ఇల్లు కొనాలంటే ఎక్కడలైనా రూ.లక్షల్లో కావాలి. అదే రూ .155కే దొరికితే.. దాన్నే ‘రియల్’ జాక్‌పాట్ అంటారు! చైనా ఆన్‌లైన్ షాపింగ్ పండుగ డబుల్ 11 సందర్భంగా ఓ వ్యక్తి కేవలం 11 యువాన్లకు (సుమారు రూ.155) రెండు పడకగదుల అపార్ట్‌మెంట్‌ను దక్కించుకున్నట్లు వచ్చిన వార్త ఆసక్తికరంగా మారింది. పూర్తిగా ఫర్నిచర్, గృహోపకరణాలతో సిద్ధంగా ఉన్న ఈ ఫ్లాట్ కొనుగోలుకు ఏకంగా 1,677 మంది పోటీ పడినట్లు చైనా మీడియా కథనాలు వెల్లడించాయి.
రూ.155కే ఫ్లాట్.. అసలు కథ ఇదీ..
నవంబర్ 5న ముగిసిన ఈ వేలం అలీబాబాకు చెందిన అలీబాబా ఆక్షన్ వేదికపై జరిగింది. ఈశాన్య చైనాలోని హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని హెగాంగ్ నగరంలో ఉన్న 68 చదరపు మీటర్ల (సుమారు 732 చదరపు అడుగులు) రెండు పడకగదుల అపార్ట్‌మెంట్‌ను విక్రయానికి ఉంచారు. ఏడో అంతస్తులో ఉన్న ఈ ఫ్లాట్ వేలం ప్రారంభ ధర ఒక యువాన్. బిడ్డింగ్‌లో గరిష్ఠ ధరను 11 యువాన్లుగా నిర్ణయించారు. ఆ ధరకు ముందుగా బిడ్ వేసిన వ్యక్తికే ఫ్లాట్ దక్కేలా నిబంధన పెట్టారు.
ఈ వేలంలో 1,677 మంది పాల్గొనగా, మొత్తం 1,001 బిడ్లు నమోదయ్యాయి. తూర్పు చైనాలోని జియాంగ్సు-జెజియాంగ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి 11 యువాన్లకు ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే రూ.155 చెల్లిస్తే సరిపోదు. యాజమాన్య హక్కుల బదిలీ కోసం మరో 2,000 యువాన్లు (సుమారు రూ.28,000) డీడ్ పన్నుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
మార్కెటింగ్ వ్యూహంలో భాగంగానే..
స్థానిక ప్రాపర్టీ వెబ్‌సైట్ల అంచనాల ప్రకారం ఈ అపార్ట్‌మెంట్ మార్కెట్ విలువ సుమారు 40,000 యువాన్లు (రూ.5.6 లక్షలు). సాధారణ మార్కెట్ ధరతో పోలిస్తే ఇది భారీ తగ్గింపు. ఈ ఆఫర్ వెనుక ప్రచార వ్యూహం కూడా ఉంది. డబుల్ 11 సందర్భంగా వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు ఇటువంటి ప్రత్యేక వేలం నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వేలంలో గెలిచిన వ్యక్తి ఈ అపార్ట్‌మెంట్‌లో శాశ్వతంగా నివసించే ఆలోచన లేదని, శీతాకాలంలో పర్యటనలకు వెళ్లినప్పుడు ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు లైవ్‌స్ట్రీమ్‌లో తెలిపాడు.
ఇదీ చదవండి: బెంగళూరులో అద్దె ఇల్లు.. వింత షరతులు!


