టైటిల్:ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47
నటీనటులు:వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు
నిర్మాణ సంస్థ: హారిక అండ్ హాసిని క్రియేషన్స్
నిర్మాత: ఎస్. రాధాకృష్ణ(చినబాబు)
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ:రవి కె. చంద్రన్
ఎడిటింగ్: నవీన్ నూలి
విడుదల తేది: అక్టోబర్ 30, 2026

వెంకటేశ్ అంటే ఫ్యామిలీ హీరో.. త్రివిక్రమ్ అంటే మాటల మాయాజాలం, కుటుంబ బంధాలు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో అంచనాలు సహజంగానే పెరుగుతాయి. అందుకే ‘ఆదర్శ కుటుంబం’పై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది.ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌తో ఆ ఆసక్తి మరింత పెరిగింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా బాగానే చేయడంతో ‘ఏకే 47’పై హైప్ క్రియేట్ అయింది. ఇలా భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 30) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? మరోసారి వెంకీ తనదైన కామెడీ, ఎమోషన్స్‌తో మెప్పించారా? త్రివిక్రమ్ తన మాటలతో మ్యాజిక్ చేశారా? ఈ ఇద్దరి కాంబినేషన్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించింది? రివ్యూలో చూద్దాం.

కథ ఏంటంటే..
చిట్టిబాబు(వెంకటేశ్) ప్రైవేటు ఎంప్లాయ్. భార్య స్వర్ణ(శ్రీనిధి శెట్టి) చిట్టీల వ్యాపారం పేరుతో అప్పులు చేస్తూ ఉంటుంది. అప్పు కట్టలేక ఇంటి నుంచి బయటకి రాదు. కాలేజీ చదువుతున్న కూతురు సంపూర్ణ (యువీనా) .. బైక్ మెకానిక్...ఆటో డ్రైవర్ లాంటి వాళ్ళతో ప్రేమలో పడుతూ..నాన్నకి తల నొప్పి తెప్పిస్తుంది. మరోవైపు కొడుకు శర్వ(రాజా ప్రజ్వల్)కు చదువు రాదు. గుండె సమస్యతో బాధ పడుతూ ఉంటాడు. ఆపరేషన్ కి రూ. 2 లక్షలు అవుతుంది అని డాక్టర్లు చెబుతారు.
ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చిట్టి బాబుకు ఉన్న ఉద్యోగం కూడా పోతుంది. అప్పులను ఎలా తీర్చాలి? అని బాధపడుతున్న సమయంలో రూ. 100 కోట్ల లాటరీ తగులుతుంది. ఆ డబ్బులు చేతికి రాకముందుకే చిట్టిబాబు ఫ్యామిలీ ఒక విల్లాకు షిఫ్ట్ అవుతుంది. రూ.వందకోట్లు వచ్చాయనే సంగతి తెలిసి హత్యలు చేసి ఉన్న డబ్బంతా తీసుకెళ్ళే బీహార్ గ్యాంగ్ చిట్టిబాబు ఇంటిని టార్గెట్ చేస్తుంది. కారు డ్రైవర్ గా, పని మనిషిగా చేరి డబ్బులు ఇంటిని వచ్చిన రాత్రి ఎటాక్ చేస్తారు. బిహార్ గ్యాంగ్ మంచి ఫ్యామిలీని కాపాడుకోవడానికి చిట్టిబాబు ఏం చేశాడు? అసలు అతని గతమేంటి? రూ.100 కోట్ల లాటరీ వెనుక ఉన్న అసలు విషయం ఏంటి? చిట్టి బాబు ఇంటిపై దాడికి వచ్చిన బిహారీ గ్యాంగ్ కనిపించకుండా పోవడానికి గల కారణం ఏంటి? ఎస్పీ (నారా రోహిత్) ఈ కేసును ఎలా డీల్ చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..?
వెంకటేశ్ అంటేనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గుర్తొస్తుంది. అటు త్రివిక్రమ్ సినిమాల్లోనూ కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, వినోదానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తుందంటే సహజంగానే ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతాయి. అందుకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అందించే ప్రయత్నం చేశాడు. అయితే ఈసారి కుటుంబ కథకు కొంత క్రైమ్, యాక్షన్ జోడించి కొత్త కోణంలో కథను నడిపించాడు.
ఈ సినిమా కోసం త్రివిక్రమ్ పూర్తిగా కొత్త ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేయలేదు. మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు, నిత్యం వార్తల్లో కనిపించే అంశాలనే కథకు ప్రధాన ఆధారంగా తీసుకున్నట్లు అనిపిస్తుంది. దీంతో కథలోని కొన్ని అంశాలు ప్రేక్షకులకు కొత్తగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలను ఇప్పటికే వార్తల్లోనూ, వాస్తవ జీవితంలోనూ చూస్తున్నాం.
(ఇదీ చదవండి: ‘కిల్లర్’మూవీ రివ్యూ అండ్ రేటింగ్)
అయితే వాస్తవ సంఘటనలకు దగ్గరగా ఉండే అంశాలను తీసుకోవడం మాత్రమే కథనానికి బలం కాదు. వాటిని ఆసక్తికరమైన కథగా మలచడం, పాత్రల మధ్య సంఘర్షణను బలంగా చూపించడం, భావోద్వేగాలను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా కుటుంబ అనుబంధాలను ప్రధానంగా చూపించే కథలో క్రైమ్, యాక్షన్ అంశాలు సహజంగా ఇమిడితేనే అవి కథకు అదనపు బలంగా నిలుస్తాయి. లేదంటే అవి కథలో విడిగా కనిపించే ప్రమాదం ఉంది. వెంకటేశ్ ఇమేజ్‌కు సరిపోయే కుటుంబ నేపథ్యం, త్రివిక్రమ్‌కు అలవాటైన సంభాషణలు, వినోదాన్ని ఆశించే ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే ఈ రెండు బలాలను ఉపయోగించుకొని కథను ఆసక్తికరంగా చెప్పడంలో మాత్రం త్రివిక్రమ్ కొంతవరకు మాత్రమే సఫలమయ్యాడు.
సినిమా చూస్తున్నంతసేపు వెంకటేష్ దృశ్యం తో పాటు ఇటీవల వచ్చిన బ్లాస్ట్ జోన్ సినిమాలోని కొన్ని సన్నివేశాలు గుర్తొస్తాయి. ఫస్టాఫ్ అంతా త్రివిక్రమ్ మార్క్ కామెడీ, పంచ్ డైలాగ్స్‌తో సరదాగా సాగిపోతుంది. ఆయన సినిమాల్లో కనిపించే ఫన్నీ సంభాషణలు చాలావరకు ఇందులోనూ కనిపిస్తాయి. అయితే ఈసారి కామెడీతో పాటు క్రైమ్ ఎపిసోడ్స్‌కు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. యాక్షన్ సన్నివేశాలు కథపై ఆసక్తిని పెంచుతాయి. సత్య కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అప్పటివరకు ఒక దారిలో వెళ్తున్న కథ ఒక్కసారిగా కొత్త మలుపు తీసుకోవడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది.
ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. ట్విస్ట్ తెలిసిన తరువాత అంత అసక్తి గా అనిపించదు. అక్కడక్కడా వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఆకట్టుకుంటాయి.చివరి పావు గంట ఆసక్తికరంగా సాగుతుంది. కథలో కొత్తదనం ఆశించకుండా క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలనుకునే వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది

ఎవరెలా చేశారంటే..
మిడిల్ క్లాస్ భర్తగా నటించడం వెంకటేశ్‌కి కొత్తేమి కాదు.గతంలో చాలా సినిమాల్లోనూ ఈ తరహా పాత్రలు చేశాడు. అందుకే చిట్టిబాబు పాత్రను ఆయన అవలీలగా పోషించాడు. తనదైన కామెడీతో కొన్ని చోట్ల నవ్విచడంతో పాటు యాక్షన్ సీన్లు కూడా బాగానే చేశాడు. ఇక హీరో భార్యగా శ్రీనిధి శెట్టి బాగానే చేసింది. తెరపై చాలా అందంగాను నటించింది. చిట్టిబాబు కూతురు సంపూర్ణ యువీనా తన పాత్ర పరిధిమేర నటించింది. ఇక హీరో కొడుకు శర్వగా రజా ప్రజ్వల్ బాగా చెేశాడు. సత్య తెరపై కనిపించిన ప్రతిసారి నవ్వులు పూశాయి. పోలీసాఫీసర్‌గా నారా రోహిత్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్ తెరపై రిచ్‌గా కనిపించింది. ఎడిటింగ్ షార్ప్‌గానే ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.


