మళ్లీ పెట్రో మోత? | India public-sector oil marketing companies faced a collective net losss | Sakshi
Sakshi News home page

మళ్లీ పెట్రో మోత?

Sep 10 2026 5:40 AM | Updated on Sep 10 2026 5:40 AM

India public-sector oil marketing companies faced a collective net losss

100 డాలర్లకు క్రూడాయిల్‌ రేట్లు 

ఆయిల్‌ కంపెనీలకు పెరుగుతున్న ఆదాయ నష్టాలు 

లీటరుకు పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 23 లాస్‌

న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. అయినప్పటికీ, దేశీయంగా ఇంధనాల రేట్లు యథాతథంగా కొనసాగుతున్న నేపథ్యంలో దేశీ ఆయిల్‌ కంపెనీలకు ఆదాయ నష్టాలు మరింతగా పెరుగుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్‌ సంస్థలు లీటరుకు పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 23, ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ. 200 చొప్పున ఆదాయాన్ని నష్టపోతున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో నష్టాల భర్తీ కోసం మరోమారు పెట్రోల్, డీజిల్‌ రేట్ల మోత మోగవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా ఇంధనాల రేట్లను నిర్ణయించేందుకు ప్రామాణికంగా తీసుకునే బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ రేటు బుధవారం మళ్లీ 100 డాలర్లకు ఎగియగా, నైమెక్స్‌ రేటు కూడా దానికి సమీపంలో 95 డాలర్ల వద్ద తిరుగాడుతోంది. భారత్‌ దిగుమతి చేసుకునే ఇండియన్‌ క్రూడ్‌ బాస్కెట్‌ ధర 109 డాలర్లకు చేరినట్లు రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రశాంత్‌ వశి‹Ù్ట తెలిపారు. ఇరాన్‌– అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.

 ‘చైనా సహా పలు దేశాలు ప్రస్తుతం తమ వ్యూహాత్మక నిల్వలను ఉపయోగించుకుంటున్నాయి. సరఫరా అంతంతమాత్రంగా ఉన్న తరుణంలో, ఒకవేళ భౌగోళిక–రాజకీయ పరిస్థితులు ఇలాగే కొనసాగి,  ఆయా దేశాలు కూడా మళ్లీ కొనుగోళ్లకు దిగాయంటే, , డిమాండ్‌ మరింత పెరుగుతుంది‘ అని పేర్కొన్నారు.  మరోవైపు, ఫ్లెక్సి ఫ్యూయల్స్‌ వాహనాలకి పెట్రోల్‌లో 20 శాతం పైగా ఇథనాల్‌ని కలిపేందుకు అనుమతించడంపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు ప్రధానికి సలహాదారు తరుణ్‌ కపూర్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ–20 పెట్రోల్‌ వినియోగంలో ఉన్న సంగతి తెలిసిందే.  

దిగుమతులు భారం.. 
క్రూడాయిల్‌ దిగుమతులు, వినియోగంలో ప్రపంచంలోనే భారత్‌ మూడో స్థానంలో ఉంది. పెట్రోల్, డీజిల్‌ మొదలైన వాటి ఇంధనాల ఉత్పత్తి కోసం దాదాపు 88 శాతం క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. దీనికి డాలర్ల మారకంలో చెల్లించాల్సి ఉంటోంది. కాబట్టి క్రూడాయిల్‌ ధరలు పెరిగితే ఆ మేరకు దిగుమతుల భారంతో పాటు వాణిజ్య లోటు, రూపాయి మారకం విలువపైనా ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు తెలిపారు.

 ఏప్రిల్‌–జూలై మధ్య కాలంలో భారత చమురు దిగుమతుల బిల్లు 56 శాతం ఎగిసి 63.4 బిలియన్‌ డాలర్లకు చేరింది. గతేడాది ఇదే వ్యవధిలో ఈ బిల్లు 40.5 బిలియన్‌ డాలర్లు. గతేడాది ఏప్రిల్‌–జూలై మధ్య కాలంలో 81.5 మిలియన్‌ టన్నులు దిగుమతి చేసుకోగా, ఈసారి అదే వ్యవధిలో 81.9 మిలియన్‌ టన్నుల ఆయిల్‌ దిగుమతి అయ్యింది. పరిమాణంలో పెద్దగా మార్పు లేకపోయినా విలువ మాత్రం భారీగా పెరగడం గమనార్హం.

అన్నింటి రేట్లూ భగ్గు ..
క్రూడాయిల్‌ రేట్లు ఎగిస్తే దేశీయంగా ఇంధనాలు, రవాణా వ్యయాలూ పెరిగి, అంతిమంగా అన్నింటి ధరల పెరుగుదలకు దారి తీయొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తు తానికైతే రిటైల్‌ బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ రేట్లు మూడు నెలలుగా యథాతథంగానే ఉంటున్నప్పటికీ, ఎంతకాలం అంతర్జాతీయంగా రేట్లు అధిక స్థాయిలో కొనసాగుతాయో, ఎంత భారాన్ని ఇంధన కంపెనీలు కస్టమర్లకు బదలాయిస్తాయనే అంశాలపైనే వినియోగదారులు, ఎకానమీపై పడే ప్రభావం ఆధారపడి ఉంటుందని అనలిస్టులు పేర్కొన్నారు. వాణిజ్య లోటు పెరిగి, రూపాయి క్షీణిస్తే అక్టోబర్‌ 7న ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ కీలక పాలసీ రేట్లను తగ్గించకుండా 5.25 శాతం స్థాయిలోనే కొనసాగించవచ్చని బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ సంస్థ రీసెర్చ్‌ హెడ్‌ రాజీవ్‌ శరణ్‌ తెలిపారు. దేశీయంగా చివరిసారిగా మే 25న పెట్రోల్‌ రేటు లీటరుకు రూ. 2.61 చొప్పున, డీజిల్‌ ధర రూ. 2.71 చొప్పున పెరిగాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement