సినిమా థియేటర్‌లో చూసే అనుభూతిని అవుట్‌డోర్‌లోనూ ప్రేక్షకులకు అందించాలనే వినూత్న ఆలోచనతో ‘ఓ నా సిద్ధయ్య’ టీమ్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. భారతదేశంలోనే తొలిసారిగా అవుట్‌డోర్ వేదికపై 70ఎంఎం భారీ స్క్రీన్‌తో పాటు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌ను అత్యంత వైభవంగా విడుదల చేసింది. అక్టోబర్ 30న శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రభుత్వ కళాశాల, పాఠశాల మైదానంలో జరిగిన ఈ వేడుకకు 5 వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ప్రేక్షకుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అభిమానులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ప్రముఖ నటుడు సోనూసూద్ ముఖ్య అతిథిగా హాజరై ‘ఓ నా సిద్ధయ్య’ పాటను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓపెన్ ప్లేస్‌లో 70ఎంఎం భారీ స్క్రీన్‌పై పాటను విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి వినూత్న ప్రయత్నం చేసిన సిద్ధయ్య టీమ్‌ను అభినందిస్తూ, పాట మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
(చదవండి: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. క్రేజీ కాన్సెప్ట్)
మరో ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ‘ఓ నా సిద్ధయ్య’ పాట ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటు పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ వేడుకకు హీరో ఇంద్రరామ్, సింగర్ నల్గొండ గద్దర్ నరసన్న, ప్రముఖ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ బోలే షావలి, నటుడు ఉత్తేజ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరంతా ‘ఓ నా సిద్ధయ్య’ టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. భారీ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్, ప్రేక్షకుల సందడి, వర్షంలోనూ కొనసాగిన వేడుకతో శంషాబాద్‌లో ఈ సాంగ్ లాంచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
‘ఓ నా సిద్ధయ్య’ పాట విషయానికొస్తే..ది భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, అనుబంధం, పరస్పర అవగాహన, జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలిచే తత్వాన్ని ఆవిష్కరించే ‘భార్యాభర్తల భావోద్వేగ ప్రేమకథ’ ఇది. పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన ఈ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌లో సిద్ధయ్య, చిట్టెమ్మ పాత్రల ద్వారా దాంపత్య జీవితంలోని సహజమైన భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించారు.


