ఫ్లై‌దుబాయ్‌ ఘటన.. ఇజ్రాయెల్‌ మంత్రికి బిగ్‌ షాక్‌! | Israel Opposition Demand Miri Regev resignation Over flydubai Incident | Sakshi
Sakshi News home page

ఫ్లై‌దుబాయ్‌ ఘటన.. ఇజ్రాయెల్‌ మంత్రికి బిగ్‌ షాక్‌!

Oct 5 2026 11:21 AM | Updated on Oct 5 2026 11:21 AM

Israel Opposition Demand Miri Regev resignation Over flydubai Incident

ఫ్లై‌దుబాయ్‌ విమానం కూల్చే కుట్ర.. ఇజ్రాయెల్‌లో రాజకీయ దుమారం రేపింది. దుబాయ్‌ నుంచి టెల్‌అవీవ్‌ వెళ్తున్న ఫ్లై‌దుబాయ్‌ విమానాన్ని కూల్చేందుకు ఒమన్‌కు చెందిన కో-పైలట్‌ ప్రయత్నించిన ఘటన ఇప్పుడు ఇజ్రాయెల్‌ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. విమాన భద్రతా తనిఖీల్లో లోపాలు బయటపడటంతో.. రవాణా మంత్రి మిరి రెగెవ్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ ఘటనపై ఇజ్రాయెల్‌లోని భద్రతా సంస్థలు, ప్రభుత్వ విభాగాల మధ్య బాధ్యతలపై కూడా తీవ్ర చర్చ మొదలైంది. విదేశీ విమానాలు, వాటి సిబ్బందికి సంబంధించిన భద్రతా తనిఖీల్లో రవాణా మంత్రిత్వ శాఖ తగిన చర్యలు తీసుకోవడం లేదని కొన్నేళ్లుగా హెచ్చరికలు వచ్చినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 2024లో వచ్చిన స్టేట్‌ కంట్రోలర్‌ నివేదికలోనూ మంత్రిత్వ శాఖ తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించడం లేదని పేర్కొన్నట్లు సమాచారం.

బాధ్యత ఎవరిది? 
2021లో ఇజ్రాయెల్‌ భద్రతా కేబినెట్‌ విదేశీ విమానాల భద్రతకు సంబంధించిన కొన్ని బాధ్యతలను షిన్‌ బెట్‌ నుంచి పౌర విమానయాన అథారిటీకి బదిలీ చేసింది. అనంతరం 2024లో విదేశీ వాణిజ్య విమానాల భద్రతా వ్యవస్థపై సమీక్షకు నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియ ఏడాది పాటు కొనసాగినప్పటికీ.. విదేశీ విమానాల భద్రతా బాధ్యతను రవాణా మంత్రిత్వ శాఖే చేపట్టాలని నిర్ణయించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

మరోవైపు.. తమ శాఖపై వచ్చిన ఆరోపణలను మిరి రెగెవ్‌ ఖండించారు. విదేశీ పైలట్ల నేపథ్యాన్ని తన మంత్రిత్వ శాఖ తనిఖీ చేసే సామర్థ్యం లేదని ఆమె స్పష్టం చేశారు. పైలట్లను గుర్తించడం, ముప్పు స్థాయిని అంచనా వేయడం భద్రతా సంస్థల బాధ్యత అని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్ష నేతలు మాత్రం సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ తన మంత్రిత్వ శాఖ ఆధీనంలోనే ఉందని, అందువల్ల భద్రతా వైఫల్యానికి ఆమె బాధ్యత వహించాలని అంటున్నారు.

ఎన్నికల వేళ షాక్‌.. 
ఎన్నికల ముందు రాజకీయ వేడి.. అక్టోబర్‌ 27న ఇజ్రాయెల్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న గాది ఐసెన్‌కోట్‌.. ఇలాంటి ఘటన జరిగితే రవాణా మంత్రి రాజీనామా చేయాల్సిందని, ప్రధాని ఆమెను తొలగించి స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాల్సిందని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా.. ఒమన్‌కు చెందిన పైలట్లు గతంలోనూ ఫ్లై‌దుబాయ్‌ విమానాల్లో టెల్‌అవీవ్‌కు వచ్చినట్లు ఇజ్రాయెల్‌ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్‌తో ఒమన్‌కు అధికారిక దౌత్య సంబంధాలు లేవు. అయినప్పటికీ ఆ దేశానికి చెందిన పైలట్‌ ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానంలో కో-పైలట్‌గా ఎలా పనిచేశారన్న ప్రశ్నలు ఇప్పుడు భద్రతా వ్యవస్థపై తలెత్తుతున్నాయి.

అసలేం జరిగింది?
గత బుధవారం దుబాయ్‌ నుంచి టెల్‌అవీవ్‌ వెళ్తున్న ఫ్లై‌దుబాయ్‌ బోయింగ్‌ 737 విమానంలో 29 ఏళ్ల ఒమన్‌ పౌరుడు, కో-పైలట్‌ హమామ్‌.. పైలట్‌ స్మిట్‌ మచ్చార్‌పై దాడి చేశాడు. అనంతరం విమానం దాదాపు 30 సెకన్లలో 14 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. పైలట్‌ ఎలాగోలా కాక్‌పిట్‌ తలుపు తెరవడంతో ప్రయాణికులు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఉన్న మరో జంట పైలట్లు విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. ఈ ఘటనను యూఏఈ అధికారులు ఉగ్రవాద దాడిగా పరిగణిస్తున్నారు. ఈ ఘటనతో విదేశీ విమానాల భద్రతా తనిఖీల్లో ఎవరి బాధ్యత ఎంత? అన్న ప్రశ్న ఇజ్రాయెల్‌లో రాజకీయ, భద్రతా చర్చకు కేంద్రంగా మారింది. ఎన్నికలకు కొద్ది వారాల ముందు ఈ వ్యవహారం నెతన్యాహు ప్రభుత్వానికి మరో సవాల్‌గా మారింది.

ఇదీ చదవండి: అమెరికాకు చైనా, రష్యా సవాల్‌.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement