క్రూయిజ్‌పైనే గడిపేద్దామనుకున్నారు కానీ.. | Cruise ship residents left stranded in Cambodia after fuel prices soar | Sakshi
Sakshi News home page

క్రూయిజ్‌పైనే గడిపేద్దామనుకున్నారు కానీ..

Oct 29 2026 6:10 AM | Updated on Oct 29 2026 6:32 AM

Cruise ship residents left stranded in Cambodia after fuel prices soar

ఇంధన ఖర్చులతో ప్రయాణానికి బ్రేక్‌ 

కంబోడియా తీరంలో ఎంవీ ఒడిస్సీ లంగరు 

చిక్కుకుపోయిన 200 మంది 

చేతులెత్తేసిన నిర్వహణ సంస్థ

సిహాంకువిల్లే (కంబోడియా): సముద్రంపై ప్రపంచాన్ని చుట్టేదామనుకున్న వారి ఆశలకు బ్రేక్‌ పడింది. ఇరాన్‌ యుద్ధం పుణ్యమా అని చమురు ధరలు ఆకాశాన్ని అంటడంతో వీరు ప్రయాణిస్తున్న క్రూయిజ్‌ నౌక కాస్తా కంబోడియా తీరంలో లంగరు వేసేసింది. ప్రయాణం ముందుకు సాగుతుందో లేదో తెలియని స్థితి! ఇదీ.... ఎంవీ ఒడిస్సీ నౌక ప్రస్తుత పరిస్థితి. ఏంటి దీని కథ అంటే... 

మూడేళ్ల క్రితం ఈ నౌక నిర్వహణ బాధ్యతలను ‘విల్లా వీ రెసిడెన్సెస్‌’ అనే సంస్థ చేపట్టింది. 2024లో ఈ సంస్థ ‘‘మీరు సముద్రంపైనే ప్రపంచాన్ని చుట్టేయాలని అనుకుంటున్నారా?  అయితే ఎంవీ ఒడెస్సీ మీ కోసమే’’ అంటూ బోలెడన్ని ప్రకటనలు గుప్పించింది. ఆడుతుపాడుతూ అలలపైనే గడిపేద్దామని సుమారు 200 మంది మూడేళ్ల టూర్‌కు ముందుకొచ్చారు కూడా. ఒక్కో సూట్‌ను  దాదాపు 23 లక్షల రూపాయలకు అమ్మేసింది ఈ విల్లా వీ రెసిడెన్సెస్‌ సంస్థ. హంగు ఆర్భాటాలతో 156 మంది సిబ్బందతో కలిసి సముద్రయానం... మొదలైంది కూడా. అయితే ఏడు ఖండాలు చుట్టేసేలోపే కంబోడియా తీరంలోని సిహాంకువిల్లే వద్ద  వీరి ప్రయాణం ఆగిపోయింది కూడా.  

ఒక్కో క్యాబిన్‌ నిర్వహణకు నెలకు రూ.1.8 లక్షల వరకూ ఇంధనం ఖర్చవుతోందని, ప్రయాణం మొదలుపెట్టినప్పటితో పోలిస్తే ఇది దాదాపు నాలుగు రెట్లు ఎక్కువని ‘విల్లా వీ రెసిడెన్సెస్‌’ ఇప్పుడు వాపోతోంది. ప్రస్తుతం యుద్ధం ప్రభావంతో ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన ఖర్చు ఆరు నుంచి ఎనిమిది లక్షల రూపయాలకు చేరుకుందని తెలిపింది. అక్కడికి మేము క్రూయిజ్‌ వేగాన్ని తగ్గించి ఇంధనం ఆదా చేసే ప్రయత్నం చేశామని, రేవుల్లోనే ఎక్కువ కాలం గడిపామని తెలిపింది. హర్మూజ్‌ జలసంధి ద్వారా చమురు రవాణా తగ్గిపోవడంతో పరిస్థితి మరింత దిగజారిందని తెలిపింది. పోనీ పెరిగిన ఖర్చులను ప్రయాణీకులపై వేద్దామా అంటే అది ఆచరణీయమైన పరిష్కారం కాదని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.  

కంపెనీపై ప్రయాణీకుల ఆగ్రహం.. 
ఎంవీ ఒడెస్సీని అర్ధంతరంగా కంబోడియా తీరంలో నిలిపివేయడంపై ఇప్పుడు ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం కేవలం ఏడు గంటల నోటీసిచ్చి నౌకను నిలిపేశారని, దీంతో తాము చాలా ఇబ్బంది పడ్డామని, తాత్కాలిక వసతి ఏర్పాట్లూ సొంతంగా చేసుకోవాల్సి వచ్చిందని, ఎవరూ సాయం చేయలేదని  కొందరు ప్రయాణికులు చెబుతున్నారు. దాదాపు 17 నెలలుగా నౌకలోనే ఉంటున్న పాల్, లిన్‌ మోంటోయా (అమెరికాలోని వయోమింగ్‌) దంపతులు మాట్లాడుతూ క్రూయిజ్‌పై శాశ్వతంగా నివసించడమన్న ఐడియా వినూత్నంగానే ఉన్నా.. కంపెనీ యజమానికి దీన్ని సరిగ్గా నిర్వహించే నైపుణ్యం లేకుండా పోయిందని విమర్శించారు.

 ఈ మధ్యకాలంలో క్రూయిజ్‌లో ఇంటర్నెట్‌ సౌకర్యానికి ఇబ్బందులు వచ్చాయని, భోజనం నాణ్యత కూడా తగ్గిపోయిందని, ఫలితంగా కొంతమంది నౌకను వదిలి పోయారని తెలిపారు. ఇంధనం, ఇతర ఖర్చుల కోసం అదనంగా డబ్బులు వసూలు చేశారని లిన్‌ వివరించింది. సిబ్బందికి కూడా జీతాలు సక్రమంగా ఇచి్చనట్లు లేదని తెలిపింది. అయితే కొందరు మాత్రం ఈ ప్రయాణం కొంత విరామం తరువాతైనా కొనసాగుతుందని ఆశిస్తూండటం విశేషం. 1993లో నిర్మాణమైన ఎంవీ ఒడిస్సీని  వివిధ క్రూయిజ్‌ సంస్థలు రకరకాల పేర్లతో నడిపాయి. 2020లో కరోనా తరువాత ఇది ఆగిపోయింది. 2023లో దీన్ని ‘విల్లా వీ రెసిడెన్సెస్‌’ కొనుగోలు చేసింది. 2024 అక్టోబర్‌లో ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌లో ఎంవీ ఒడెస్సీ ప్రయాణం మొదలు కాగా మూడేళ్ల పాటు కొనసాగించాలని భావించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement