తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటి జయలలిత జీవితకథ ఆధారంగా ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కాయి. తాజాగా మరోసారి ఆమె జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి త్రిష పేరు తెరపైకి వచ్చింది. ఎంజీఆర్ జీవితకథతో రూపొందనున్న ‘పురట్చి తలైవర్ ఎంజీఆర్’ సినిమాలో జయలలిత పాత్ర కోసం త్రిషను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.
ఎంజీఆర్‌గా జేఎం బషీర్
‘పురట్చి తలైవర్ ఎంజీఆర్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రను నటుడు జేఎం బషీర్ పోషించనున్నారు. ఆయన గతంలో ‘పసుంపొన్ దేవర్’ చిత్రంలో నటించారు. ఎంజీఆర్ బాల్యం, సినీ ప్రయాణం, రాజకీయ ప్రస్థానాన్ని ఈ చిత్రంలో చూపించనున్నట్లు సమాచారం. త్వరలోనే చెన్నైలోని రామాపురంలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాలో కరుణానిధి, అన్నాదురై పాత్రలు కూడా ఉండనున్నాయి. ప్రస్తుతం ఆయా పాత్రలకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. దర్శకుడు, సంగీత దర్శకుడి వివరాలను చిత్రబృందం వెల్లడించాల్సి ఉంది. త్రిష ఎంపికపై అధికారిక ప్రకటన వస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
(ఇదీ చదవండి: ‘కిల్లర్’మూవీ రివ్యూ అండ్ రేటింగ్)


