సౌమిత్, శ్రేయసి సేన్, కమల్ కామరాజు, గీతా భాస్కర్, చైత్ర ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. ఈ మూవీని నవంబర్ 20న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో గురువారం నాడు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ చేతుల మీదుగా సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ .. ‘ఆస్ట్రోనాట్ అవ్వాలనే కోరిక ఉండటం, ఆ కోరిక చుట్టూ కథను తీయడం బాగుంది. ఈ అమ్మాయి కూడా చక్కగా నటించింది. ఇది చాలా మంచి ప్రయోగం. ఎవరైనా సరే ఎంత పెద్ద కలలైనా కనొచ్చు, వాటిని సాకారం చేసుకోవచ్చు అనే గొప్ప సందేశాన్ని ఇచ్చేలా సినిమాని రూపొందించారు. టెక్నికల్లీ ఈ చిత్రం ఎంతో క్వాలిటీగా ఉందనిపిస్తోంది. ఇదొక గొప్ప సినిమాగా నిలుస్తుంది. ఈ మూవీ నవంబర్ 20న రిలీజ్ కాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
కమల్ కామరాజ్ మాట్లాడుతూ .. ‘‘డియర్ ఆస్ట్రోనాట్’ లాంటి చిత్రాన్ని తెర మీదకు తీసుకు రావడమే గొప్ప సాహసం. కథకు ప్రాధాన్యమున్న చిత్రమిది. ఓ అమ్మాయి, వారి భావోద్వేగాలను చూపించే సినిమా. కలలు కంటే సాకారం అవుతాయా? లేదా? అన్నది మనకు తెలీదు. కానీ పెద్ద కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలని చెప్పే గొప్ప సందేశంతో ఈ మూవీని తీశారు. అందరికీ స్పూర్తినిచ్చే చిత్రం. కథ విన్నప్పుడే అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకున్నాను’ అని అన్నారు.
నటి శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ .. ‘శేఖర్ కమ్ముల గారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. భాగ్యరాజా గారు నన్ను నమ్మి ఈ అవకాశాన్ని ఇచ్చారు. సౌమిత్ గారు అద్భుతంగా నటించారు. ఆకాశ్, అంజలికి ఆల్ ది బెస్ట్. నవంబర్ 20న ఈ చిత్రం రాబోతోంది. ఇందులో అన్ని రకాల అంశాలుంటాయి. అందరూ చూడండి’ అని అన్నారు.


