యూఎన్ నివేదిక హెచ్చరిక
ఐదు దేశాలు అత్యంత తీవ్రం
కైరో: యుద్ధాలు, ఇంధన ధరల పెరుగుదల, అంతర్జాతీయ సాయంలో గణనీయమైన కోతల కారణంగా వచ్చే ఆరు నెలల్లో ప్రపంచంలోని 16 దేశాల్లో ఆకలి సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థలు హెచ్చరించాయి. సూడాన్, యెమెన్, దక్షిణ సూడాన్, సోమా లియా, ఉత్తర నైజీరియాల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉండనుందని గుర్తించాయి. ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ), ద వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌లు సంయుక్తంగా విడుదల చేసిన ‘‘హంగర్ హాట్‌స్పాట్స్’’ నివేదికలో డిసెంబర్ 2025 నుంచి మే 2026 వరకు ఉన్న పరిస్థితులను విశ్లేషించారు.
గాజాలో 2025 అక్టోబరు నుంచి కాల్పుల విరమణ అమలులోకి రావడంతో పాలస్తీనా ప్రాంతాలల్లో ఆకలి సమస్య తీవ్రతను ఒక స్థాయి తగ్గించారు. అయినప్పటికీ ఇక్కడ 67 శాతం మంది ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు నివేదిక వెల్లడించింది. సూడాన్‌లోని ఉత్తర దర్ఫూర్, దక్షిణ కొర్దోఫాన్ ప్రాంతాల్లో జనవరి వరకు కరువు ప్రమాదం కొనసాగనుందని నివేదిక తెలిపింది. దేశ జనాభాలో దాదాపు 41 శాతం మంది, అంటే 1.95 కోట్ల మంది ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు అంచనా వేసింది.
కొన్ని శిబిరాల్లో కరవు పరిస్థితులు మించిన పోషకాహార లోపం కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. యుద్ధం, ఇంధన ధరల పెరుగుదల వల్ల సూడాన్‌లో జొన్నల ధర రెండింతలైందని, డీజిల్ ధర పెరగడం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తోందని తెలిపింది. ఈ ఏడాది ఎల్‌నీనో ప్రభావం సూడాన్‌లో కరువు పరిస్థితులు మరింత తీవ్రం అయ్యేందుకు కారణమయ్యాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. యుద్ధం, ఎల్‌నీనోలు రెండింటి కారణంగా ఆహార ఉత్పత్తి బాగా తగ్గిందని ఎఫ్‌ఏఓ అధికారి బెత్ బెచ్‌డోల్ పేర్కొన్నారు.
యమెన్‌లో ముదిరిన ఘర్షణలు..
ఈ ఏడాది జూలై నుంచి యమెన్‌లో ఘర్షణల ఎక్కువ కావడం ఆకలి సమస్య కూడా మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. 2014 నుంచి అంతర్యుద్ధంలో చిక్కుకున్న ఆ దేశంలో ఇప్పటికే లక్షలాది మంది నిర్వాసితులుగా మారారు. దేశంలో ఇటీవలి హింసాకాండ కారణంగా మూడు లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఫలితంగా ఆకలి సమస్య కూడా ఎక్కువైందని వివరించింది.
భారీగా తగ్గిన అంతర్జాతీయ సాయం
దేశాలు అందించే సాయం తగ్గిపోవడం వల్ల ఆహార సమస్యను సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నట్లు ఈ సంస్థలు తమ నివేదికలో స్పష్టం చేశాయి. విధాన మార్పుల ఫలితంగా మానవతా, అభివృద్ధి సహాయ రంగాలకు నిధులు వందల కోట్ల డాలర్ల మేర తగ్గిపోయాయని ఐరాస అధికారులు చెబుతున్నారు. సమస్య ఎక్కువగా ఉన్న ఐదు దేశాలకు ఆహార, పోషకాహార సాయం 2022–2025 మధ్యలో 62% తగ్గిందని తెలిపింది. యెమెన్ విషయంలో ఈ తగ్గుదల 79%మని చెప్పింది.


