జనతంత్రం
‘‘ఇది భస్మ సింహాసనంబు, ఇది పిశాచులతో నిటలేక్షణుండు గజ్జె కదిలించియాడు రంగస్థలంబు’’. నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా శ్మశానం మీద రాసిన పద్యం తెలియని తెలుగువారు ఉండకపోవచ్చు. విగతజీవుల అంత్యక్రియలు శ్మశాన ధర్మం. కానీ రక్షణ కల్పించవలసిన పోలీస్ వ్యవస్థే భస్మ సింహాసనంగా మారి బతికున్నవారి ప్రాణాలు బలిగొంటే? శవాలను కాల్చి బుగ్గిచేస్తే..? శవదహనాల తర్వాత కుటుంబ సభ్యులకు చితాభస్మం దొరుకుతుంది. కానీ పోలీసులు చేసే దహనాల్లో సాక్ష్యం ఉండకూడదు కనుక, అది కూడా దొరకదని తేలిపోయింది. ‘‘బతికుంటే నా కొడుకు జాడ చెప్పండి, చంపేసి ఉంటే కనీసం అతడి బూడిదైనా ఇవ్వండ’’ని ఆ తల్లి ఎంత ప్రాధేయపడిందో! బూడిద కూడా లేదని తెలిసిన తర్వాత ఆ కన్నపేగు ఎంత అల్లాడిందో!
గద్దెమీదనున్న పెద్దలు పోలీసు బలగాన్ని ప్రైవేట్ సైన్యంగా వాడుకోవడం మొదలుపెడితే రక్షకభట నిలయాలు భక్షకభట ఠాణాలకు మారుతాయనడానికి తాజా ఉదాహరణ విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్. గాదె సాయికృష్ణ అనే యువకుడి లాకప్ డెత్ విషయంలో పోలీస్ యంత్రాంగం పై నుంచి కింది దాకా పీకల్లోతున దిగబడి వున్నదనే సందేహాలు బలపడుతున్నాయి. వాటికి రుజువులూ బయటపడుతున్నాయి. సాయికృష్ణ మీద ఉన్న పాతకేసుల్లో భాగంగా ఆయనపై కోర్టు వారెంట్ మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి కృష్ణలంక పోలీసు లకు అప్పగించారని ఇప్పటి వరకు నిర్ధారణైంది. వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల పాత్ర కూడా ఉన్నది కనుక, వారు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పని చేస్తారు కనుక... కృష్ణలంక పోలీసులు నెరవేర్చింది స్వామికార్యమా, స్వకార్యమా? అన్నది తేలవలసి ఉన్నది.
నేరారోపణున్న వ్యక్తి లాకప్‌లో చనిపోతే అంత తీవ్ర విషయంగా పరిగణించవలసిన అవసరం లేదనే వైఖరిని ఏపీ లోని కొన్ని రాజకీయ శక్తులూ, మీడియా సంస్థలూ తీసుకోవడం ఆశ్చర్యకరంగా ఉన్నది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ (ఏడీఆర్) అనే సంస్థ రిపోర్టు ప్రకారం ఏపీ పాలక కూటమి ఎమ్మెల్యేల్లో 79 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 56 శాతం మంది మీద హత్య, కిడ్నాప్, మహిళల్ని అవమానించడం వంటి తీవ్రమైన కేసులున్నాయి. సాయికృష్ణ స్థానంలో వీరిలో ఎవరైనా ఉంటే ఈ శక్తులు ఎట్లా స్పందిస్తాయి? లాకప్ డెత్‌లను నాగరిక సమాజం తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తుంది. కంచే చేనును మేయడాన్ని హేయమైన విషయంగా భావిస్తుంది. భారత సర్వోన్నత న్యాయస్థానం కూడా లాకప్ హింసాకాండపై పలుమార్లు తీవ్రంగా స్పందించింది. న్యాయస్థానాలు, చట్టాలు మాత్రమే కాదు, సమాజం కూడా లాకప్ హింసను బలంగా వ్యతిరేకించిన చరిత్ర ఉన్నది. ప్రజాందోళనల ధాటికి ముఖ్య మంత్రి స్థాయి వ్యక్తులు కూడా రాజీనామా చేసిన అనుభవాలున్నాయి.
ఒకనాడు గొప్ప చైతన్య స్రవంతిగా పేరున్న ఆంధ్ర పౌరసమాజంలో ఇప్పుడెందుకో ఒక స్తబ్ధత కనిపిస్తున్నదనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణ ఘాతుకం మాత్రమే కాదు; పోలీసుల పిలుపు రాగానే గతంలో అనుభవించిన చిత్రహింసలు గుర్తు చేసుకొని క్రాంతికుమార్ అనే దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా ఈ మధ్యనే జరిగింది. అయినా అలనాటి అభ్యుదయవాడలైన బెజవాడ వీధుల స్పందన మంద్రస్థాయిలోనే కనిపించింది. ఇతరత్రా సామాజిక, రాజ కీయ కారణాలతోపాటు మీడియా దిగజారుడుతనం కూడా ప్రజల చైతన్యస్థాయిపై ప్రభావం చూపిస్తుండవచ్చు. అప్పు డెప్పుడో జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన ‘‘చెక్కు చెదరని ఏనాడు మొక్కవోని ఆంధ్ర పౌరుషమిప్పుడు అధ్వానమాయె, మరల ఒకమారు వెనుకకు తిరిగి చూసి దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి’’ అనే పద్యపాదానికి ఇప్పుడు మరింత ఔచిత్యం ఏర్పడిందేమో!
సాయికృష్ణ ఘటనకు సంబంధించి న్యాయస్థానం ముందు సిట్ పొందుపరిచిన సమాచారాన్ని బట్టి మే 6వ తేదీన టాస్క్‌ఫోర్స్–కృష్ణలంక పోలీసుల ఉమ్మడి బృందం సాయి కృష్ణను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకొచ్చింది. నాన్–బెయిలబుల్ వారెంట్ అమలులో భాగంగా ఆయన్ను కోర్టు ఎదుట హాజరుపరచాల్సి ఉండగా, ఆ పని పోలీసులు చేయలేదు. కృష్ణలంక స్టేషన్‌లో పనిచేసే ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ మాత్రం తాను సాయి కృష్ణను స్టేషన్‌లో మే 8వ తేదీన చూసినట్టు తెలియజేశాడు. సాయికృష్ణ తల్లి కూడా స్టేషన్‌లో తన కుమారుడి అరుపులు వినిపించాయనీ, లాకప్ గదిలో అతడిని తాను చూశాననీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆమె హైకోర్టులో జూన్ 4న హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన హైకోర్టు సాయి కృష్ణను కోర్టు ఎదుట హాజరు పరచాలని సిటీ పోలీస్ కమీష నర్‌ను ఆదేశించింది. పది రోజుల తర్వాత (జూన్ 15న) సాయికృష్ణ ఆచూకి తెలియలేదని పోలీసు యంత్రాంగం కోర్టుకు విన్నవించింది.
ఈలోగా సాయికృష్ణను లాకప్‌లో చంపి ఉంటారనే వార్తలు సంచలనం కావడం, ప్రతిపక్ష నేత సాయికృష్ణ ఇంటికి వెళ్లి తల్లిని పరామర్శించడంతో అదే రోజు (జూన్ 19) పోలీసులు సాయికృష్ణ లాకప్ హత్య అభియోగంపై కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. రెండు రోజుల తర్వాత, ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేశారు. విజయవాడ ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీ టీవీ ఫుటేజీ మొత్తం మాయమైందని సిట్ తెలియజెప్పింది. ఈ విషయం తెలిసిన తర్వాత కేసు సక్రమ దర్యాప్తుపై అన్ని వర్గాల్లోనూ తీవ్రమైన సందేహాలు తలెత్తాయి. నాన్‌బెయిలబుల్ వారెంట్‌లో భాగంగా తీసుకొచ్చిన నిందితుడిని కోర్టులో హాజరు పరచకపోవడం, అతడు అదృశ్యం కావడం అనే విషయాలు ఉన్నతాధికారులకు తెలియకుండా ఉండే అవకాశమే లేదని తెలుస్తున్నది. పైగా సాయికృష్ణ అరెస్టులో టాస్క్‌ఫోర్స్ పోలీసుల పాత్ర ఉండటం వల్ల ఈ వ్యవహారం కమిషనర్‌కు తెలియక పోవడమనే ప్రసక్తే ఉండదని చెబుతున్నారు.
ఏ4 నిందితుడైన సురేశ్ రిమాండ్ రిపోర్టులో మే 12వ తేదీనే సాయికృష్ణను చంపేసి శ్మశాన వాటికలో దహనం చేసినట్టు ‘సిట్’ పేర్కొన్నది. కానీ జూన్ 15వ తేదీన కూడా సాయికృష్ణ ఆచూకీ తెలియలేదని న్యాయస్థానానికి పోలీసుల తరపున చెప్పడం ఇక్కడ గమనార్హం. ఈ నేపథ్యంలోనే మొత్తం ఘటనపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని సాయికృష్ణ తల్లి హైకోర్టులో పిటీషన్ వేశారు. తన అనుమతి లేకుండానే పిటీషన్‌ను ఉపసంహరించుకున్నారంటూ మరోమారు సీబీఐ దర్యాప్తు కోరుతూ ఆమె అనుబంధ పిటీషన్ వేశారు. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులైన డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, విజయ వాడ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు, విజయవాడ సౌత్‌జోన్ ఏసీపీ ఎం.మానసలను నిందితులుగా చేర్చాలని పార్లమెంట్ సభ్యుడు మద్దెల గురుమూర్తి విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుపై వాంఙ్మూలాలను నమోదు చేసేందుకు కోర్టు నిర్ణయించింది. దీంతో ఉన్నతాధికారులు హైకోర్టుకు వెళ్లి, విజయవాడ కోర్టు నిర్ణయాలపై స్టే తెచ్చుకున్నారు. ఈ కేసులో నిజంగా వీరి పాత్ర లేనట్టయితే స్టే తెచ్చుకోవలసిన అవసరమేమిటన్నది ఇప్పుడు కీలకమైన ప్రశ్నగా మారింది.
హైకోర్టు స్టేపై గురుమూర్తి సుప్రీంకోర్టుకు వెళ్లడం, సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించడం తెలిసిందే. డీజీపీ, విజయవాడ సీపీ, సౌత్‌జోన్ ఏసీపీల పాత్రపై దర్యాప్తు జరగాల్సిందేనని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఉన్నతస్థాయి అధికారులకు తెలియకుండా జరిగే అవకాశం లేదని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. నెల రోజులపాటు సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోతే పర్యవేక్షణాధికారులు నిద్రపోతున్నారా అని కూడా ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. విజయవాడ కోర్టు ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై బెంచ్ స్టే విధించింది. హైకోర్టులో సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన పిటీషన్, సీబీఐ దర్యాప్తు కోరుతూ వేసిన అనుబంధ పిటీషన్ల స్థితిగతులను తమకు తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది.
లాకప్ హత్యల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తున్న తీరు, తీసుకుంటున్న నిర్ణయాలు బాధితుల పక్షానే ఉంటున్నాయి. ఈమధ్యకాలంలోనే జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బాధితుల అప్పీళ్లపై స్పందించి సీబీఐ దర్యాప్తులకు ఆదేశించడం గమనార్హమని న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. మధ్యప్రదేశ్‌లో దేవ్ పార్థీ అనే యువకుడు పోలీస్ లాకప్‌లో చనిపోయాడు. దర్యాప్తులో స్థానిక పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఎనిమిది నెలల కాలంలో ఒక్క అరెస్ట్‌ను కూడా స్థానిక పోలీసులు చేయలేదు. పైగా ప్రత్యక్ష సాక్షిగా ఉన్న దేవ్ పార్థీ బంధువుపై బెదిరింపులకు దిగారు. దాంతో దేవ్ పార్థీ తల్లి సుప్రీంకోర్టు తలుపు తట్టింది. కేసు వివరాలు ఆసాంతం పరిశీలించిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ‘తన సొంత కేసులో ఏ వ్యక్తీ జడ్జీగా ఉండరాదన్న’ న్యాయ సూత్రాన్ని ఉటంకిస్తూ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. తమ సహచర సిబ్బందిపై వచ్చిన ఆరోపణల విషయంలో స్థానిక పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించగలరని భావించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది.
అతని వద్ద ఆరు లీటర్ల కాపుసారా ఉందన్న ఆరోపణతో ఛత్తీస్‌గఢ్ పోలీసులు శ్రావణ్ సూర్యవంశీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, లాకప్ నుంచి బిలాస్‌పూర్ జైలుకు తరలించారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయనక్కడ చనిపోయాడు. గాయాల తీవ్రత వల్లనే శ్రావణ్ చనిపోయాడని పోస్ట్‌మార్టం రిపోర్టు, జ్యుడీషి యల్ విచారణ నివేదికలు స్పష్టం చేశాయి. దీనిపై శ్రావణ్ కుటుంబానికి లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మాత్రమే హైకోర్టు తీర్పునిచ్చింది. పోలీసులపై విచారణకు ఆదేశించలేదు. దీనిపై సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం పోలీసుల పాత్రపైనే కాక, జ్యుడీషియల్ రిపోర్టుపై చర్యలు తీసుకోని అధికార యంత్రాంగంపై కూడా విచారణకు ఈ ఆగస్టు నెలలోనే ఆదేశాలు జారీ చేసింది. ఈ మధ్యకాలంలోనే ఇటువంటి మరికొన్ని ఉదాహరణలను ఉటంకించవచ్చు.
మూడు దశాబ్దాల క్రితం ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించి 10 మంది ‘పంజాబ్ మిలిటెంట్ల’ ఎన్‌కౌంటర్ విషయంలోనూ సుప్రీంకోర్టు ఇదే తరహాలో స్పందించింది. దీనిపై స్థానిక పోలీసులు చిత్తశుద్ధితోనే విచారణ చేస్తారని భావించినా కూడా, వారి సహచరుల మీద విచారణను వారికి అప్పగించడం సమ్మతం కాదని న్యాయస్థానం అభిప్రాయపడి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. సహచర సిబ్బందిపై విచారణ బాధ్యత స్థానిక పోలీసులే చేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించడం లేదన్నది ఈ కేసుల ద్వారా తేటతెల్లమవుతున్నది. ఈ కోణంలో చూసినప్పుడు సాయికృష్ణ లాకప్ మృతిపై సీబీఐ దర్యాప్తు తప్పక పోవచ్చనీ, ఈ విచారణ నుంచి ఉన్నతాధికారులు తప్పించుకోవడం కూడా సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాలు న్యాయవాద వర్గాల్లో వినిపిస్తున్నాయి.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com


