రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా వస్తోన్న మూవీ రామాయణ. ఈ సినిమాకు నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నవంబర్ 5న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవలే కాలిఫోర్నియాలో రామాయణ ప్రీమియర్ షో సైతం ప్రదర్శించారు.
అయితే ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే పాకిస్తాన్‌లోని హిందువులు సైతం రామాయణ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పాకిస్తాన్‌లోని కరాచీలో హిందూ ఈ మూవీ పోస్టర్స్‌ను ప్రదర్శించింది. హ్యాపీ దీపావళి అంటూ రామాయణ టీమ్‌కు అభినందనలు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను స్థానిక యూట్యూబర్ పంచుకున్నారు. అంతేకాకుండా రామాయణ సినిమా పోస్టర్ పట్టుకుని వీధుల గుండా తిరుగుతూ ఒక ఆలయం వద్ద ప్రదర్శించారు. ఈ సందర్భంగా రామాయణ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కొందరైతే ఈ చిత్రం ఆస్కార్ గెలవాలని ఆకాంక్షించారు.
వారిలో ఒకరు మాట్లాడుతూ.. "పాకిస్తానీ హిందువులుగా మాకు రామాయణం కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువ. దాని కాలాతీత కథ, సాంస్కృతిక ప్రాముఖ్యత మనల్ని మన సంప్రదాయాలతో, తరతరాల వారసత్వంతో అనుసంధానం చేస్తుంది. ఈ వేడుక ద్వారా మా ఆనందాన్ని పంచుకుంటున్నాం. రామాయణ చిత్ర బృందానికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించాలని ఆశిస్తున్నాం" అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో రావణుడిగా కేజీఎఫ్ హీరో యశ్ కనిపించనున్నారు. ఈ మూవీని నమిత్ మల్హోత్రా నిర్మించగా.. పార్ట్-1 నవంబర్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రెండవ భాగం 2027 దీపావళికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.


