ట్రంప్‌ మ్యాప్‌ల సంబరం! | Sakshi Editorial On US President Donald Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ మ్యాప్‌ల సంబరం!

Aug 20 2026 1:18 AM | Updated on Aug 20 2026 1:18 AM

Sakshi Editorial On US President Donald Trump

హార్మూజ్‌ జలసంధిని ‘చాలా త్వరలోనే’ అమెరికా భూభాగంగా మారుస్తానని గతవారం ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినప్పుడు ఇరాన్‌పై మళ్లీ భీకర దాడులకు తెగబడొచ్చని కొందరు అనుమానించారు. తీరా మంగళవారం ఆయన చేసిందల్లా ‘అమెరికా కొత్త భూభాగం’ అని రాసివున్న హార్మూజ్‌ జలసంధి మ్యాప్‌ను విడుదల చేయటమే. దీంతో ఇరాన్‌ దౌత్యవేత్తలు ప్రతిదాడికి దిగారు. కాలిఫోర్నియాను ఇరాన్‌ భూభాగంగా చూపుతూ ఇరాన్‌ కాన్సులేట్‌ ఒక చిత్రపటాన్ని విడుదల చేసింది. వేరే దేశాల భూభాగాలు డిమాండ్‌ చేయటం, వాటిని అమెరికా భౌగోళిక చిత్రపటాల్లో భాగంగా చూపటం ట్రంప్‌కు కొత్తేం కాదు. రెండోసారి అధికారంలోకొచ్చిన వెంటనే గ్రీన్‌లాండ్‌పై ఆయన కన్నుపడింది. అలాగే కెనడాను అమెరికాలో విలీనం చేసుకుని 51వ రాష్ట్రంగా మారుస్తామనీ, పనామా కాల్వ ఇకపై తమదేననీ, గాజాను ‘సొంతం’ చేసుకుంటామనీ కూడా పలుమార్లు చెప్పారు. 

అందుకు సంబంధించి ఒక వీడియో రూపొందించి విడుదల చేశారు. వెనిజులా మ్యాప్‌లో అమెరికా జెండాను సూచించే రంగులు నింపారు. అలాగే ఇకపై గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోను గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా వ్యవహరించాలంటూ ఉత్తర్వులు జారీచేశారు. అట్లాంటిక్‌ మహాసముద్రంలోని ఈ ప్రాంతం మెక్సికోకు పశ్చిమ, దక్షిణ దిశల్లో, అమెరికాకు ఉత్తరంవైపు, క్యూబాకు ఆగ్నేయంవైపు ఉంది. పేరు మార్చినా ప్రాదేశిక జల పరిధులేమీ మారడంలేదు గనుక మెక్సికో, క్యూబాలు ఈ విషయంలో మౌనంగా ఉండిపోయాయి. ఇక పర్షియన్‌ గల్ఫ్‌ పేరును గల్ఫ్‌ ఆఫ్‌ అరేబియాగా మారుస్తామని తొలి ఏలుబడిలో 2017లో ప్రకటించారు. దాంతో అప్పటి ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ జాగ్రఫీ చదువుకోమని ట్రంప్‌కు సలహా ఇచ్చారు. నిరుడు మే నెలలో సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ పర్యటనకెళ్లే ముందు పేరు మార్పు ఉంటుందని ప్రకటించారు. అటు తర్వాత ఎందుకో దాని జోలికి పోలేదు. 

ఈ ‘భౌగోళిక చిత్రపట దురాక్రమణల్ని’ చూసి జనం కాలక్షేపానికి నవ్వుకోవచ్చు. ట్రంప్‌ ప్రదర్శిస్తున్న అమాయకత్వమో, అజ్ఞానమో చూసి జాలిపడే వారూ ఉండొచ్చు. కానీ అగ్ర రాజ్యాల చరిత్ర తెలిసినవారు దాన్నంత తేలిగ్గా వదిలేయరు. ఒక విశాల పాలస్తీనా భూభాగంలోకి కొన్ని దశాబ్దాల్లో భారీయెత్తున యూదుల్ని తరలించి, అక్కడ నరమేధాలకు పాల్పడి ఇజ్రాయెల్‌ను సృష్టించి, అందుకు ఐక్యరాజ్యసమితి ఆమోదాన్ని ‘రాబట్టిన’ చరిత్ర ఆ దేశాలది. కనుక ఇప్పుడు ఉబుసుపోక మాట్లాడే మాటల్లో వేరే అర్థాలు ఉండొచ్చన్న అనుమానాలు రావటం సహజం. రాజకీయావతారం ఎత్తి దాదాపు పదిహేనేళ్లవుతున్నా పూర్వాశ్రమంలో నిర్వహించిన రియలెస్టేట్‌ వ్యాపార ప్రభావంనుంచి ట్రంప్‌ బయటపడలేకపోతున్నారన్నది వాస్తవం. రియలెస్టేట్‌ యజమాని మాదిరే ఆయన భూదాహంతో అల్లాడిపోతున్నారు. ‘మళ్లీ అమెరికాను ఉన్నతంగా చేద్దాం’ అనే నినాదం సారాంశం ఖనిజ సంపద పుష్కలంగా ఉండే ప్రాంతాలను అమెరికాలో విలీనం చేసుకోవటమేనన్న సందేశాన్ని ట్రంప్‌ పంపుతున్నారు. అందుకే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ భార్య ఉషా వాన్స్‌ గ్రీన్‌లాండ్‌ సందర్శనకెళ్లినప్పుడు డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌ల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. దాంతో చేసేదిలేక ఆమె మధ్యలోనే ఆ పర్యటనను విరమించుకుని వెనక్కిపోవాల్సి వచ్చింది. 

జనం భావోద్వేగాలు రెచ్చగొట్టి అధికారంలోకొచ్చినవారు వాటిపైనే మనుగడ సాగించాలనుకోవటం సహజం. అలాగైతేనే వారి వైఫల్యాలు మరుగునపడతాయి మరి. ఈ బాపతు నేతలు అందరి దృష్టి తమపైనే ఉండాలన్న తపనతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ట్రంప్‌ దీనికి భూదాహాన్ని కూడా చేర్చారు. ఈ భౌగోళిక చిత్రపటాల్ని చూసిన ‘మాగా’ జనం నిజంగానే ట్రంప్‌ వాటిని జయించుకొస్తారన్న భ్రమల్లో ఉంటారు. ఒకపక్క అరేబియా సముద్రంలో లంగరేసిన విమానవాహక నౌక యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌లో దుర్భర పరిస్థితులున్నాయనీ, కొందరు ఆత్మహత్యా యత్నం కూడా చేశారనీ వార్తలొస్తున్నాయి. అందులో పనిచేసే రక్షణ సిబ్బందిని వెనక్కు పిలిపించాలని వారి కుటుంబాలనుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. అందుకే చవకబారు చిత్రపట వివాదాలు కట్టిపెట్టి ఇరాన్‌తో సంధికి ప్రయత్నించడం అమెరికా శ్రేయస్సుకు, రాజకీయంగా ట్రంప్‌కు మంచిది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement