ఎన్విడియాకు ‘చైనా’ గండం | Nvidia chief executive Jensen Huang has resigned | Sakshi
Sakshi News home page

ఎన్విడియాకు ‘చైనా’ గండం

Nov 13 2026 4:00 AM | Updated on Nov 13 2026 4:00 AM

Nvidia chief executive Jensen Huang has resigned

ఆమె అలిస్‌ కావొచ్చుగానీ, అది వండర్‌ల్యాండ్‌ కాదు... లక్షల కోట్ల విలువచేసే ప్రపంచ దిగ్గజ కంపెనీల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఎన్విడియా. ఆ సంస్థ సహ వ్యవస్థా పకుడూ, సీఈఓ అయిన జెన్సన్‌ హువాంగ్‌కు అలిస్‌ హువాంగ్‌  అనే చైనా మహిళతోగల వ్యక్తిగత సాన్నిహిత్యం ఆయన పదవికి ఎసరుపెట్టింది. సీఈఓగా, బోర్డు సభ్యుడిగా ఆయన రాజీనామా చేశారని గురువారం ఎన్విడియా ప్రకటించింది. ఇలాంటి వ్యవహారంలో ఉద్యోగం ఊడటం వింతేమీ కాదు. కానీ ఇది అమెరికా, చైనాల మధ్య ‘గూఢచార’ యుద్ధానికి సైతం దారితీసింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వచ్చే వారం అమెరికాలో జరపబోతున్న పర్యటనపై సహజంగానే దీని ప్రభావం ఉంటుంది.

అంతేకాదు... ఏడాది క్రితమే ఈ సంగతి తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీరుతెన్నులపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలిస్‌ వ్యవహారంలో భార్యకూ, పిల్లలకూ క్షమాపణ చెబుతున్నానని జెన్సన్‌ ప్రకటించి నాలుగు రోజులైందో లేదో– ఇప్పుడు సంస్థలో పనిచేసే మరో ఉద్యోగినితో సైతం ఆయనకు సాన్నిహిత్యంఉందన్న సమాచారం గుప్పుమంది. ప్రపంచంలో అత్యాధునిక ఏఐ చిప్‌లను ఉత్పత్తిచేసే దిగ్గజ సంస్థ ఎన్విడియా షేర్‌ విలువ ఇప్పటికే 9.5 శాతం మేర క్షీణించింది. మదుపుదార్ల సొమ్ము 60,000–లక్ష కోట్ల డాలర్ల మధ్య ఆవిరైందని ఒక అంచనా. 

అలిస్‌తో తన సాన్నిహిత్యం గురించి జెన్సనే ఒప్పుకున్నారు. కానీ ఆమె గూఢచారో కాదో నిర్ధారణేమీ కాలేదు. అన్ని రంగాల్లో పోటీపడుతూ, రేపో మాపో తనను అధిగ మిస్తుందనుకుంటున్న చైనాను చూస్తే అమెరికాకు భయాందోళనలుండటం రహస్యమేమీ కాదు. ఆ దేశానికి సెమీ కండక్టర్‌ చిప్‌లు ఎట్టిపరిస్థితుల్లోనూ విక్రయించరాదని అమెరికా ఆంక్షలు విధించి ఏణ్ణర్థం అవుతోంది. వివాదం ఇంతగా ముదిరిన తరుణంలో జెన్సన్‌ చైనా మహిళతో సాన్నిహిత్యం నెరపడం, ఆమెకు ప్రయోజనం కలిగే నిర్ణయాలు తీసు కోవటం దుస్సాహసమనే చెప్పాలి. 

చైనాలోని సంపన్న టెక్‌ మదుపుదార్లు నెలకొల్పిన ఒక గేమింగ్‌ సంస్థను షెల్‌ కంపెనీలద్వారా కొనుగోలు చేయించి, మరో సింగపూర్‌ షెల్‌ కంపెనీకి దాన్ని బదిలీచేసి, ఆ సంస్థకు మెగాస్పీడ్‌గా నామకరణం చేసినట్టు చెబు తున్నారు. అది పూర్తిగా సింగపూర్‌ కంపెనీ కావటంతో ఎన్విడియానుంచి వందలకోట్ల డాలర్ల విలువైన చిప్‌ల కొనుగోలు సులభమైంది. అవి అక్కడినుంచి చైనాకు చేరాయని అమెరికా నిఘా సంస్థల ఆరోపణ. అందువల్ల సాంకేతికంగా చైనా సైన్యం పైచేయిసాధించే ఉంటుందని అవి అనుమానిస్తున్నాయి. మెగాస్పీడ్‌ వ్యవహారంలో నిరుడేసింగపూర్‌ ప్రభుత్వం దర్యాప్తు మొదలెట్టింది.

గూఢచర్యం ఆరోపణల నిజానిజాల సంగతలావుంచి, ఈ విషయంలో ట్రంప్‌ నిర్లిప్త ధోరణి సందేహాలకు తావిస్తోంది. మొన్న మే నెలలో ఆయనతోపాటు చైనా వెళ్లిన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ల బృందంలో జెన్సన్‌ ఉన్నారు. అంతకుముందే నాటి భద్రతా సలహాదారు, ప్రస్తుత విదేశాంగ మంత్రి మార్కో రూబియో ట్రంప్‌కు జెన్సన్‌–అలిస్‌ల వ్యవహారాన్ని చెప్పారు. నిజానికి అలా చెప్పడం రెండోసారి. వెనిజులా నుంచి చిన్న చిన్న పడవల్లో సముద్రంలో చేపలు పట్టే జాలర్లను ‘నార్కో ఉగ్రవాదులు’గా చిత్రించి దాదాపు 500మంది వరకూ కాల్చిచంపి, దేశాన్ని పెను విపత్తునుంచి కాపాడానని పదే పదే చెప్పుకున్న ట్రంప్‌... జెన్సన్‌–అలిస్‌ ఉదంతం పెద్ద విషయమేంకానట్టు మాట్లాడారు. జెన్సన్‌ గౌరవ నీయుడని, ఆ కంపెనీవల్లే దేశం సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్నదని వివరించారు. 

దేశాల మధ్య స్నేహ సంబంధాలు ఎంత బాగున్నా, ఒకరిపై ఒకరు గూఢచర్యం జరుపుకోవటం కొత్తేంకాదు. ఇక పరస్పరం కత్తులు నూరుకునే దేశాలమధ్య ఇది మరింత ఎక్కువ. భారత్‌తోపాటు తన మిత్రదేశాలైన బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియాలనుసైతం వదలకుండా అమెరికా గూఢచర్యం సాగించిందని సీఐఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ చాన్నాళ్ల క్రితమే సాక్ష్యాధారాలతో సహా ప్రపంచానికి వెల్లడించాడు. షీ జిన్‌పింగ్‌ పర్యటనకొచ్చేముందు కావాలని తమపై ఆ దేశంలో వ్యతిరేకతను పెంచేందుకే అలిస్‌ వ్యవహారాన్ని అతిగా చిత్రిస్తున్నారని చైనా అంటున్నది. ఏదేమైనా అమెరికా–చైనాసంబంధాలనూ, ఇప్పటికే అప్రదిష్ట మూటకట్టుకున్న ట్రంప్‌నూ ఈ ఉదంతం దెబ్బ తీయడమైతే ఖాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement