విమానాశ్రయాలు, లాంజ్‌లు, హోటళ్లు, ఆతిథ్య (హాస్పిటాలిటీ) రంగంలో పనిచేసే ఫ్రంట్‌లైన్ సిబ్బంది పడుతున్న శ్రమపై ప్రముఖ నటుడు సోనూ సూద్ కీలక విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌పోర్టు కౌంటర్లు, హోటల్ రిసెప్షన్లు, సర్వీస్ డెస్క్‌ల వద్ద ఉద్యోగులు దాదాపు 10 నుంచి 12 గంటల పాటు నిరంతరం నిలబడి విధులు నిర్వర్తించాల్సి వస్తోందని, వారి కఠినమైన పనివేళల పట్ల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు.
కొద్దిపాటి విశ్రాంతి
విమానాశ్రయాలకు వెళ్లినప్పుడు లేదా హోటళ్లకు చేరుకున్నప్పుడు మనకు చిరునవ్వుతో స్వాగతం పలికే సిబ్బందిని గమనిస్తుంటాం. కానీ అదే సిబ్బంది రోజంతా నిలబడి పనిచేయడం వల్ల ఎంతటి శారీరక ఇబ్బందులు, అలసటను ఎదుర్కొంటారనే కోణంలో ఎప్పుడైనా ఆలోచించామా? అని సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. పని ఒత్తిడి మధ్య వీలు కుదిరిన సమయంలో సిబ్బంది కూర్చునేందుకు వీలుగా ప్రతి వర్క్‌ప్లేస్‌లోనూ తగిన హై స్టూల్స్ లేదా సరైన సీటింగ్ ఏర్పాట్లు కల్పించాలని ఆయన సూచించారు. కొద్దిపాటి విశ్రాంతి అనేది ఏదో ప్రత్యేకమైన ప్రివిలేజ్ (అరుదైన అవకాశం) కాదని, అది ప్రతి ఉద్యోగికి దక్కాల్సిన కనీస గౌరవం అని స్పష్టం చేశారు.
ఆతిథ్య రంగంలో నైతిక బాధ్యత
హాస్పిటాలిటీ రంగం పూర్తిగా కస్టమర్ల సౌకర్యాలు, సంతృప్తి చుట్టూ తిరుగుతుంది. హోటళ్లలో అతిథుల కోసం సౌకర్యవంతమైన గదులు, ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లలో ప్రీమియం సీటింగ్ సదుపాయాలు కల్పించే యాజమాన్యాలు.. అదే సేవలను అందించే సిబ్బంది ఆరోగ్యం, శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగులకు తగిన సీటింగ్ సదుపాయాలు కల్పించడం వల్ల సేవా నాణ్యత ఏమాత్రం తగ్గదని, పైగా ఇది ఉద్యోగుల పనితీరును మరింత మెరుగుపరుస్తుందని సోనూ సూద్ వాదిస్తున్నారు. కస్టమర్ల అనుభవం, ఉద్యోగుల సంక్షేమం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని వ్యాపార సంస్థలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.
ఇదీ చదవండి: ఎన్విడియా సీఈఓ వారసుల జీతం ఎంతంటే..


