కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘అక్క’. యష్‌రాజ్ ఫిలింస్ సమర్పణలో ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ అక్టోబరు 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మహిళల ఆధిపత్యం కొనసాగే ఓ ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. మరి ఐదు ఎపిసోడ్లతో వచ్చిన ఈ వెబ్‌సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? కీర్తి, రాధికా తమ నటనతో మెప్పించారా? రివ్యూలో చూద్దాం.

కథేంటి?
1985ల కాలం నాటి ‘పెర్నూరు’ అనే కల్పిత ప్రాంతం అది. అక్కడ దాదాపు 800 ఏళ్లుగా మహిళలే అధికారాన్ని చెలాయిస్తుంటారు. తల్లి తర్వాత కూతురే పాలనా బాధ్యతలు చేపట్టడం అక్కడి సంప్రదాయం. అందుకే ఆ ప్రాంతంలో మగపిల్లాడి కంటే ఆడపిల్ల పుడితేనే వేడుకలు చేసుకుంటారు. 18 గ్రామాలతో కూడిన ఈ ప్రాంతంలో మహిళా నాయకుల మాటే శాసనం.
అక్కడ భవానీ (కీర్తి సురేశ్) తన కుటుంబ వారసత్వాన్ని, అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు రుద్ర (రాధికా ఆప్టే) తన వ్యాపార కార్యకలాపాల కోసం బొంబాయి నుంచి పెర్నూరులోకి అడుగుపెడుతుంది. ఆమె రాకతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. అసలు రుద్ర పెర్నూరుకి ఎందుకు ఎంచుకుంది? ఆమె వెనుక ఉన్న లక్ష్యమేంటి? భవానీకి, రుద్రకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఈ పోరులో భవానీ తన అధికారాన్ని నిలబెట్టుకోగలిగిందా? అనేదే మిగతా కథ.
(ఇదీ చదవండి: విశ్వక్ సేన్ '#కల్ట్' సినిమా రివ్యూ)
ఎలా ఉందంటే?
గ్యాంగ్‌స్టర్ కథలంటే సాధారణంగా పురుషుల మధ్య ఆధిపత్య పోరు, ప్రతీకారాలు, కుట్రలే గుర్తుకొస్తాయి. కానీ ‘అక్క’లో ఈ కోణాన్ని పూర్తిగా మార్చేశారు. ఇక్కడ మహిళలదే అధికారం. వారి నిర్ణయాలే శాసనాలు. పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ప్రాధాన్యం ఉండే సమాజాన్ని కథాంశంగా ఎంచుకోవడం కొత్తగా అనిపిస్తుంది.
దర్శకుడు ధర్మరాజ్ శెట్టి ఎంచుకున్న పాయింట్ బాగుంది.కానీ దాన్ని ఆసక్తికరంగా మలచడంలోనే తడపడ్డారు. ఆసక్తికరమైన థ్రిల్లర్ అంశాలను జోడించి ఉంటే సిరీస్ స్థాయి మరోలా ఉండేది. 800 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వ్యవస్థను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి కుటుంబాల మధ్య సంబంధాలు, వారసత్వ అంశాలపై ఎక్కువ సమయం కేటాయించారు. దీంతో తొలి రెండు ఎపిసోడ్లు కాస్త నెమ్మదిగా సాగుతాయి. కథలో వేగం పెరగడానికి కొంత సమయం పడుతుంది. అయితే మూడో ఎపిసోడ్ నుంచి ఆసక్తి మొదలవుతుంది.
(ఇదీ చదవండి: ‘కిల్లర్’మూవీ రివ్యూ అండ్ రేటింగ్)
తల్లి నుంచి కూతురికి అధికారం బదిలీ కావడం, మహిళలు పెళ్లి చేసుకోకుండానే తమకు నచ్చిన జీవితాన్ని ఎంచుకునే స్వేచ్ఛ వంటి అంశాలు ఆకట్టుకుంటాయి. అయితే ఇలాంటి విభిన్నమైన సమాజం శతాబ్దాలుగా ఎలా కొనసాగిందనే విషయాన్ని మరింత లోతుగా చూపించాల్సింది. మరోవైపు రుద్ర పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో భవానీ వంటి బలమైన పాత్రకు కొన్ని సందర్భాల్లో తక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అనిపిస్తుంది.
అధికారం కోసం జరిగే పోరాటం, అవినీతి, పాత పగలు, నమ్మకద్రోహం వంటి అంశాలు కథలో ఉన్నప్పటికీ వాటిని మరింత బలంగా తెరకెక్కించాల్సింది. భవానీ ఎదుర్కొనే సమస్యలు ఒక్కొక్కటిగా పెరగడంతో కథలో ఉత్కంఠ మొదలవుతుంది. ముఖ్యంగా చివరి ఎపిసోడ్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే ఐదు ఎపిసోడ్లే ఉన్నప్పటికీ అక్కడక్కడా అనవసరమైన డ్రామా కథన వేగాన్ని తగ్గిస్తుంది.
(ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం’ రివ్యూ అండ్ రేటింగ్)

ఎవరెలా చేశారంటే?
భవానీ పాత్రలో కీర్తి సురేశ్ బాగా నటించింది. ఒక ప్రాంతాన్ని పాలించే నాయకురాలిగా ఆమెలో ఉండాల్సిన ధైర్యం, అధికారం నిలబెట్టుకోవాలనే పట్టుదల కనిపిస్తాయి. అదే సమయంలో కుటుంబం విషయంలో ఆమె ఎదుర్కొనే భావోద్వేగ సంఘర్షణలను కూడా సహజంగా పలికించింది. ముఖ్యంగా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చూపించే కఠినత్వం, తనవారి దగ్గర బయటపడే భావోద్వేగాలు పాత్రకు బలాన్నిచ్చాయి.
రుద్రగా రాధికా ఆప్టే తనదైన నటనతో ఆకట్టుకుంది. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి చేసే సన్నివేశాలు మహిళగా అదరగొట్టింది. కీర్తి, రాధికా ఎదురెదురుగా కనిపించే సన్నివేశాలు కథలో ఆసక్తిని పెంచుతాయి. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. పెర్నూరు ప్రాంతాన్ని ఆవిష్కరించిన విధానం బాగుంది. సినిమాటోగ్రఫీ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలుస్తుంది. అయితే విజువల్స్‌పై పెట్టిన శ్రద్ధ కథనం మీద కూడా పెట్టి ఉంటే ఫలితం మరింత మెరుగ్గా ఉండేది. కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. మొత్తంగా నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరిగా..
మహిళల ఆధిపత్యం, అధికారం కోసం జరిగే పోరాటం వంటి విభిన్నమైన కథాంశంతో రూపొందిన సిరీస్ ‘అక్క’. కీర్తి సురేశ్, రాధికా ఆప్టేల నటన, 1980ల నేపథ్యం, చివరి ఎపిసోడ్‌లోని యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. థ్రిల్లర్ లాంటి కథలను ఇష్టపడేవారు ఓసారి ప్రయత్నించవచ్చు.
-ప్రశాంత్ కందా


