పుట్టినరోజు వేడుకల వేళ ఆనందంగా ఉండాల్సిన హీరో, దర్శకుడు షిరాజ్ మెహదీ.. తన సినిమా విడుదలకు ఎదురవుతున్న అడ్డంకులను ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంతో కష్టపడి రూపొందించిన ‘ఓ అందాల రాక్షసి’ చిత్రానికి థియేటర్లు కేటాయించడం లేదని, చిన్న సినిమాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఆరోపించారు. బంజారాహిల్స్‌లోని ‘అఆ సినీ స్టూడియోస్’లో మీడియా ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలు, ప్రెస్‌మీట్‌లో తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన వివరించారు.
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని షిరాజ్ మెహదీ అన్నారు. నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో శ్రమించి సినిమాలు రూపొందిస్తున్నా.. వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు సరైన అవకాశాలు లభించడం లేదని పేర్కొన్నారు. వంద సినిమాలు విడుదలైతే రెండు, మూడు చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందని, మిగిలిన సినిమాలు థియేటర్ల సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. పెట్టుబడులు తిరిగి రాక నిర్మాతలు ఆర్థికంగా నష్టపోతున్నారని, ఇతర ఆదాయ మార్గాలు కూడా అందుబాటులో లేకపోవడంతో పరిశ్రమలో అనిశ్చితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
(చదవండి: అందుకే శ్రీనిధి శెట్టి పాదాలకు దండం పెట్టా : త్రివిక్రమ్)
తన సినిమా ‘ఓ అందాల రాక్షసి’ విడుదల కోసం గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో థియేటర్లు లభించడం లేదని షిరాజ్ మెహదీ తెలిపారు. గత నాలుగైదేళ్లుగా చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపు కష్టంగా మారిందని, హైదరాబాద్‌లోనూ పరిమిత సంఖ్యలో స్క్రీన్లు మాత్రమే లభిస్తున్నాయని ఆరోపించారు. థియేటర్లలో ప్రదర్శనకు సంబంధించిన వివరాలు చివరి నిమిషం వరకు తెలియకపోవడం వల్ల నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తన చిత్రానికి ఆడియో, ఓటీటీ, శాటిలైట్, ఇతర భాషల హక్కుల విషయంలోనూ ఆశించిన అవకాశాలు లభించలేదని పేర్కొన్నారు.
చిన్న సినిమాల సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి సారించాలని షిరాజ్ మెహదీ విజ్ఞప్తి చేశారు. థియేటర్ల కేటాయింపు, సినిమా విడుదల, ఇతర హక్కులకు సంబంధించిన సమస్యలపై సమగ్రంగా పరిశీలించి, చిన్న నిర్మాతలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీకి అవకాశం కల్పించి, చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా విధానపరమైన మార్పులు తీసుకురావాలని సూచించారు. మంచి సినిమాలు రూపొందించే వారికి సరైన అవకాశాలు లభించినప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.


