‍విశ్వక్ సేన్ '#కల్ట్' సినిమా రివ్యూ | Vishwaksen Cult Movie Review Telugu And Rating | Sakshi
Sakshi News home page

Cult Movie Review: విశ్వక్ సేన్ కొత్త మూవీ ఎలా ఉందంటే?

Oct 30 2026 3:28 PM | Updated on Oct 30 2026 3:35 PM

Vishwaksen Cult Movie Review Telugu And Rating

తెలుగులో ఈ మధ్య యువహీరోలందరూ తమ సినిమాలకే తామే దర్శకుడిగా మారిపోతున్నారు. అలా విశ్వక్ సేన్ చేసిన లేటెస్ట్ మూవీ '#కల్ట్'(Cult Movie). దేశంలోనే తొలి ‍ష్లాషర్ ఫిల్మ్ అని దీన్ని ప్రమోట్ చేసుకున్నారు. ట్రైలర్ చూస్తే 'స్క్విడ్ గేమ్' తరహా కాన్సెప్ట్‌లా అనిపించింది. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇంతకీ ఎలా ఉంది? చూడొచ్చా లేదా?

(ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47' మూవీ రివ్యూ)

కథేంటి?
గోవాలో హోంమంత్రి కొడుకు ఎల్విన్(తారక్ పొన్నప్ప).. నాలుగేళ్లకొకసారి వచ్చే తన పుట్టినరోజుని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తాడు. #కల్ట్ అనే పబ్ దీనికి వేదిక. ఇందులోకి ఎంజాయ్ చేద్దామని చెప్పి అనుకోని విధంగా హైదరాబాద్‌కి చెందిన ముగ్గురు కుర్రాళ్లు వెళ్తారు. కొంతసేపటి వరకు బాగానే ఉంటుంది గానీ తర్వాత పరిస్థితులు దారుణంగా తయారవుతాయి. లోపల స్క్రీన్‌పై కనిపించే ఓ బొమ్మ.. కొన్ని గేమ్స్ పెట్టి, ఓడిపోయిన వాళ్లని నిర్ధ్యాక్షిణంగా చంపడం మొదలుపెడుతుంది. ఇంతకీ వీళ్లని చంపుతుందెవరు? ఇదే పబ్‌లో డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్) ఎందుకున్నాడు? ఇతడు బతికి బయటపడ్డాడా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడే అందరూ ఇదేంటి ఓటీటీ సిరీస్ 'స్క్విడ్ గేమ్'లా ఉంది అని అనుకున్నారు. ఊహించినట్లే అలానే మొదలైంది. కాకపోతే ఆ సిరీస్‌లోని క్లైమాక్స్-కాన్సెప్ట్ ఒకటి కాగా ఇందులో మరొకటి. తెలుగు సినిమా కమర్షియల్ అంశాల్ని ఇందులో జోడించారు. అయితే మూవీ ఎలా ఉంది? అని అడిగితే పర్లేదు బాగానే ఉంది.

ఓవైపు హోంమంత్రి కొడుకు బర్త్ డే పార్టీకి ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు ముగ్గురు హైదరాబాదీ కుర్రాళ్లని చూపించడంతో సినిమా మొదలైంది. వీళ్లిద్దరూ ఒక్కచోటకు ఎలా చేరారు? తర్వాత పార్టీలో ఎంత రక్తపాతం జరిగిందనేది తర్వాత సీన్లలో ఉంటుంది. ఈ సినిమాలో తెరపై రక్తం నిండుగా కనిపించినప్పటికీ ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేకపోతాం. ఏ పాత్రతోనూ సరిగా ట్రావెల్ కాలేకపోతాం. ఇందులో విశ్వక్ పాత్రనే హీరో. సినిమా మొదలైన గంట తర్వాత గానీ విశ్వక్ చేసిన సంకీ పాత్ర రాదు. అప్పటివరకు ఏదేదో జరుగుతూ ఉంటుంది. స్టోరీ ఫ్లాట్‌గా వెళ్తుంది.

ఎప్పుడైతే డీఎస్పీ సంకల్ప్ నాయక్ అలియాస్ సంకీ పాత్ర ఎంటర్ అవుతుందో అప్పటినుంచి స్టోరీలో సంఘర్షణ మొదలవుతుంది. అప్పటివరకు లోపలున్న వాళ్లు చనిపోతూ ఉంటారు. సంకీ వచ్చి ఒక్కొక్కళ్లని తిరిగి చంపడం మొదలుపెడతాడు. సెకండాఫ్ కొంతమేర ఎంగేజింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే విలన్ ఫ్లాష్ బ్యాక్ రొటీన్. కానీ ఎల్విన్ పాత్రతో వచ్చే ట్విస్ట్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మత్తుపదార్థాల సేవించొద్దు అది మన ఆరోగ్యానికే కాదు పక్కనోళ్లకు, సమాజానికి కూడా హానికరం అని ఇచ్చిన మెసేజ్ ఓకే ఓకే.

ఎవరెలా చేశారు?
ఈ సినిమాకు హీరో కమ్ దర్శకుడు విశ్వక్ సేన్. నటుడిగా ఆకట్టుకున్నప్పటికీ.. దర్శకుడిగా ఇంకాస్త దృష్టిపెట్టి ఫస్టాప్ ఎంగేజింగ్‌గా రాసుకుని ఉంటే బాగుండేది. ఎల్విన్‌గా చేసిన తారక్ పొన్నప్ప ఓకే అనిపించగా, మాయ పాత్రలో గాయత్రి భరద్వాజ్ గ్లామర్ ఆరబోసింది. ముగ్గురు కుర్రాళ్లుగా చేసిన వాళ్లు ఓకే. మిగిలిన పాత్రధారులు తమకిచ్చిన పనికి న్యాయం చేశారు.

ఈ సినిమా ప్రారంభం నుంచి చివరివరకు ఒకే ఇంట్లో జరుగుతుంది. కానీ సినిమాటోగ్రఫీ బాగా చేశారు. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగానే ఉన్నప్పటికీ కాసేపటి తర్వాత పదేపదే ఒకటే రిపీట్ అయినట్లు అనిపించింది. అసలు విషయానికొస్తే.. ఈ మూవీ కేవలం యువతని దృష్టిలో పెట్టుకునే తీశారు. బూతులు, రక్తం, తలలు తెగిపడటం లాంటివి ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో చూడొద్దు.

- చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్

(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement