేశించేందుకు అనువైన తొమ్మిది మార్గాలను ఆమె మద్దతుదారులు గుర్తించినట్లు అరీన్ వెల్లడించారు. ఇందుకోసం పక్కా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. హసీనా తిరుగు ప్రయాణానికి సన్నాహాల్లో భాగంగా అవామీ లీగ్ నేతలు సరిహద్దు ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నవంబర్ 23న అవామీ లీగ్ సీనియర్ నేతలు జహంగీర్ కబీర్ నానక్, బహావుద్దీన్ నసీమ్ మరో ఇద్దరితో కలిసి పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఉన్న పెట్రాపోల్ సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించినట్లు బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది. అక్కడి ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో సుమారు రెండు గంటల పాటు గడిపారు.
హసీనాకు స్వాగతం పలికేందుకు ఐదు మిలియన్ల మంది (50 లక్షలు) ప్రజలను సమీకరించగలమని అరీన్ ధీమా వ్యక్తం చేశారు. సరిహద్దు నుంచి ఢాకా వరకు మానవహారం ఏర్పాటు చేస్తామని చెప్పారు. భారత్‌లోని పెట్రాపోల్ నుంచి బంగ్లాదేశ్‌లోని బెనాపోల్ మీదుగా రాజధాని ఢాకాకు సుమారు 230 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
మరో వైపు, హసీనా గత 18 నెలలుగా టెలిగ్రామ్ ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆడియో సమావేశాలు నిర్వహిస్తున్నారని అరీన్ వెల్లడించారు. ఇప్పటివరకు 300కు పైగా సమావేశాలు నిర్వహించారని, బంగ్లాదేశ్‌లోని 64 జిల్లాలు, 300 నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులతో మాట్లాడారని తెలిపారు. ఒక్కోసారి ఈ సమావేశాలు నాలుగైదు గంటలపాటు కొనసాగుతున్నాయని చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు కార్యకర్తల అభిప్రాయాలను ఆమె స్వయంగా తెలుసుకుంటున్నారని వివరించారు.
డిసెంబర్ 16న హసీనా స్వదేశానికి తిరిగి వస్తారన్న విషయాన్ని ఆమె అధికార ప్రతినిధి సయ్యద్ మొజమ్మెల్ అలీ నవంబర్ 24న ప్రకటించారు. ఢిల్లీ నుంచి ఢాకాకు వాణిజ్య విమానాన్ని ఏర్పాటు చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ విమానంలోనే హసీనాను భారత్‌కు తరలించినందున ఆమె తిరుగు ప్రయాణానికి కూడా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఆ దేశ ప్రభుత్వంపై ఉందని రాయిటర్స్‌తో అన్నారు.
అంతకుముందు నవంబర్ 9న లండన్‌కు చెందిన మ్యాట్రిక్స్ ఛాంబర్స్ న్యాయవాదులు హసీనా తరఫున బంగ్లాదేశ్ హైకమిషన్‌ను సంప్రదించారు. ఆమెకు కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు (ఎన్‌ఐడీ) జారీ చేయాలని కోరారు. అయితే, బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని తిరస్కరించింది. హసీనాను సాధారణ ప్రయాణికురాలిగా విమానంలో తీసుకురావడం సాధ్యం కాదని.. ఆమెపై ఉన్న కేసులు, శిక్ష నేపథ్యంలో అప్పగింత ప్రక్రియ (ఎక్స్‌ట్రడిషన్) ద్వారానే తీసుకురావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
2024లో జరిగిన ఉద్యమాన్ని అణచివేసేందుకు చేపట్టిన చర్యలకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ హసీనాకు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. 1971లో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి పొందిన రోజైన డిసెంబర్ 16న హసీనా స్వదేశానికి తిరిగి రావాలనే కోరిక.. ఇప్పుడు ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ నుంచి విమానంలో వస్తారా? లేక సరిహద్దు దాటి కాలినడకన ప్రవేశిస్తారా? అన్నది ఇంకా స్పష్టత లేదు.
ఇదీ చదవండి: పదహారు దేశాల్లో ఆకలి కేకలు


